వైకాపా దిగజారుడు రాజకీయాలు

వైకాపా దిగజారుడు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 21 Apr 2024 04:28 IST

నూజివీడులో అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారం

ఈనాడు, ఏలూరు: వైకాపా దిగజారుడు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు ఎమ్మెల్యే, ప్రస్తుత వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు శుక్రవారం పాత రావిచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. దీనికోసం నూజివీడులోని స్నేహా రైట్స్‌ అనాథ శరణాలయంలోని వంద మంది బాలికలను వాహనాల ద్వారా తరలించారు. వారితో రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేయించారు. పాత రావిచర్ల ప్రస్తుత సర్పంచి భర్త బసవరాజు నాగేశ్‌బాబు ఈ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు. నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జోనల్‌ వెల్ఫేర్‌ విభాగం సమకూరుస్తుంది. వైకాపా నాయకుడు, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన నాగేశ్‌బాబు సొంత గ్రామంలో ఎన్నికల ప్రచారం జరగడంతో బాలికలను తరలించారు. వారికి వైకాపా కండువాలు వేసి.. టోపీలు పెట్టి ఆ పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఇంటింటికీ వెళ్లి వైకాపాకే ఓట్లు వేయాలని అడిగించారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేయించారు. జిల్లాలోని అనాథ శరణాలయాలను పర్యవేక్షించేందుకు ఐసీడీఎస్‌ పీడీ, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు ఉంటారు. వారిలో ఎవరి అనుమతి తీసుకుని బాలికలను ఎన్నికల ప్రచారానికి తరలించారు? అక్కడ వారికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై ఆర్డీవో వై.భవాని శంకరికి నూజివీడు జనసేన నాయకులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని