గిగ్గోడు వినిపించలేదు

ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు..  నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్‌, బైక్‌ రైడర్‌ లాంటి పనులు చేస్తూ ‘గిగ్‌’ కార్మికులుగా మారుతున్నారు యువత.

Updated : 20 Apr 2024 12:52 IST

సరైన ఉపాధి లేక గిగ్‌ కార్మికులుగా యువత
వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కరవు
సెలవులు, పీఎఫ్‌ అసలే లేవు
సంక్షేమాన్ని పట్టించుకోని జగన్‌ సర్కారు
ఈనాడు, అమరావతి

ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు..  నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్‌, బైక్‌ రైడర్‌ లాంటి పనులు చేస్తూ ‘గిగ్‌’ కార్మికులుగా మారుతున్నారు యువత. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఆ ఉద్యోగాల్లోనూ.. జీవితానికి భరోసా చూపలేదు వైకాపా ప్రభుత్వం! ఉపాధి అవకాశాలు చూపని జగన్‌... ‘గిగ్‌’ కార్మికులకు అండగానైనా నిలవలేదు!

సంక్షేమం అంటూ నిరంతర భజన చేసే వైకాపా ప్రభుత్వం.. యువతకు ఉపాధి చూపలేకపోయింది.  పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తూ.. వారికి తీరని ద్రోహం చేసింది. దీంతో యువత.. తమ ఆర్థిక కష్టాల్ని అధిగమించడానికి డెలివరీ బాయ్‌, బైక్‌ రైడర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో.. తదితర సంస్థల్లో గిగ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి ఎలాంటి చర్యల్లేవు. సెలవులు, ఈపీఎఫ్‌ వంటి సామాజిక భద్రత అందడం లేదు. వారికి జరగరానిది జరిగితే.. కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమవుతోంది. ‘అమ్మా.. పనిచేస్తూనే చదువుకుంటా, కుటుంబానికి తోడుంటా’నంటూ ర్యాపిడో డ్రైవ్‌ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఓ వైకాపా ఎమ్మెల్సీ కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇలాంటి సంఘటనలెన్నో ఉన్నాయి. విద్యార్థులు, యువతే కాకుండా.. మధ్య వయస్కులూ ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ రంగంపైన ఆధారపడుతున్నవారి సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్‌, తెలంగాణ ప్రభుత్వాలు వారికి సంక్షేమ పథకాలు ప్రకటించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పనిచేస్తున్న 4.2 లక్షల మంది గిగ్‌ వర్కర్లకు రూ.5లక్షల జీవిత బీమాతోపాటు రూ.10లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో పనిచేసే వారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో మహిళలూ ఉన్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్కసారి కూడా వీరి సంక్షేమం గురించి ఆలోచించలేదు.

అర్హతలు ఉన్నా.. ఉద్యోగాల్లేక

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు విద్యార్హతలు ఉన్నా.. సరైన ఉద్యోగాలు లభించడం లేదు. అయిదేళ్లుగా కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్న పరిశ్రమల్లో కొన్ని రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఐటీ కంపెనీల ఊసే లేదు. యువతకు నైపుణ్య శిక్షణ కూడా అందని దుస్థితి. దీంతో అధికశాతం యువత ఉపాధి కోసం రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లడం ఇష్టంలేక రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి కోసం చూసేవారు.. తాత్కాలికంగా గిగ్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కొన్ని కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే సొమ్ము కోసం.. గిగ్‌ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు.

వెసులుబాటున్నా.. ఒత్తిడి ఎక్కువే

నచ్చిన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు ఉండటమే గిగ్‌ ఉద్యోగాల ప్రత్యేకత. కానీ వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడితేగానీ రూ.500-800 వరకు రాదు. కొన్నిసార్లు రాత్రి సమయాల్లో విధులు, పోలీసుల నుంచి సమస్యలు తదితర ఇక్కట్లూ ఉన్నాయి. ఒకప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన వీరి సేవలు ఇప్పుడు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విజయవాడలో కళాశాలల్లో చదివే వందలాది మంది విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభించక.. కొందరు పట్టణాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందించి తిరిగి వెళ్తున్నారు. ‘ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. ఐటీ కోర్సులు నేర్చుకుంటున్నా. కోర్సు ఫీజుకే రూ.30వేల వరకు అవసరమవుతుంది. అందుకే స్విగ్గీలో చేరాను. క్లాసులకు హాజరవుతూనే ఈ పనిచేస్తుంటా’ అని చెప్పారు విజయవాడలో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామాంజి.

రాజస్థాన్‌ ముందడుగు..

బైక్‌, మొబైల్‌ ఉంటే ఎవరైనా ఈ పనిచేసుకునే అవకాశం ఉంది. దాంతో చాలామంది ఇటువైపు వస్తున్నారు. అయితే, దీన్లో ఏడాదంతా పనిచేసినా.. అధికారిక సెలవులేవీ వర్తించవు. పనిచేసిన సమయానికే ఆదాయం వస్తుంది. భవిష్య నిధి, ఆర్జిత సెలవులు.. తదితర సౌకర్యాలేవీ ఉండవు. అంటే ఏడాది పొడవునా చాకిరీ చేయాల్సిందే. వీరి సామాజిక భద్రతపై కేంద్రం ఇటీవల దృష్టి పెట్టింది. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి రాజస్థాన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో బిల్లు ఆమోదించారు. నిధిని ఏర్పాటు చేస్తున్నారు. గిగ్‌ వర్కర్లను నమోదు చేయడంతోపాటు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. తగిన పరిష్కారం చూపిస్తారు. చట్ట నియమాలను ఉల్లంఘించే సంస్థలకు రూ.50లక్షల వరకు జరిమానాలనూ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరి సంక్షేమానికి చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో గిగ్‌ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక పథకాలు ఏమీ లేవు. సంక్షేమం అంటూ నిరంతర భజన తప్పితే.. ఇలాంటి వారి ప్రయోజనాల్ని పట్టించుకున్న దాఖలాలే లేవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని