ఎన్నికల అధికారుల అభ్యంతరంతో.. సర్పంచుల అఖిలపక్ష సమావేశం రద్దు

సర్పంచుల సమస్యలపై రాజకీయ పార్టీల వైఖరి తెలుసుకోవడానికి విజయవాడలో శనివారం నిర్వహించాల్సిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘాల సంయుక్త రాష్ట్రస్థాయి అఖిలపక్ష సమావేశం రద్దయింది.

Published : 21 Apr 2024 05:21 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సర్పంచుల సమస్యలపై రాజకీయ పార్టీల వైఖరి తెలుసుకోవడానికి విజయవాడలో శనివారం నిర్వహించాల్సిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘాల సంయుక్త రాష్ట్రస్థాయి అఖిలపక్ష సమావేశం రద్దయింది. నిబంధనల మేరకు అనుమతి తీసుకోనందున సమావేశం నిర్వహించడానికి వీల్లేదని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. రాజకీయంగా ఎలాంటి ఉపన్యాసాలు, నినాదాలు చేయబోమని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ విజ్ఞప్తి చేసినా అధికారులు అంగీకరించలేదు. చివరికి సర్పంచులు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. సర్పంచుల సమస్యలు పరిష్కరించే పార్టీకే ఎన్నికల్లో మద్దతిస్తామని వైవీబీ రాజేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. సమావేశం రద్దు చేశాక ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘గ్రామీణ ప్రజల సమస్యలపై    16 డిమాండ్ల సాధనకు గత మూడేళ్లుగా వివిధ మార్గాల్లో నిరసనలు తెలిపాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యంచేసిన సీఎం జగన్‌ను ఓడిస్తేనే స్థానిక సంస్థలు మనుగడ సాగిస్తాయి. వచ్చే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తాం’ అని రాజేంద్రప్రసాద్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని