సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి!

దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్‌చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది.

Updated : 20 Apr 2024 06:40 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్‌చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేసులో సీబీఐ భారాస ఎమ్మెల్సీ కవితను ఈనెల 11న అరెస్ట్‌ చేసి 12న ఈ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఆరోజు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో శరత్‌చంద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ట్రైడెంట్‌ క్యాంఫర్‌, ఆర్గానమిక్స్‌, శ్రీఅవంతిక సంస్థలకు 5 జోన్లు కేటాయించారని,  ఈ కంపెనీలన్నీ అరబిందో ఫార్మా గ్రూప్‌నకు చెందినవేనని పేర్కొంది. ఈ 5 జోన్లు పొందినందుకుగాను ఆయన భూలావాదేవీ పేరుతో కవితకు రూ.14 కోట్లు చెల్లించారని తెలిపింది.

వాస్తవంగా ఎలాంటి భూ బదిలీ జరగలేదని పేర్కొంది. దిల్లీ మద్యం వ్యాపారంలో సాయం చేస్తానని కవిత ఇచ్చిన హామీ మేరకు శరత్‌చంద్రారెడ్డి ఆమె ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి సంస్థకు రూ.80 లక్షలు ఇచ్చారని పేర్కొంది. దిల్లీలో కేటాయించిన 5 రిటైల్‌ జోన్లలో ఒక్కోదానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత 2021 నవంబరు-డిసెంబరులలో ఆయన్ను అడిగారని, అయితే డిమాండ్‌ చేసినంత డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించడంతో తెలంగాణ, దిల్లీల్లో వ్యాపారాలను దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు అందులో వెల్లడించింది. ఆయన ఈ అంశాలన్నింటిపై సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ కింద స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని