అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి

అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్‌ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు.

Published : 20 Apr 2024 05:10 IST

షిర్డీసాయి, అదానీ సంస్థలకు సాగునీటి వనరులు
జగన్‌ నిర్వాకంతో ప్రమాదంలో రైతుల భవిష్యత్తు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై హామీలన్నీ గాలికి
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం బస్సుయాత్ర

ఈనాడు, అనకాపల్లి: అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్‌ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. అంతటితో ఆగకుండా అనకాపల్లి జిల్లాలోని సాగునీటి వనరులను తన అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి.. అన్నదాతల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేశారు. సహకార చక్కెర కర్మాగారాల్ని మూసివేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. అయిదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీ నెరవేర్చని జగన్‌.. మళ్లీ ఓట్లు అడగడానికి శనివారం జిల్లాకు రానున్నారు.

జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా..

  • రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షాన ఉన్నానంటూ జగన్‌ ఊదరగొడుతుంటారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని షిర్డీసాయి, అదానీ వంటి అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి.. పేద రైతుల గొంతుకోసిన జగన్‌ పేదల పక్షాన ఉన్నట్టా? పెత్తందార్లకు ఊడిగం చేస్తున్నట్టా? జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయర్‌ కింద.. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయంలో సరిపడినన్ని నీళ్లు ఉండవని జలవనరులశాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఈ రిజర్వాయర్‌ కింద వారబందీ విధానంలో నీళ్లు విడిచిపెట్టారంటే సాగునీటికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో అర్థమవుతుంది. అలాంటి ప్రాజెక్టుకు ఎగువున కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ నెలకొల్పనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు 0.56 టీఎంసీ నీళ్లు కేటాయించారు. ఆ మేరకు తాండవ జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గిపోతుందని జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్‌ పెడచెవిన పెట్టారు.
  • రైవాడ జలాశయం నీటిని పూర్తిగా సాగునీటి అవసరాలకే వినియోగించేలా చూస్తామని, అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైవాడ జలాశయం కింద 44 గ్రామాల పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టు ఉంది. జీవీఎంసీ తాగునీటి అవసరాలకు రోజూ 50 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువున అనంతగిరి మండలంలోని పెదకోట వద్ద అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టుకు 0.39 టీఎంసీ నీళ్లు కేటాయించారు.

ప్రాజెక్టుకు నిధులివ్వలేదు

‘మా నాన్న శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తాను. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో పెట్టి రెండు దశల్లో పూర్తి చేస్తాం’ అని గొప్పగా చెప్పిన జగన్‌, అయిదేళ్లలో ఒక్క పైసా నిధులివ్వలేదు. ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరందించే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు తెదేపా హయాంలో రూ.2,022 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా దశ పనులకు టెండర్లు పూర్తి చేసినా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 16,046 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సర్వే చేసి ల్యాండ్‌ పొజిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. నిధుల్లేక పనులు ముందుకు కదల్లేదు. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థల్లో కొన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి.

చక్కెర కర్మాగారాలు మూసేసి..

  • జగన్‌ పాలనలో మూడు సహకార చక్కెర కర్మాగారాలు మూసేశారు. తుమ్మపాల కర్మాగారాన్ని విక్రయించాలని నిర్ణయించారు. లిక్విడేటర్‌ని పెట్టి ఆస్తులు అంచనా వేయించారు. రైతులు అడ్డుకుని కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.
  • పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని 2021లో మూసేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. బకాయిల కోసం జరిగిన ఉద్యమంలో ఒక రైతు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎప్పటికో చెల్లించారు. 350 మంది ఉద్యోగులకు నేటికీ పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేదు. ఇంకా రూ.13.50 కోట్లు పెండింగ్‌లో ఉంచారు.
  • ఏటికొప్పాక చక్కెర కర్మాగారం సిబ్బందికి రూ.8.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక పరిశ్రమల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 15 వేల మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని