సంక్షిప్తవార్తలు(8)

పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా నిర్ణయం తీసుకున్నారు.

Updated : 21 Apr 2024 06:17 IST

పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ నెల 26 వరకు అవకాశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పనిచేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు. పోస్టల్‌ బ్యాలట్‌ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.


నిధులు లేవని బీబీఏ, బీసీఏ కోర్సులను రద్దు చేసిన ప్రభుత్వం
బీబీఏ కోర్సులను బీకాంలో పెట్టాలంటూ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేద విద్యార్థులకు బీబీఏ కోర్సులు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. వాటిని రద్దు చేయాలని సూచించింది. దేశంలో బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 24 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇవి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) పరిధిలో ఉండగా ఇటీవల ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని నిర్వహిస్తున్న కళాశాలలు.. కోర్సుకు రూ.20వేల చొప్పున చెల్లించాలని ఏఐసీటీఈ సూచిస్తూ భవిష్యత్తులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నిధులు చెల్లించేందుకు ఇష్టపడని కళాశాల విద్యాశాఖ.. ఆ కోర్సులను మూసివేయాలంటూ కళాశాలలను ఆదేశించింది. ప్రస్తుతం ఈ కోర్సులు చేస్తున్న విద్యార్థుల చదువు పూర్తయిన అనంతరం పొడిగించొద్దని సూచించింది. బీబీఏ కోర్సులను మూసేసి వీటి స్థానంలో బీకాం లాజిస్టిక్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని కళాశాల విద్యాశాఖ ఆదేశించింది. అనంతపురంలోని డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా బిజినెస్‌ డేటా అనలిటిక్స్‌ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదన పంపించగా.. కమిషనరేట్‌ వద్దని తిరస్కరించింది. బీకాంలోనే పెట్టుకోవాలని సూచించింది.


విద్యాదీవెన జమ కాక.. హాల్‌టికెట్‌ అందక.. ఉర్దూ వర్సిటీ విద్యార్థుల ఆందోళన

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఫీజు మొత్తం చెల్లిస్తేనే పరీక్షలకు హాల్‌టికెట్‌ ఇస్తామని కటువుగా చెప్పడం ప్రైవేటు విద్యాసంస్థల్లో చూస్తుంటాం. కానీ, ప్రభుత్వ ఆధీనంలో కర్నూలులో నెలకొల్పిన డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ ఉర్దూ యూనివర్సిటీలోనూ రుసుము చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పలువురు శనివారం ప్రిన్సిపల్‌ వద్దకెళ్లి తమ గోడు చెప్పుకొన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు రెండో సెమిస్టర్‌లో 87 మంది, నాలుగో సెమిస్టర్‌లో 168 మంది హాజరు కావాల్సి ఉంది. డిగ్రీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ఇస్తామని సీఎం జగన్‌ చెప్పినప్పటికీ, ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ సొమ్ములు జమ కాలేదు. ఫీజు చెల్లించిన విద్యార్థులకే హాల్‌టికెట్‌ ఇస్తామని అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై విద్యార్థులు వర్సిటీ ఉన్నతాధికారిని సంప్రదించగా, ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది విద్యా దీవెన సొమ్ములు వచ్చాకే పరీక్ష రాసుకోండని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విషయమై రిజిస్ట్రార్‌ బాయినేని శ్రీనివాసులు మాట్లాడుతూ ఫీజు చెల్లించిన వారిలో సగం మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చామని చెప్పారు. రుసుములో కొంతైనా కట్టాలని సూచించామన్నారు.


పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు రేపు

ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉదయం 11గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌ విడుదల చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వరకు పది పరీక్షలు జరిగాయి. మొత్తం 6,54,553మంది ఫీజు చెల్లించగా.. 6.23లక్షల మంది హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02లక్షల మంది పరీక్షలు రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.


రేషన్‌ వాహనాల ద్వారా నగదు పంచకుండా చూడండి
కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రచారం, డబ్బు కరపత్రాల పంపిణీ తదితర వ్యవహారాల్లో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొనకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. గుంటూరు జిల్లాలో ఎండీయూ ఆపరేటర్ల ద్వారా రేషన్‌కార్డుదారులకు రూ.5వేల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో.. ఈసీ ఆదేశాలను ఉటంకిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రేషన్‌ వాహనాల ద్వారా నగదు పంపిణీ జరిగే అవకాశం ఉందనే అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఓ ప్రకటనలో డిమాండు చేశారు.


ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా చేతన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) నూతన ఎండీగా 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి టీఎస్‌ చేతన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించింది. ఈ మేరకు ఈసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరకు ఆ కార్పొరేషన్‌కు ఎండీగా కొనసాగిన డి.వాసుదేవరెడ్డి.. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే.


రెండ్రోజుల్లో ప్రొగ్రెస్‌ సిద్ధం చేయడం కష్టం..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ప్రమోషన్‌ జాబితా తయారీ, ఎస్‌ఏ2 పేపర్ల మూల్యాంకనం పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో అన్ని వివరాలతో కూడిన ప్రొగ్రెస్‌ కార్డు ఈనెల 23లోపు రూపొందించడం కష్టమని నవ్యాంధ్ర ఉపాధ్యాయుల, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పేర్కొన్నాయి. ఇప్పటికే అన్ని మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నాయని.. వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారానే ప్రొగ్రెస్‌ కార్డులను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖను శనివారం వేర్వేరు ప్రకటనలో కోరాయి.


ముడుపులు తీసుకుని సీహెచ్‌ఓలకు బదిలీలు.. ప్రభుత్వ అనుమతి లేక నిలిచిన వేతనాలు

ఈనాడు-అమరావతి: ముడుపులు తీసుకుని బదిలీ చేసిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల (సీహెచ్‌ఓ)లకు అయిదారు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. జీతాలు చెల్లించాలంటూ వారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో ఒప్పంద విధానంలో పనిచేసే సీహెచ్‌ఓలకు బదిలీలు జరగాలంటే.. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇక్కడే అక్రమాలకు తెరలేచింది. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి.. సుమారు 300 మందిని బదిలీ చేయించారు. రాయలసీమలో కీలక మంత్రి సిఫార్సులతో ఎక్కువ బదిలీలు జరిగాయి. ఒక్కో సీహెచ్‌ఓ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు సమర్పించుకున్నారు. ఏ ఉద్యోగినైనా ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేస్తే.. వేతనాల చెల్లింపులకు తగ్గట్లు ఆన్‌లైన్‌లో మార్పులు చేయాలి. అప్పుడే బదిలీలు పొందిన వారికి వేతనాలు ఇవ్వడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వీరి బదిలీలు జరిగినందున ఆన్‌లైన్‌లో వివరాలు మార్చలేదు. దీంతో వేతనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ల ఆమోదంతో ఆర్జేడీ సంతకాలతో బదిలీలు పొందిన తాము విధులకు హాజరవుతూ, రోగులకు సేవలు అందిస్తున్నా వేతనాలు చెల్లించడం లేదని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమ బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం.. ప్రాంతీయ సంచాలకులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని