‘కౌలు రైతుకు’ జగన్‌ కాటు!

‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్‌ గొప్పలు చెప్పారు.

Updated : 20 Apr 2024 06:03 IST

సాగులో ఏటా నష్టాల దిగుబడి
అప్పులు మినహా ఆదాయమెరుగని వైనం
కౌలు కార్డులకూ నోచని రైతన్నలు
రుణాల ఊబిలో చిక్కి బలవన్మరణాలు
సాంకేతిక కారణాల సాకుతో అందని పరిహారం
ఈనాడు, అమరావతి

కుటుంబానికి చేదోడుగా ఉంటుందని...
ఆకలిని తరిమికొట్టే యుద్ధంలో ఆయుధం అవుతుందని...
పిల్లల చదువులకు ఆసరాగా నిలుస్తుందని...
గంపెడాశతో కౌలును నమ్ముకుంటే...
వారి జీవితాలన్నీ సేద్యమనే పరమపద సోపానంలో నష్టాల రూపంలో ఉన్న పాము బారిన పడుతున్నాయి...  
నిచ్చెనలెక్కడానికి ఊతమివ్వాల్సిన సర్కారు సాకులు చెప్పింది...
నేను ఉన్నాను... నేను విన్నానన్న జగనన్న... ఐదేళ్ల తన ఏలుబడిలో ఉలకలేదు... పలకలేదు!
పైగా మరోసారి సిద్ధమంటూ ఏమార్చడానికి వస్తున్నారు..!


భరోసాపై జగన్‌ గొప్పలు

‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్‌ గొప్పలు చెప్పారు.


బాకాలకూ ఓ హద్దుండాలి!

రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు దాదాపు 24 లక్షల మంది. వారిలో 1.05 లక్షల మందికే రైతు భరోసా అందుతోంది. మిగిలిన 23 లక్షల మందికి భరోసా అవసరం లేదా? ఇదేనా జగన్‌ చేసిన గొప్ప సాయం? రాష్ట్రంలో ఏడాదికి రూ.1.48 లక్షల కోట్ల పంట రుణాలిస్తుంటే... అందులో కౌలు రైతులకు దక్కేది రూ.1,672 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న మొత్తం భూవిస్తీర్ణంలో 40% పైగా సాగు చేసేది కౌలు రైతులే. వారికి ఈ అరకొర పెట్టుబడి సరిపోతుందా?


ఈ పాపం సీఎంది కాదా?

భూముల యజమానులకు కౌలు సొమ్ములను ముందే ముట్టజెప్పాలి. నిజంగా సాగు చేసే వారికి... కౌలుగుర్తింపు కార్డులందవు. రాయితీపై విత్తనాల్లేవు. పంట నష్టపోతే పెట్టుబడి సాయం దక్కదు. పంటల బీమా అసలే ఇవ్వరు. వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఇతర రాయితీలూ లేవు. దిగుబడులకు మద్దతు ధర గగనమే. ఏటా పెరుగుతున్న అప్పుల భారాన్ని మోయలేక కౌలు రైతులు ఉసురు తీసుకుంటున్నారు. మొత్తం రైతు ఆత్మహత్యల్లో వీరే 90% ఉంటున్నారు. ఈ పాపం ఎవరిది.


కూలి పనులతోపాటు ఎకరం పొలం వేసుకుంటే ఎంతో కొంత ఆదాయం వస్తుందని, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు ఉపయోగపడుతుందనే ఆశతో... సాగులోకి దిగుతున్న వ్యవసాయ కార్మికులు ఏటా విపత్తుల బారినపడి నష్టపోతున్నారు. ఎకరాకు రూ.15 వేల(వరి) నుంచి రూ.35 వేలు (మిరప, పసుపు తదితరాలకు) ముందే చెల్లించి, సాగు చేసే కౌలు రైతులకు ఆ మొత్తం ఏనాడూ తిరిగి రావడంలేదు. కౌలు రైతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడి రాక, ప్రభుత్వ సాయానికీ నోచుకోక మానసికంగా వారు నలిగిపోతున్నారు. చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి జగన్‌ సర్కారుకు చేతులు రావడం లేదు. రైతులే కాదంటూ సాయాన్ని దూరం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 24 లక్షలకు పైగా కౌలురైతులు ఉన్నట్లు రాధాకృష్ణ కమిషన్‌ నివేదిక వెల్లడిస్తోంది. వాస్తవానికి 40 లక్షలకు పైనే ఉంటారని అంచనా. వీరిలో సెంటు భూమి కూడా  లేని వారే అధికం. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికంగా 75-80% కౌలుదారులే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కౌలురైతుల్లో కేవలం 9% మందికి మాత్రమే గుర్తింపు కార్డులు అందుతున్నాయి. కొత్త చట్టాన్ని అమలు చేస్తూ రూ.వేల కోట్లకు బటన్‌ నొక్కుతున్నానంటూ జగన్‌ చెప్పే మాటలు... వారికి ఎంతమాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఎకరా వరి సాగుకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టే కౌలు రైతు వరుసగా మూడేళ్లు నష్టపోతే ఆయనపై  రూ.లక్షకుపైగా అప్పు మీద పడుతుంది. మిరప, పసుపు, పత్తి వంటివి సాగు చేసే వారిపైన ఒక ఏడాదికి రూ.లక్షల్లో అప్పులు పోగవుతున్నాయి. ఈ విష వలయం నుంచి బయటపడే దారి తెలియక... మరణమే   శరణ్యమనుకొని కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

భారీగా పెరిగిన పెట్టుబడుల భారం

వ్యవసాయ ఖర్చులు రెట్టింపు కావడంతో నాలుగేళ్లుగా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గతంతో పోల్చితే విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీల ఖర్చుతో పెట్టుబడి 50% పెరిగింది. ‘‘అప్పట్లో ఎకరా మిర్చి సాగుకు రూ.లక్ష అయ్యేది. ఇప్పుడది రూ.2 లక్షలకు చేరింది. ఎకరా పత్తి సాగుకు ఖర్చు రూ.15 వేలు ఉండేది... అది రూ.45 వేలకు చేరింది’’ అని పల్నాడు జిల్లాకు చెందిన రైతు మేళం గుణశేఖర్‌ తెలిపారు. ఈ ఏడాది ఎకరా రూ.30 వేల కౌలుతో నాలుగెకరాల్లో మిర్చి సాగుకు రూ.16 లక్షలు  ఖర్చయ్యాయని, 70 క్వింటాళ్ల పంట చేతికొచ్చినా సరైన  ధర లేకపోవటంతో భారీగా నష్టపోయానంటూ సత్తెనపల్లికి చెందిన ఒక రైతు కన్నీరు పెట్టుకున్నారు.

అప్పులు తీర్చేందుకు బాధితుల అవస్థలు...

జగన్‌ అధికారంలోకి వచ్చాక... 2019 నుంచి ఏటా 1100-1200 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 90% మంది కౌలురైతులే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7లక్షల పరిహారం అందించేందుకు సాంకేతిక కారణాలను సాకులుగా చూపుతూ మోకాలడ్డుతున్నారు. ఆత్మహత్యలకు అప్పులు, పంటనష్టాలను కాకుండా ఇతర అంశాలను తెరపైకి తెచ్చి, దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో వారి పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. అప్పులోళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఒంటిపై బంగారం అమ్మి వడ్డీలు చెల్లిస్తున్నారు. రోజువారీ కూలీలో వచ్చే సొమ్మును దాచిపెట్టి నెలవారీ కిస్తీలు జమ చేస్తున్నారు.

కొత్త చట్టం... చేసిందేమీ లేదు

2019లో జగన్‌ సీఎం అయ్యాక.. పాత చట్టాలను రద్దు చేసి పంట సాగుదారుల హక్కుచట్టం(సీసీఆర్‌ఏ) తీసుకొచ్చారు. దీని ప్రకారం కౌలురైతులు.. భూయజమానితో 11 నెలల కాలపరిమితితో ఒప్పందం కుదుర్చుకోవాలి. దాన్ని వీఆర్‌ఓ, తహసీల్దార్‌ ధ్రువీకరించి ఎల్‌ఈసీ కార్డులు జారీ చేస్తారు. దీని ప్రకారం కౌలు రైతులకు... బ్యాంకు రుణాలు, ఇతర లబ్ధి చేకూరుతుంది. కానీ, తమ హక్కులకు ఇబ్బంది కలుగుతుందనే అనుమానంతో భూముల యజమానులు ఒప్పందం చేసుకోవడంలేదు. కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాల్లో త్రిసభ్య కమిటీ ఎల్‌ఈసీ కార్డులు లేవంటూ.. చనిపోయింది రైతే కాదని పక్కన పెడుతున్నారు.


నీటిపాలైన పంట రైతు ఊపిరి తీసింది

కృష్ణా జిల్లా  చల్లపల్లి మండలం పాగోలు నివాసి గద్వాల్‌ కృష్ణంరాజుకు భార్య కనకదుర్గ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎనిమిదెకరాల పొలం కౌలుకు తీసుకొని వరి, మినుము వేశారు. 2021 నవంబరులో కురిసిన భారీవర్షాలకు రెండూ పూర్తిగా దెబ్బతిన్నాయి. అసలు, వడ్డీ కలిపి రూ.10 లక్షల అప్పు తేలింది. తీర్చే మార్గం లేదనే బెంగతో అదే ఏడాది పురుగుల మందు తాగి చనిపోయారు. కౌలురైతు గుర్తింపుకార్డు లేకపోవడంతో అధికారులు పట్టించుకోలేదు. తాము వేర్వేరు ప్రాంతాల్లో పొలాలను కౌలుకు తీసుకున్నామని, ఎకరన్నర ఇచ్చిన భూయజమాని పత్రం రాసిచ్చినా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితురాలు వాపోయారు. ఆమెకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌,   కృష్ణా జిల్లా సహకార బ్యాంకు... రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. చిన్న కుమారుడ్ని ఎన్టీఆర్‌ ట్రస్టు చదివిస్తోంది.


ఊర్లో సాగు చేయలేదని పరిహారం ఇవ్వలేదు

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం దరిమడుగుకు చెందిన రైతు గోన వెంకటరామిరెడ్డి త్రిపురాంతకంలోని రేళ్లపల్లిలో ఆరెకరాలను కౌలుకు తీసుకున్నారు. మిరప, పత్తి పంట వేశారు. వరుసగా నష్టాలు రావడంతో చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. రెండేళ్ల క్రితం సొంతూరు చేరారు.  మళ్లీ వ్యవసాయాన్నే నమ్ముకున్నా కాలం కలసిరాలేదు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో 2019 అక్టోబరు 25న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు    పాల్పడ్డారు. ఆయనకు భార్య పార్వతి, కుమార్తెలు రేవతి(8వ తరగతి), ధనలక్ష్మి(3వ తరగతి), కుమారుడు రామచంద్ర(6వ తరగతి) ఉన్నారు. తమ ఆధారం దూరమవడంతో పార్వతి దిక్కుతోచని స్థితికి చేరారు. స్థానికంగా వ్యవసాయం చేయలేదని, ఆయన మరణానికి అప్పులు కారణమే కాదని అధికారులు తేల్చారంటూ బాధితురాలు వాపోయారు. పిల్లలను కాపాడుకునేందుకు ఆమె ప్రస్తుతం కూలీ పనులకు వెళుతున్నారు.


నమ్ముకున్న భూమే కొంప ముంచింది!

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామ రైతు ఎల్లప్పకు భార్య ఈరమ్మ, కుమారుడు (8వ తరగతి), కుమార్తె(5వ తరగతి) ఉన్నారు. వారసత్వంగా వచ్చిన అర   ఎకరానికితోడు ఐదెకరాలను కౌలుకు తీసుకొని పదేళ్లుగా సాగు చేసుకొంటూ జీవనం కొనసాగించారు. పత్తి, మిరప పైర్లకు తెగుళ్ల బెడద పెరగడంతో పురుగు మందులు, కూలీ ఖర్చులు రెట్టింపయ్యాయి. వరుసగా ఐదేళ్లపాటు పంట సరిగా చేతికి రాలేదు. ప్రతి సంవత్సరం తీసుకొచ్చిన అప్పులు, వాటి వడ్డీలు అన్నీ కలిపి రూ.9 లక్షలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావంతో ఏమాత్రం దిగుబడి రాలేదు.   తన తలరాత సరిగా లేదని మదనపడుతున్న ఎల్లప్ప నెల రోజుల క్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పులను తీరుస్తూ, పిల్లలను చదివించడం ఎలాగోనంటూ ఈరమ్మ దిగులు పడుతున్నారు. ప్రభుత్వ సాయం అందలేదని వాపోతున్నారు.


కుటుంబాన్ని కాటేసిన అప్పులు

శ్రీకాకుళం జిల్లా  జలుమూరు మండలంలోని జగన్నాథపురం రైతు చిగురుపల్లి   శంకర్రావు ఏటా ఐదెకరాల పొలం కౌలుకు తీసుకొని   సాగు చేసేవారు.    కౌలుకార్డు లేదు.    2019-20లో తుపాను తీవ్రతకు వరి పూర్తిగా దెబ్బతింది. మరోవైపు రూ.10 లక్షల అప్పు మీదపడటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తానొక్కడినే చనిపోతే కుటుంబంపై అప్పుల భారం పడుతుందని భావించారేమో... 2020 మార్చి 1న భార్య కళావతికి, పెద్దకుమార్తె గీతాంజలికి పురుగుల మందు ఇచ్చి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నకుమార్తె తమ నాయనమ్మ దమయంతి వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికీ తన కుమారుడ్ని కౌలురైతుగా గుర్తించలేదని, పరిహారం ఇవ్వలేదని దమయంతి తెలిపారు.


ఇదో విషాదం

‘‘బుద్ధిగా బడికెళ్లే నా పెద్దకొడుకు తండ్రి బలవన్మరణంతో మానసికంగా కుంగిపోయాడు. అతన్ని బాగు చేసుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. దానికయ్యే ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నాం’’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఓ కౌలురైతు భార్య వాపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని