కక్షగట్టి.. నిధులు జెల్లకొట్టి!

అసలే నూతనంగా అవతరించిన రాష్ట్రం.. ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే సొంత నిధులతోపాటు కేంద్ర సాయమూ తప్పనిసరి.

Updated : 21 Apr 2024 06:52 IST

రూ.వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టులను వదిలేసిన వైకాపా సర్కారు
గత తెదేపా ప్రభుత్వానికి  పేరు వస్తుందనే అక్కసు
ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు
ఐదేళ్లపాటు పట్టణాభివృద్ధికి  గ్రహణం

 

పడకేసిన రూ.158 కోట్ల ప్రాజెక్టు

కేంద్రం నిధులతో కలిపి నంద్యాలలో గత తెదేపా ప్రభుత్వం రూ.158 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. వెలుగోడు రిజర్వాయరు నుంచి 35 కి.మీ. పొడవున పైపులు వేసి నంద్యాలకు నీరు అందించాలన్నది ఉద్దేశం. అప్పుడే 65% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 35% పనులు పూర్తి చేయడానికి జగన్‌కు ఐదేళ్లు మనసు రాలేదు. ఫలితంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసలే నూతనంగా అవతరించిన రాష్ట్రం.. ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే సొంత నిధులతోపాటు కేంద్ర సాయమూ తప్పనిసరి. జగన్‌ మాత్రం రాష్ట్ర నిధులివ్వకుండా తొండిపెట్టి జగమొండిగా వ్యవహరించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కాలదన్నారు. పసిబిడ్డ లాంటి కొత్త రాజధాని ఎదగకుండా పగబూనారు. సౌకర్యాలు కరవై ప్రజలు విలవిల్లాడినాఆయన మనసు కరగ లేదు..!

స్వార్థ రాజకీయాలు, అనాలోచిత విధానాలతో ఆంధ్రావనిని భ్రష్టు పట్టించిన సీఎం జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో పెద్దగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకపోగా రాష్ట్రంలో గత తెదేపా ప్రభుత్వం, కేంద్రం కలిసి చేపట్టిన ఎన్నో పనులను అటకెక్కించారు. చంద్రబాబునాయుడిపై అక్కసు తీర్చుకోవాలనే విపరీత ధోరణితో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. కేంద్రం సాయంతో గత తెదేపా ప్రభుత్వం అమృత్‌, స్మార్ట్‌ సిటీ పథకాల కింద చేపట్టిన పనులకు నిధులివ్వకుండా పైశాచికానందం పొందారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కే దశకు చేరుకున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టులను పగబట్టి నామరూపాలు లేకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలను సద్వినియోగం చేసుకుని అనేక రాష్ట్రాలు.. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. జగన్‌ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తిరోగమిస్తూ ప్రజలు అవస్థల పాలవుతున్నారు.

అప్పుడే కొత్తగా ఏర్పడిన పసిగుడ్డులాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని.. కేంద్రం అందజేసే నిధులతో అన్ని విధాలా అభివృద్ధి చేయాలని గత తెదేపా ప్రభుత్వం తలపోసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ఐదేళ్లపాటు ఆ ‘పసిగుడ్డు’ను చిదిమేసేలా వ్యవహరించింది. కేంద్ర పథకాలకు జగన్‌ రాష్ట్ర వాటా నిధులివ్వకపోగా.. వాటిని ఎలా వదిలించుకోవాలా అని కుయుక్తులు పన్నారు. అమృత్‌, స్మార్ట్‌ సిటీ పథకాల కింద గత ప్రభుత్వం నగరాలు, పట్టణాల అభివృద్ధికి రూ.8,009 కోట్లతో పలు పనులు చేపట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో 60% వరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షగట్టి వీటికి నిధులివ్వకుండా గ్రహణం పట్టించింది. తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే.. వేసవిలో నీటి ఎద్దడికి పరిష్కారం లభించేది. మురుగునీటి సమస్య శాశ్వతంగా దూరమయ్యేది. అమృత్‌ పథకానికి కేంద్రమిచ్చిన నిధులతో సరిపెట్టారేగానీ రాష్ట్ర వాటా మంజూరు చేయలేదు. రూ.1,000 కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ, పట్టణ స్థానిక సంస్థల వాటా ఇవ్వలేదు. ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కాకినాడ స్మార్ట్‌ సిటీ పథకాలకు రూ.500 కోట్లకుపైగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా పనులు పక్కనపెట్టారు.


మూలన పడ్డ ‘కంట్రోల్‌ సెంటర్‌’

కేంద్రం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా గత తెదేపా ప్రభుత్వం రూ.65 కోట్లతో కాకినాడలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నెలకొల్పింది. నగర పరిధిలోని 35 సీసీ కెమెరాలను దీనికి అనుసంధానించారు.  నగరంపై నిరంతర నిఘాకు ఇది ఎంతో దోహదం చేసేది. అలాంటి కీలక సెంటర్‌ నిర్వహణకు జగన్‌ సర్కారు నిధులివ్వలేదు. ఏడాదిగా దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి.


అటకెక్కించారిలా..

  •  లక్షకుపైగా జనాభా కలిగిన 32 పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగు, మురుగు, వరద నీటి సమస్యల పరిష్కారం, కొత్తగా ఉద్యానవనాల అభివృద్ధి కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకం కింద   రూ.3,762.91 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. జగన్‌ సర్కారు తన వాటా నిధులు కేటాయించకపోవడంతో అవన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన 179 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 70 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 2015-16, 2016-17లో రెండు విడతల్లో కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులు ఒప్పందం ప్రకారం ఇప్పటికెప్పుడో పూర్తవ్వాలి. వైకాపా సర్కారు రూ.350 కోట్లకుపైగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు చాలాచోట్ల పనులు నిలిపివేశారు.
  •  అమృత్‌ 2.0 కింద 123 పట్టణ స్థానిక సంస్థల్లో రెండో విడతగా మరో రూ.9 వేల కోట్లతో 239 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం గతేడాది ఆమోదించింది. వీటిలోనూ తాగునీటి, వరద, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే పనులు ఉన్నాయి. ఇందులో రాష్ట్రం రూ.1,189 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలు రూ.695 కోట్లను తమ వాటాలుగా సమకూర్చాలన్నది ఒప్పందం. జగన్‌.. వీటిపైనా వివక్ష చూపడంతో చాలాపనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి.
  •  విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో స్మార్ట్‌ సిటీ పథకం కింద తెదేపా ప్రభుత్వ హయాంలో పలు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.4,328.84 కోట్ల అంచనాలతో 227 ప్రాజెక్టులను ప్రతిపాదించాయి. గత ప్రభుత్వ హయాంలో 60కి పైగా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో 25 ప్రాజెక్టులు పూర్తిచేసి మిగిలిన వాటిని పక్కన పెట్టింది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున నిధులు సమకూర్చాలి. తన వాటా నిధులను సమకూర్చని వైకాపా సర్కారు.. కేంద్రం ఇచ్చిన నిధులనూ ఇతర అవసరాలకు వాడేసుకుంది.

‘మెట్రో రైల్‌’కు రెడ్‌ సిగ్నల్‌

  •  కేంద్రంతో పోరాడి విభజన హామీ చట్టంలో చేర్చిన మెట్రో రైల్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు గత తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే దశలోనే ప్రభుత్వం మారింది. అధికారం చేపట్టిన జగన్‌ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపింది. విజయవాడలో 26.02 కి.మీ. మేరకు రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్రం మొదట 2015లో రూ.6,789 కోట్లతో డీపీఆర్‌ను ఆమోదించింది. తర్వాత జాయింట్‌ వెంచర్‌/ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో 72 కి.మీ. లైట్‌ మెట్రో ప్రాజెక్టు కోసం తుది డీపీఆర్‌ను సిద్ధం చేసింది. 2019లో ఆ పనులు ప్రారంభించి 2023లో పూర్తిచేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని చుట్టచుట్టి మూలకు పడేసింది.
  •  విశాఖలో పీపీపీ విధానంలో రూ.8,300 కోట్ల అంచనాలతో 42.55 కి.మీ. పొడవునా మూడు కారిడార్లలో మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత తెదేపా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తర్వాత అధికారం  చేపట్టిన జగన్‌ సర్కారు మెట్రో కారిడార్లలో మార్పులుచేర్పుల పేరుతో నాలుగున్నరేళ్లు  కాలయాపన చేసింది. చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ.14,309 కోట్లతో డీపీఆర్‌ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇది.. విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకు వైకాపా సర్కారు పన్నిన ఎత్తుగడ అని  తేలిపోయింది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని