ఉద్యోగమే ‘సోర్స్‌..’ పథకాలు ‘అవుట్‌’

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 05:21 IST

పొరుగు సేవల సిబ్బందికి జగన్‌ దగా
‘సమాన పనికి సమాన వేతనం’ అని కుట్ర
సంక్షేమ పథకాలకూ దూరం చేశారు
కుటుంబాలను పోషించలేక ఉద్యోగులు సతమతం
ఈనాడు, అమరావతి

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ పేర్కొన్నారు. ఈ హామీని మాత్రం నెరవేర్చారు. ‘అదేంటీ..’ అని నమ్మలేకపోతున్నారా? ఔను.. అధికారంలోకి వచ్చాక జగన్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చూశారు!! అయితే.. వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కాదు.. వారిని సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చడంలో..! అవసరం ఉన్నప్పుడు కొమ్ము కాయడం పని పూర్తయ్యాక గొంతు కోయడం జగన్‌కు అలవాటే కదా..!!

రాష్ట్రంలోని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచేశారు. ‘సమాన వేతనం’ సరికాదు కదా.. 11వ పీఆర్సీ కమిషన్‌, అధికారుల కమిటీ 30% జీతం పెంచమని సిఫార్సు చేస్తే 23% మాత్రమే పెంచి వారికి దగా చేశారు. అరకొర జీతాలు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ చేయలేం అని చేతులెత్తేశారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే.. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి సంక్షేమ పథకాలకు వారిని అనర్హులుగా తేల్చారు. అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికల ముందు వారిపై ప్రేమ కురిపించిన జగన్‌.. సీఎం అయ్యాక విషం కుమ్మరించారు.

తాము అధికారంలోకి వస్తే పొరుగు సేవల (అవుట్‌ సోర్సింగ్‌) ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని శాసనసభలో ప్రతిపక్షనేతగా జగన్‌ ఢంకా భజాయించారు. వారి సేవలను మరచిపోకూడదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ బీరాలు పలికారు. అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. ఉద్యోగ భద్రత అనేది పనిచేసే విధానాన్ని బట్టే ఉంటుందని ‘యూ’ టర్న్‌ తీసుకున్నారు.  అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు పెంచాలని పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసింది. దాన్ని మూలకు పడేసి వేతనాల పెంపును అడ్డుకున్నారు. అసలే పెరిగిన నిత్యావసరాల ధరలతో వారు సతమతమవుతుంటే కేవలం రూ.3 వేలు మాత్రమే పెంచి తన నియంతృత్వాన్ని చాటుకున్నారు. వైకాపా శ్రేణులు, తన అనుచరగణానికి కాంట్రాక్టులు, నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టి రూ. కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టిన జగన్‌.. బొటాబొటి వేతనాలతో కుటుంబాలను పోషించలేక ఆపసోపాలు పడుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందకుండా కుట్ర పన్నారు.


వేతనాల్లో వ్యత్యాసం

  • వివిధ శాఖల్లో కొనసాగుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు ఒక్కో జిల్లాలో ఒక్కో మాదిరిగా ఉన్నాయి. వ్యత్యాసం లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఒకేస్థాయి వేతనం ఉండేలా చూడాలని పొరుగు సేవల సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. జగన్‌ సర్కారు వారి వేదనను పెడచెవిన పెట్టింది. ఉదాహరణకు ఒక కేటగిరీలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి ఒకలా, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి మరోలా వేతనాలు చెల్లిస్తున్నారు.
  • పొరుగు సేవలకు సంబంధించి ప్రస్తుతం మూడు కేటగిరీల్లో జీతాలు ఇస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఒకేగాటన కట్టి ఒకేస్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సీనియారిటీని ప్రాతిపదికన తీసుకోకుండా అందరికీ ఒకే రకంగా జీతాలు చెల్లించడం ఎంతవరకు సమంజసమని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
  • సర్వీసు రూల్స్‌ను అయినా రూపొందించాలని పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చారు. మెప్మా, సెర్ప్‌ ప్రాజెక్టు ఉద్యోగుల మాదిరిగా తమకు హెచ్‌ఆర్‌ పాలసీ తీసుకురావాలన్న విజ్ఞాపనలు కూడా బుట్టదాఖలాలయ్యాయి.
  • తమకు ఏటా 5% వేతనాలు పెంచాలని ‘పొరుగు’ ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా వారి వేదన జగన్‌ చెవికెక్కలేదు.

రేషన్‌కార్డు, పింఛను రద్దు

  • అసలే అరకొర వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వైకాపా సర్కారు సంక్షేమ పథకాలను దూరం చేసింది. విజయవాడలాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు గతంలో రూ.12 వేల వేతనం ఉండేది. దాన్ని రూ.3 వేలు పెంచారు. వేతనం రూ.15 వేలకు చేరిందన్న ఉద్దేశంతో పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తొలగించారు. అంటే రూ.3 వేలు పెంచి ఉద్యోగుల పేర్లపై ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేశారన్నమాట. వారి కుటుంబసభ్యులకు ‘అమ్మఒడి’ అందించడం లేదు. ఆ ఉద్యోగుల ఇళ్లలో ఉండే వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు. ఇతర ప్రయోజనాలను కూడా నిర్దాక్షిణ్యంగా దూరం చేసింది వైకాపా సర్కారు.
  • పొరుగు సేవల సిబ్బందికి వేతనాలను సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. పోనీ వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలు కల్పిస్తున్నారా? అంటే.. అదీ లేదు.
  • వీరికి ఎలాంటి ఆరోగ్య పథకాలను వర్తింపజేయడం లేదు. దీంతో అనారోగ్యానికి గురైన సందర్భాల్లో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.

మంత్రి, కలెక్టర్‌ చెప్పిన వారినే..

  • ఉద్యోగ భద్రత కోసమంటూ జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సుడ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) నిరుద్యోగులను నిలువునా ముంచింది. దీని ద్వారానే పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం అక్రమ విధానాలకు తెరలేపింది. నియామకాల్లో ఎక్కడా పారదర్శకత పాటించలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టరు సిఫార్సు చేసిన వారినే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించారు. నియామకాల్లో రిజర్వేషన్‌ రోస్టర్‌ను గానీ, అభ్యర్థుల ప్రతిభను గానీ చూడలేదు. వైకాపా సానుభూతిపరులకే ఉద్యోగాలు ఇచ్చారు.
  • ఆప్కాస్‌ పరిధిలో ప్రస్తుతం లక్షకుపైగా ఉద్యోగులు ఉన్నారు. దీని పరిధిలోకి రాని వివిధ విభాగాలు, శాఖలకు చెందిన వారు మరో 1.50 లక్షల వరకు ఉంటారు. ఆర్టీసీ, గురుకులాలు, పర్యాటక, అటవీ, నీటిపారుదల శాఖల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ వారిని ఇంతవరకు ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకురాలేదు.
  • ఆప్కాస్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేయలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరిగిన నియామకాలనే కార్పొరేషన్‌ జాబితాలో చేర్చారు.
  • పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన జగన్‌.. ఆప్కాస్‌ ఏర్పాటుతోనే తన పనైపోయినట్లు చేతులెత్తేశారు.

ఈఎస్‌ఐ, పీఎఫ్‌కు గతి లేదు..

జగన్‌ సర్కారు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. గతంలో కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన రూ.370 కోట్ల పీఎఫ్‌ డబ్బును సకాలంలో చెల్లించకపోవడంతో కార్పొరేషన్‌కు పీఎఫ్‌ విభాగం రూ.5 కోట్ల జరిమానా విధించింది. కార్పొరేషన్‌ వద్ద ప్రస్తుతం ఎలాంటి నిధులు లేవు. దీని వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.

ఆప్కాస్‌కు ఇప్పటివరకు ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు లేవు. ఆయా విభాగాలు డబ్బులు ఇస్తేనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని శాఖలు ఆలస్యంగా డబ్బులు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. అలాంటప్పుడు కార్పొరేషన్‌ ఉండి ఏం లాభం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని