సీఎం బస్సు ఆగగానే ఎస్పీలు, సీపీలు డోర్‌ దగ్గరకు వెళ్లాలి..

ముఖ్యమంత్రి జగన్‌.. ఏ జిల్లాకు వెళితే అక్కడి ఎస్పీ లేదా పోలీసు కమిషనర్‌ ఆయన ఎన్నికల ప్రచార వాహనం (బస్సు) వెన్నంటే ఉండాలట.

Published : 21 Apr 2024 04:31 IST

ప్రచారంలో వాహనం వెన్నంటే ఉండాలి
రోప్‌ పార్టీలు సరిగ్గా ఉన్నాయా? లేదా అనేది దగ్గరుండి చూసుకోవాలంటూ డీజీపీ హుకుం
వైకాపాకు అనుకూల ఆదేశాలివ్వడంలో తగ్గని రాజేంద్రనాథరెడ్డి

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌.. ఏ జిల్లాకు వెళితే అక్కడి ఎస్పీ లేదా పోలీసు కమిషనర్‌ ఆయన ఎన్నికల ప్రచార వాహనం (బస్సు) వెన్నంటే ఉండాలట. ప్రచారం కోసం ఎక్కడైనా ఆ బస్సు ఆగితే.. మరుక్షణమే దాని ప్రవేశద్వారం వద్దకు చేరుకుని బందోబస్తులో పాల్గొనాలట. రోప్‌ పార్టీలు ఉండాల్సిన చోట ఉన్నాయా? లేదా అనేది దగ్గరుండి మరీ చూసుకోవాలట! పూర్తిగా వైకాపా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు, అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి.. ఎన్నికల కోడ్‌ ఉన్నా సరే జగన్‌ పట్ల తన స్వామిభక్తిని, వీరవిధేయతను ప్రదర్శించడంలో ఏ మాత్రమూ తగ్గట్లేదు. ఎన్నికల సంఘం చర్యల కత్తి ఆయనపై వేలాడుతున్నా.. వైకాపాకు రాజకీయంగా అనుచిత లబ్ధి కలిగే ఆదేశాలిచ్చి అమలు చేయించడంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయడంలేదు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు తాజాగా ఈ ఆదేశాలిచ్చారు. నిష్పక్షపాతంగా, తటస్థంగా పనిచేసే పోలీసు అధికారుల నుంచి ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రికి కాపలాదారులుగా మార్చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇదేమైనా రాచరికమా? జగన్‌ ఏమైనా చక్రవర్తా? ఆయనకేమైనా ప్రత్యేకంగా ప్రతిపత్తి కల్పించారా? లేకపోతే ఇలాంటి ఆదేశాలివ్వడం ఏమిటి? డీజీపీని ఎన్నికల సంఘం ఆ పోస్టు నుంచి తప్పించడానికి ఈ ఒక్క కారణం చాలు’ అని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

కట్టడి విధుల్లో ఉండాల్సిన వారిని.. కట్టిపడేస్తారా?

ముఖ్యమంత్రికి భద్రతగా రోప్‌ పార్టీని నిర్వహించడానికి ఎస్పీ, సీపీ స్థాయి అధికారులను ప్రచార వాహనం ప్రవేశ ద్వారం వద్ద కాపలా పెడతారా? ఇది వాళ్ల ప్రాథమిక విధులైన శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ వంటి వాటి నుంచి దూరం చేయడం కాదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వైకాపా నాయకుల ఆధ్వర్యంలో మద్యం, నగదు, ఇతర ప్రలోభాల
పంపిణీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి వాటిని సమర్థంగా కట్టడి చేయాల్సిన విధుల్లో బిజీగా గడపాల్సిన ఎస్పీలు, సీపీలను చివరికి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార వాహనం చుట్టూ తిరిగేలా చేస్తున్న ఘనత డీజీపీకే దక్కింది. ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రి రాజకీయ కార్యకలాపాలకు దగ్గరగా చేయటం, వారి వృత్తిపరమైన బాధ్యతలు, రాజకీయనాయకులతో సంబంధాల మధ్యనున్న సున్నితమైన విభజన రేఖను చెరిపేసేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు కనిపిస్తోందని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ‘ఈనాడు’కు వివరించారు.

 ముఖ్యమంత్రి భద్రత, బందోబస్తు నిర్వహణ కోసమే ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ) సిబ్బంది ఉన్నారు. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ ఆయా జిల్లాల పోలీసులు బందోబస్తు విధులు చేపడుతున్నారు. అయినా సరే జిల్లా ఎస్పీలు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని డీజీపీ ఆదేశాలిచ్చారు. ఇటు పోలీసు అధికారులకు, అటు ముఖ్యమంత్రికీ మధ్య అనవసరమైన అనుబంధం ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రాజకీయ ప్రచారంలో పోలీసు ఉన్నతాధికారులు అనుసంధానమై ఉన్నారనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం ఇదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారుల నిష్పాక్షికత, తటస్థతకు భంగం కలిగించే చర్య అని చెబుతున్నారు.

నలిగిపోతున్న ఎస్పీలు.. వారిలో తీవ్ర ఆందోళన

నిబంధనల మేరకు వృత్తిపరమైన విధులు నిర్వర్తించడమా? లేక వైకాపా పట్ల పక్షపాత ధోరణితో డీజీపీ ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడమా అనేది తేల్చుకోలేక పలు జిల్లాల ఎస్పీలు సతమతమవుతున్నారు.


తప్పనిసరిగా పాల్గొనాలని ఎలా ఆదేశిస్తారు?

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక.. ముఖ్యమంత్రి సహా ఏ వీవీఐపీ భద్రతా, బందోబస్తు విధుల్లోనైనా పాల్గొనాలా? లేదా అనేది ఆయా ఎస్పీల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. భద్రతాపరంగా వాళ్లు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందనుకుంటేనే వెళ్లాలి. లేకుంటే వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు.. ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో ఉండి తీరాల్సిందేనని డీజీపీ ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఈ విధులు నిర్వహించేందుకు డీఎస్పీ స్థాయి అధికారి సరిపోతారు. ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని ఆదేశాలివ్వడమంటే.. వారిపై ఒక రకంగా ఒత్తిడి తీసుకురావడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడమేనని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని విశ్రాంత పోలీసు అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతో మంది సీనియర్లను కాదని మరీ డీజీపీ పదవిని కట్టబెట్టినంత మాత్రాన ఇలాంటి ఆదేశాలివ్వడమేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని