దార్శనిక నేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ పుస్తకం రూపొందించారు.

Updated : 20 Apr 2024 06:38 IST

సమైక్యాంధ్ర, నవ్యాంధ్రల అభివృద్ధికి మేలు బాటలు
అభివృద్ధి, సంక్షేమాలకు సమప్రాధాన్యం
ఆయన రాజకీయ ప్రస్థానంపై పుస్తకం
రూపొందించిన తెదేపా నేత టీడీ జనార్దన్‌

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ పుస్తకం రూపొందించారు. దాన్ని చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించారు. చంద్రబాబు దార్శనికత, అభివృద్ధి, సంక్షేమాల్ని సమతుల్యం చేస్తూ ఆయన పాలన తీరును పుస్తకంలో వివరించారు. ప్రతి పేజీలో రెండు ఫొటోలు, దాని పక్కన ఆయా పథకాలు, కార్యక్రమాల గురించి రెండు మూడు వాక్యాల్లో స్వల్ప వివరణతో పుస్తకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం ఈ పుస్తకంతో కళ్లముందు ఆవిష్కృతం అవుతుంది. స్ఫూర్తిదాయక ప్రస్థానం-ఉజ్వల ఘట్టాలు, ఉత్తమ పరిపాలన-మెరుగైన సేవలు, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం, వ్యవసాయం-రికార్డు స్థాయి అభివృద్ధి, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, సాగునీటి రంగం, పారిశ్రామికాభివృద్ధి వంటి విభాగాల్లో... ఆయా రంగాలకు సంబంధించి చంద్రబాబు చేసిన కృషిని తేదీలు, చిన్న చిన్న పాయింట్ల రూపంలో వివరించారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి, ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన మలుపులకు సంబంధించిన ప్రతి సమాచారాన్నీ దీనిలో పొందుపరిచారు.

పరిపాలనకు ఆధునికత అద్దిన నాయకుడు

పాలనను కంప్యూటరీకరించి సేవల్లో వేగం, పారదర్శకత తేవడం, జవాబుదారీతనాన్ని పెంచడం, ప్రభుత్వ పథకాలు, సేవల సమాచారం ఒకేచోట లభించేలా చూడటం, ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సేవలు పొందే అవకాశం కల్పించడం వంటి చంద్రబాబు చేపట్టిన విప్లవాత్మక చర్యల గురించి వివరించారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కార్డ్‌, ఫాస్ట్‌, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌, మీ కోసం వంటి వినూత్న విధానాలతో చంద్రబాబు స్మార్ట్‌ గవర్నెన్స్‌ను ప్రజల ముంగిటకు తెచ్చారని పేర్కొన్నారు.

సంక్షేమానికి సరికొత్త నిర్వచనం

సమాజంలోని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేపట్టిన వినూత్న, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా, దీపం వంటి పథకాలు ప్రవేశపెట్టడం లాంటి అంశాల్ని ప్రస్తావించారు. సామాజిక పింఛను మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2వేలకు పెంచడం, యువతకు నిరుద్యోగ భృతి, బీసీలకు చేయూత, ఆదరణ వంటి ప్రత్యేక కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి వంటి అంశాలను ప్రస్తావించారు.


హైదరాబాద్‌ నివాసంలో పుస్తకావిష్కరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మన చంద్రన్న అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. చంద్రబాబు 74వ జన్మదినం పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని తెచ్చామని పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్‌ టీడీ జనార్దన్‌ తెలిపారు. చంద్రబాబుపై చౌకబారు విమర్శలు చేసేవారికి ఈ పుస్తకం గట్టి సమాధానమని పేర్కొన్నారు. పుస్తక రూపకల్పనలో పాలుపంచుకొన్న కాసరనేని రఘురామ్‌, విక్రమ్‌ పూల, విజయభాస్కర్‌, డిజైనర్‌ శ్రీనివాస్‌, ఐకాన్స్‌ మధుసూదన్‌రాజులను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని