సీఎంపై సతీష్‌ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!

ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు.

Updated : 20 Apr 2024 07:03 IST

అక్కడ వాంగ్మూలాలు నమోదు చేసి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం
తమకు అనుకూలంగా రాయించుకునేందుకు పోలీసుల కట్టుకథలు!
గులకరాయి కేసులో సాక్షుల స్టేట్‌మెంట్లలో చిత్రవిచిత్రాలు

ఈనాడు, అమరావతి: ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఎక్కడైనా వీఆర్వో వద్దకు వెళ్లి సమాచారం పంచుకోవడం చూశామా? అక్కడ ఆ వ్యక్తి స్టేట్‌మెంట్‌ను వీఆర్వో నమోదు చేసి దానిపై పోలీసులకు సమాచారం ఇవ్వడం విడ్డూరంగా లేదూ? పోనీ ఇది ఎక్కడో మారుమూల తండాలో జరిగింది కాదు. పరిపాలన కేంద్రమైన విజయవాడ నగరంలో అదీ పోలీస్‌స్టేషన్‌కు కిలోమీటరున్నర దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశారంటే నమ్మశక్యంగా ఉందా? ఘనమైన విజయవాడ నగర పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు. గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేస్‌ డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే అదేంటో ఇట్టే అర్థమవుతోంది.

భయపడి వీఆర్వో వద్దకు!

ఈ నెల 13న రాత్రి ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విజయవాడ శివారు సింగ్‌నగర్‌లోని డాబాకొట్ల రోడ్డులో గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి స్వల్పగాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో అంతా చీకటిగా ఉంది. రాయి విసిరిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు తేలిపోకుండా ఉండేందుకు పోలీసులు నానా తిప్పలు పడినట్లు కనిపిస్తోంది. 16వ తేదీన సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మేజర్‌ అయిన సతీష్‌ను ఏ1గా చూపించారు. మిగిలినవారు మైనర్లు. ఇందులో ఇద్దర్ని సాక్షులుగా చేర్చారు. ‘జగన్‌పై రాయితో దాడి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని సతీష్‌కు తెదేపా నాయకుడు దుర్గారావు ఆశ చూపించారు’ అని వారు స్టేట్‌మెంట్‌లో చెప్పినట్లు పేర్కొన్నారు. సతీష్‌ రాయి విసిరాడని తొమ్మిదో సాక్షిగా ఉన్న బాలుడు తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడట. ఇది విని భయపడిన ఎల్లయ్య వెంటనే కుమారుణ్ని నార్త్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. జగన్‌పై సతీష్‌ రాయి విసిరాడని చెప్పగానే.. అక్కడున్న వీఆర్వో తండ్రీకుమారుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, వాటిని పోలీసులకు పంపినట్లు కోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లలో ఉంది. దీంతో పోలీసులు తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు రాయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

12 మంది సాక్షులు

గులకరాయి కేసులో పోలీసులు 12 మందిని సాక్షులుగా చేర్చారు. ఇందులో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి, వైకాపా నేత పోతిన మహేష్‌, జగన్‌ వ్యక్తిగత సహాయకుడు మనోహర్‌ నాయుడిని చూపించారు. ఏడు, ఎనిమిదో సాక్షులుగా నందిగామ ఏసీపీ రవికాంత్‌, నందిగామ సీఐ హనీష్‌ పేర్లను చేర్చారు. ఇద్దరు బాలురు, వీఆర్వో స్వర్ణలత, ఓ బాలుడి తండ్రి దుర్గారావును సాక్షుల జాబితాలో పెట్టారు.

న్యాయాధికారికి అడ్వొకేట్‌ కమిషనర్‌ నివేదిక

వడ్డెర కాలనీకి చెందిన వారి ఆచూకీ కోసం కోర్టు అనుమతితో అడ్వొకేట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ గురువారం రాత్రి సింగ్‌నగర్‌ స్టేషన్‌, పశ్చిమ ఏసీపీ కార్యాలయం, సీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ మూడు చోట్లా ఎవరూ లేరని ఆయన న్యాయాధికారి రమణారెడ్డికి నివేదిక సమర్పించారు. రిమాండ్‌ పడిన ఏ1 సతీష్‌ను నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎస్కార్ట్‌ లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి నిందితుణ్ని విజయవాడ కారాగారంలోనే ఉంచారు.


3 రోజులు దాటినా తెదేపా నాయకుడి జాడ లేదు

ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు సింగ్‌నగర్‌ నుంచి వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు. మూడు రోజులవుతున్నా పోలీసులు ఆయన అరెస్టు చూపలేదు. కుటుంబసభ్యులకు సమాచారమూ ఇవ్వలేదు. ఆయన్ను విచారించి ఇంకా ఎవరినైనా ఈ కేసులో ఇరికించే అవకాశం ఉందని, అందుకే పోలీసులు జాప్యం చేస్తున్నారనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని