ప్రజారోగ్యానికి పట్టిన వైరస్‌.. జగన్‌

‘వినేవాడు వెర్రినాగన్న అయితే చెప్పేవాడు జగనన్న’ అని జనం ఊరికే తిట్టుకోవడం లేదు.

Updated : 21 Apr 2024 07:32 IST

తిరుపతి స్విమ్స్‌లో పైకప్పు పెచ్చులూడి పడి మూడు నెలల గర్భిణి మరణం... సీఎం జిల్లాలో ఓ రోగి కొన్నివారాలపాటు డాక్టర్‌ అవతారమెత్తడం... ఆత్మకూరులో స్వీపర్లు, గార్డులే చికిత్స చేయటం... మాచర్లలో పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు బదులు బిడ్డ వేలు తెగ్గోయటం... ఇవన్నీ జగనన్న హయాంలో సర్కారీ ఆసుపత్రుల పనితీరుకు మచ్చుతునకలు!

‘వినేవాడు వెర్రినాగన్న అయితే చెప్పేవాడు జగనన్న’ అని జనం ఊరికే తిట్టుకోవడం లేదు. నోటికొచ్చినట్లు అబద్ధాలాడితే ప్రజలు అసహ్యించుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా జగన్‌లో కనపడదు. కాబట్టే ‘‘వైద్యారోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశాం. ఏదైనా జబ్బు బారినపడితే పేదలు అప్పులపాలు కాకుండా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు చేశాం’’ వంటి కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యారు జగన్‌. ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ పట్టిస్తానంటూ పదవిలోకి వచ్చిన ఆయన- సర్కారీ దవాఖానాల్లో మందులకూ దిక్కు లేకుండా చేశారు. బిల్లుల చెల్లింపులకు ఎగనామం పెట్టిన జగన్‌- ఆరోగ్యశ్రీని అవస్థల పాల్జేశారు. ఆసుపత్రులకు తాను ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, కేంద్ర నిధులనూ ఆయన దారి తప్పించారు. సామాన్యులకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందకుండా చేసిన జగన్‌- ఏపీ ఆరోగ్యాన్ని హరించిన మురికి రాజకీయ ముఠా నాయకుడు!

జగన్‌ కాళ్లకింద జన జీవనహక్కు!

ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలి. ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా అందరికీ నాణ్యమైన వైద్యసేవలు చవగ్గా లభించాలి. అలా దక్కేలా చూడాల్సింది ప్రభుత్వమే. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ఆరోగ్యంగా జీవించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దాన్ని సంరక్షిస్తూ ప్రజలకు వైద్యారోగ్య సేవలను సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణలు, న్యాయపాలిక ఆదేశాలను లెక్కచేయని జగన్‌- వైద్యారోగ్య రంగాన్ని ఉద్ధరిస్తున్నానంటూ గాలిమాటలు చెబుతూ, సర్కారీ ఆసుపత్రులను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు. జన జీవనహక్కును తన కాళ్ల కిందేసుకుని తొక్కిపడేశారు. ఏలూరు జిల్లా తేరగూడేనికి చెందిన వీరాబత్తిని కన్నయ్య ఊపిరితిత్తుల్లో గడ్డ వచ్చింది. చికిత్స కోసం మొన్న డిసెంబరులో ఆయన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఏదో చికిత్స చేసిన వైద్యులు- వార్డుల్లో మంచాల్లేవని ఇంటికెళ్లిపోమని రాత్రి 9.30 గంటలప్పుడు చెప్పారు. మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడని బతిమాలినా వినకుండా బయటికి గెంటేశారు. ఆ రాత్రే ఆసుపత్రి ఆవరణలోనే కన్నయ్య ప్రాణం పోయింది. ప్రకాశం జిల్లా కురిచేడు వాసి దేవబోయిన శేషమ్మ ఆస్తమా రోగి. సమస్య తీవ్రం కావడంతో నిరుడు జూన్‌లో మార్కాపురం జిల్లా ఆసుపత్రిలో చేరారు. అక్కడ కరెంటు కోతతో ఆక్సిజన్‌ అందక ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకటీ రెండూ కాదు- ఎన్నో ఉదాహరణలు! సర్కారీ దవాఖానాల్లో సదుపాయాల వృద్ధిని పట్టించు కోకుండా పైలాపచ్చీసు వేషాలేసిన జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలే అవన్నీ!

పని తక్కువ.. ప్రగల్భాలెక్కువ!

వట్టిగొడ్డుకు అరుపులెక్కువ.. వానలేని మబ్బుకు ఉరుములెక్కువ.. ఒక సీఎంగా జనంకోసం చేయాల్సినవి చేయని జగన్‌కు ప్రగల్భాలెక్కువ! సిగ్గూశరం అనేవాటికి నీళ్లొదిలేసి ‘‘ప్రభుత్వాసుపత్రులు మారాయంటే కారణం మీ జగన్‌’’ అంటూ ఆయన ఇటీవలే సొంతడబ్బా కొట్టుకున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ఏలుబడిలో సర్కారీ దవాఖానాలు ఎంతలా మారిపోయాయో చూడాలంటే-  సీఎం దొరగారి స్వస్థలానికి వెళ్తే సరిపోతుంది. కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోజుకు ఇరవైమందికి కు.ని.ఆపరేషన్లు చేసేచోట మొన్న నవంబరులో పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. ఎప్పుడేది ఊడిపడి తలలు పగలుకొడుతుందో తెలియక అప్పటికి పదిహేను రోజుల ముందే అక్కడ శస్త్రచికిత్సలు ఆపేశారు. తిరుపతిలోని స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో పైపెచ్చులు మీదపడి మూడు నెలల గర్భవతి అయిన ఉద్యోగిని అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంది. సర్కారీ ఆసుపత్రుల సొబగు ఇలా ఉంటే- వైద్యసేవలూ అలాగే అఘోరిస్తున్నాయి. కొన్నిచోట్ల అసలు ఎవరు వైద్యం చేస్తున్నారో తెలుసుకుంటే గుండెలవిసిపోతాయి. అయ్యవారి ఇలాకా.. కడప సర్వజన ఆసుపత్రిలో మొన్న ఫిబ్రవరిలో ఓ పాత పేషంట్‌ మిగిలిన రోగులకు రోజుల తరబడి వైద్యం చేశాడు. అక్షరమ్ముక్క రాని అతనికి వైద్యమంతా తెలుసంట.. అందుకని అతనితో డాక్టర్‌ పని చేయిస్తుంటారట! ఇంతకంటే ఘోరం ఉంటుందా? రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణారావు అనే వ్యక్తిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కారీ దవాఖానాకు తీసుకొచ్చారు. డాక్టర్లు లేకపోవడంతో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులే అతనికి వైద్యం చేశారు. ఆపై పరిస్థితి విషమించి ఆయన మరణించాడు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో బొడ్డుతాడు కోయాల్సింది బిడ్డ వేలు తెగ్గోశారు. దానికి కారకురాలంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై చర్యలు తీసుకున్నారు. అసలు ఆ పని ఆమెకు అప్పగించిందెవరు.. ఏమో! ఆసుపత్రుల బాగోగుల గురించి ఆరా తీసే నాథుడు లేని జగన్‌ రాజ్యంలో ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో!

జగన్‌ ప్రచార కక్కుర్తి!

తెలుగుదేశం హయాంలో 104 సంచార వైద్యసేవలు మొదలయ్యాయి. వాటికే పైపై నగిషీలద్ది ‘ఫ్యామిలీడాక్టర్‌’ పేరిట తన ఖాతాలో వేసుకున్న కక్కుర్తి జగన్‌ది. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 8 ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అయిదింటికి భూములు కూడా కేటాయించని దౌర్భాగ్య పాలన జగన్‌ది! హెల్త్‌హబ్‌ల ఏర్పాటుతో ఆధునిక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తానని చెప్పి చేతులెత్తేసిన నిష్ప్రయోజకత్వం జగన్‌ది. సర్కారీ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించకుండా గర్భిణులు, బాలింతలను విపరీతంగా ఏడిపించిన  అమానుషత్వం జగన్‌ది! 

మడమ తిప్పడంలో మొనగాడు

‘‘రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతాం’’ అని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ ఒట్టేశారు. కార్పొరేటు కళ తెచ్చేమాట అలా ఉంచితే- సర్కారీ ఆసుపత్రులకొచ్చే సామాన్యులకు సరైన వసతులనూ ఆయన సమకూర్చలేదు. కృష్ణా జిల్లా బావులపాడు, ఆత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు చెట్లే ఆశ్రయమిస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం కొత్త భవన నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు అయ్యింది. అమలుకాని జగన్‌ హామీలాగానే అదింతవరకూ పూర్తికాలేదు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల పేరిట జగన్‌ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్లు గప్పాలు కొట్టుకునే ఆయన గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను నడిమధ్యలోనే వదిలేశారు. పల్లెల్లో 8,332 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన జగన్‌ సర్కారు- వాటిలో 2,899 కేంద్రాల పనులను ఏదో ఒక వంకతో ఆపేసింది. మొన్న డిసెంబరు నాటికి 5,414 భవనాల నిర్మాణాలు ఇంకా సా....గుతూనే ఉన్నాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించని జగన్‌ సర్కారు కారణంగానే నిర్మాణాలు కొలిక్కిరాకుండా పోయాయి. దాంతో గ్రామీణులకు వైద్యారోగ్య సేవలూ గగనమయ్యాయి. తెలుగుదేశం పార్టీపై కక్షతో జగన్‌ చేసిన పనికిమాలిన పనులూ ప్రజారోగ్యానికి శాపాలయ్యాయి. అన్నమయ్య జిల్లా మల్లెల గ్రామంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించారు. దాన్ని ప్రారంభించకుండా జగన్‌ సర్కారు పాడుపెట్టేసింది. మూడు పంచాయతీలకు వైద్యసేవలు అందించాల్సిన భవనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మార్చేసింది. జగన్‌ చేతలన్నీ ఇలాంటివే- జనంకోసం ఆయన ఏమీ చేయరు, ఎవరైనా చేసినా పడనివ్వరు!

బీరాల ముఖ్యమంత్రీ.. మందులేవి?

రూ.16 వేల కోట్లతో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, బోధనాసుపత్రుల ఆధునికీకరణ అంటూ జగన్‌ అరచేతిలో వైకుంఠం చూపించారు. తిరుపతి, కాకినాడ, కర్నూలు, విజయవాడ, అనంతపురం జీజీహెచ్‌ల్లో ఎక్కడా రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. క్యాథ్‌లాబ్‌ల అందుబాటు నుంచి కాలంచెల్లిన వైద్యఉపకరణాల వరకు ప్రతిచోటా ఏదో ఒక సమస్య తిష్ఠవేసింది. వైద్యారోగ్య సిబ్బంది తగినంత సంఖ్యలో లేకపోవడమూ రోగులకు శాపమవుతోంది. కొత్త బోధనాసుపత్రులు అయిదింట్లో ఏదీ సక్రమంగా పనిచేయట్లేదు. ‘‘ఏ పేదవాడు కూడా మందులకోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రానివ్వం’’ అని ప్రతిపక్షనేతగా జగన్‌ తెగ బీరాలు పలికారు. సీఎం అయ్యాకేమో మందుబిళ్లలూ దొరకని దుస్థితిలోకి దవాఖానాలను నెట్టేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు ఉండటం లేదని, వ్యాధినిర్ధరణ పరీక్షలూ సరిగ్గా జరగడం లేదని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ నివేదికే తేల్చిచెప్పింది. వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లకూ నోచుకోని సర్కారీ దవాఖానాల దుస్థితి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో బయటపడింది.

కేంద్ర నిధులూ హుష్‌కాకి!

అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా.. జగన్‌ దగుల్బాజీతనం జనానికి తెలియదా? అయినాసరే, ఆయన ఆత్మస్తుతి చేసుకోవడం ఆపరు. ‘‘ఆరోగ్యశ్రీని విస్తరించి ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగన్‌దే’’ అని మొన్నా మధ్య డప్పు కొట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు జగన్‌ సర్కారు చెల్లించాల్సిన బిల్లుల విలువ మొన్న మార్చినాటికి రూ.1400 కోట్లకు చేరింది. అరవై రోజుల్లో జరగాల్సిన చెల్లింపులకు ఆర్నెల్లు దాటిపోయినా అతీగతీ లేదు. దాంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను అందించడం ఆపేస్తామని ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరించాయి. ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిల కారణంగా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయో లేదో కూడా అంతుపట్టడం లేదు. గ్రామీణ ప్రాంత వైద్యశాలలకు కేంద్రం నుంచి వచ్చే నిధులనూ జగన్‌ సర్కారు మధ్యలోనే మాయంచేసింది. ఏపీలోని పల్లెల్లో వైద్య వసతులను మెరుగుపరచడం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.514.14 కోట్లను కేంద్రం ఇచ్చింది. నిరుడు నవంబరు నాటికి వాటిలో రూ.25 కోట్లనే వైద్యారోగ్య శాఖకు విదిల్చారు జగన్‌. మిగిలిన డబ్బును ఏం చేశారంటే- ఏమో, ఆ దేవుడికే తెలియాలి!  అంతకు మునుపు ఏడాదిలోనూ కేంద్ర నిధులను జగన్‌ ప్రభుత్వం ఇలాగే దారిమళ్లించేసింది. నరసరావుపేట వంటి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో దూది, బెడ్‌షీట్లు కూడా కరువయ్యాంటే- కారణం జగనాసుర పాలనే! జగన్‌మోహన్‌ రెడ్డి అసమర్థ, అరాచక నిర్వాకాలతో అంతిమంగా నష్టపోయింది.. రోగాలతో రొష్టులతో బతుకులీడిస్తున్న సామాన్యులే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని