సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు

ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 05:10 IST

మెరుగైన సమాజానికి ఎన్నికలు దోహదం చేయాలి
ఓటర్లు విచక్షణతో ఆలోచించి నేతలను ఎన్నుకోవాలి
రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి

ఈనాడు- అమరావతి, గుంటూరు నగరం- న్యూస్‌టుడే: ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తీరుతెన్నులు’ అంశంపై శుక్రవారం నిర్వహించిన ముఖాముఖిలో చిన్నయసూరి మాట్లాడారు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమన్న అభిప్రాయం ఒకవైపు ఉండగా, మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో విలువలు పతనావస్థకు చేరాయన్నదీ ప్రస్తావించదగిందేనని అన్నారు. రాజకీయ నాయకులు అవినీతి, ధనార్జన, స్వప్రయోజనాలకే అధికారం చేపడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్య   పతనానికి సంకేతమని వివరించారు. చిన్నయసూరి ఏమన్నారంటే..

అందరి నిర్ణయాలను గౌరవించాలి

‘ప్రతి ఓటరు వివరాలు నేతల వద్ద ఉండడం వల్ల ప్రస్తుత ఎన్నికల్లో అక్రమాలకు అవకాశమేర్పడుతోంది. ఫలితంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా సమాచార విస్తృతి పెరుగుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. భిన్నాభిప్రాయాలున్న వారు సమష్టిగా ఒక నిర్ణయాన్ని అంగీకరించే అద్భుతమైన ప్రక్రియ ఎన్నికలు. ఓటేసే ప్రతి ఒక్కరూ సమానమే. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు.. పనితీరు నచ్చకపోతే తిరస్కరించనూవచ్చు. నిర్ణీత కాలానికి స్వేచ్ఛగా, ధర్మబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనే నిర్ణయాన్ని చేసే ప్రక్రియ సజావుగా జరగడం, ప్రతి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజలు వాస్తవాలను అంచనా వేసుకుని విచక్షణతో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి’.

మాఫియా జోక్యం ప్రజాస్వామ్యానికి చేటు

‘ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడంతోపాటు ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతోంది. ఇదే సమయంలో రాజకీయ అవినీతి, నిరంకుశ నాయకత్వం, సహజ వనరుల దోపిడీ పెరగడం దురదృష్టకరం. ప్రపంచంలో పలుచోట్ల నిర్బంధ ఓటింగ్‌లో పాల్గొనడంపాటు స్వచ్ఛందంగా పాల్గొనే విధానమూ అమలులో ఉంది. మన దేశంలో కులం, మతం, ప్రాంతాలు, నాయకుల ప్రాతిపదికతోపాటు పార్టీలపై అభిమానం, సిద్ధాంతాలు, భావజాలం చూసి ఓటు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ దుష్ట సంస్కృతి. పెత్తందారులు, మాఫియా నేతలు భయపెట్టి మద్దతు కోరడం ప్రజాస్వామ్యానికి చేటు’.

రాజకీయాల్లో గుత్తాధిపత్యం

‘దేశంలో పార్టీల మధ్య సైద్ధాంతిక భావజాల అంతరాలు తగ్గిపోవడం వల్ల మౌలికమైన విధానాల్లో తేడా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు సున్నితమైన విశ్లేషణ చేసి ఒకరికంటే మరొకరు మెరుగ్గా ఉన్నారన్న అంశాలను గుర్తించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. పార్టీలకంటే వ్యక్తుల ప్రాధాన్యం పెరిగింది. నేడు పార్టీ అంటే ఒక నాయకుడే కనిపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాయకులు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీలను సొంత ఆస్తులుగా వారసులకు ఇస్తున్నారు. రాజకీయాల్లో గుత్తాధిపత్యం వల్ల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం పతనమవుతోంది. మెరుగైన సమాజం వైపు పయనానికి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే నాయకులను ఎన్నుకోవాలి’ అని చిన్నయసూరి సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో కార్పొరేట్‌ సంస్థలు, ధనవంతులు, వ్యాపారవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలో ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించే పరిస్థితికి రాజకీయాలు పతనమయ్యాయని ఏఎన్‌యూ పూర్వ రిజిస్ట్రార్‌ రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు