బకాయిలే ‘దీవెన’...!

ప్రతి సభలోనూ విద్యాదీవెన, వసతి దీవెనంటూ మాట్లాడే జగన్‌ చేతలు చూస్తే విస్తుపోవాల్సిందే.

Published : 21 Apr 2024 06:30 IST

ఫీజుల డబ్బులు ఎగ్గొట్టిన వైకాపా సర్కారు
పేద తల్లిదండ్రులపై రూ.3వేల కోట్ల భారం
యాజమాన్యాల ఒత్తిడితో ఆత్మహత్యలకు యత్నిస్తున్న తల్లిదండ్రులు
విధానాన్ని మార్చి.. పేదలకు అప్పులు మిగిల్చి..
ఈ ఏడాది ఒక్క రూపాయీ ఇవ్వని దుస్థితి
పేదలను పెద్ద చదువులకు దూరం చేసిన జగన్‌ 

ప్రతి సభలోనూ విద్యాదీవెన, వసతి దీవెనంటూ మాట్లాడే జగన్‌ చేతలు చూస్తే విస్తుపోవాల్సిందే. 2019 ఎన్నికల ముందు ఎంత ఖర్చైనా పేద పిల్లలను చదివించే బాధ్యత తనదంటూ ఊదరగొట్టిన ఆయన.. అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచేశారు. ప్రభుత్వం నేరుగా కళాశాలలకు ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి.. తల్లుల ఖాతాలో వేసే విధానాన్ని తెచ్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద తల్లులకు భారీగా అప్పులు మిగిల్చారు. ఆకలితో అలమటిస్తున్న వారికి అరకొర ముద్దపెట్టి.. కడుపు నింపేశామన్నట్లు ప్రచారం చేసుకుంటూ వసతి దీవెనను గాలిలో కలిపేశారు. రెండు విడతలుగా ఇవ్వాల్సిన ఈ డబ్బులను గతేడాది ఒకసారే ఇవ్వగా.. ఈసారి ఒక్క రూపాయీ లేదు. జగన్‌ మాత్రం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో ఇస్తున్నామంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

పేద తల్లులపై ఆర్థిక భారం మోపి..

జగన్‌ ఐదేళ్ల పాలనలో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల డబ్బుల రూపంలో రూ.3,174 కోట్ల భారం పడింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా.. జగన్‌ ఒక్కసారి మాత్రమే బటన్‌ నొక్కారు. అదీ ఉత్తుత్తిదే కావడంతో ఆ ఒక్క త్రైమాసికం ఫీజుల డబ్బులు దాదాపు 50% మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో పడలేదు. మరో మూడు త్రైమాసికాల ఫీజును బకాయి పెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అప్పుల్లోకి నెట్టేశారు. ఈ ఏడాది మూడు విడతలకు సంబంధించి రూ.2,124 కోట్లు విద్యార్థులే కట్టుకున్నారు. 

కరోనా సమయంలో తరగతులు నిర్వహించలేదని 2020-21లో ఒక త్రైమాసికం ఫీజులను ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి విద్యా సంవత్సరం పూర్తి చేసినందున మొత్తం ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి దండుకున్నాయి. అలా పిల్లలపై రూ.600 కోట్ల భారం పడింది. ఇది కాకుండా పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి.

ఆత్మహత్యలకు యత్నించినా.. ఆందోళనలు చేసినా..

ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో ఫీజులు కట్టలేక విశాఖపట్నంలో ఓ విద్యార్థిని తల్లి ఏప్రిల్‌ 16న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న కుమార్తె ఫీజు రూ.25వేలు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా నగదు చెల్లిస్తానని,
హాల్‌టికెట్‌ ఇవ్వాలని వేడుకున్నా యాజమాన్యం వినకపోవడంతో కుమార్తె ఆవేదన చూడలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. 

బకాయి చెల్లించకుండా బెదిరించి..

ఏ కోర్సయినా.. ఎక్కడ చదివినా నేనున్నానంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌... పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచి నిలిపివేసింది. పీజీలకూ ప్రైవేటులో బోధన రుసుములను నిలిపివేశారు. పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన రూ.450కోట్ల బకాయిలు చెల్లించకుండా.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ద్వారా ప్రభుత్వం వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియను నిర్వహించింది. బకాయిల్లో 75% మాత్రమే ఇస్తామని, దీనికే అంగీకరించాలంటూ కళాశాలలను బెదిరించింది. ఈ మొత్తమే చాలని... న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకుంది. చివరకు ఆ 75% కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను, గతంలో పీజీలు చదివిన పిల్లల్ని నిలువునా ముంచేసింది. ఉద్యోగాలు, పై చదువుల కోసం సర్టిఫికెట్లు కావాల్సిన వారు మాత్రమే అప్పులు చేసి, ఫీజులు కట్టి తీసుకువెళ్లారు.

వసతి దీవెనలోనూ మోసమే...

ఫీజుల సంగతి ఇలా ఉంటే... హాస్టల్‌ ఖర్చులదీ అదే గతి! ప్రతీ విద్యార్థికీ హాస్టల్‌ ఖర్చుల నిమిత్తం ఏటా రూ.20వేలు ఇస్తామని చెప్పిన జగన్‌ ఏ సంవత్సరంలోనూ పూర్తిగా ఆ డబ్బులు విడుదల చేయలేదు. విద్యార్థుల వసతి, భోజనం కోసమని కళాశాలలు ఏడాదికి రూ.70వేలకుపైగా వసూలు చేస్తుంటే దీవెన పేరుతో జగన్‌ ఇస్తోంది రూ.20వేల లోపే. ఈ మొత్తం ఎటూ చాలకపోయినా పేదలకు ఏదో సాయం చేస్తున్నట్లు జగన్‌ గొప్పలు చెబుతున్నారు. వీటినైనా సకాలంలో ఇస్తున్నారా? అంటే అదీ లేదు.

  • వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య తదితర కోర్సుల వారికి రూ.20వేల చొప్పున ఇస్తామని జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
  • విద్యా దీవెన రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉండగా.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క విడతే ఇచ్చారు. 2023-24కు ఒక్క విడతా ఇవ్వలేదు.
  • ప్రభుత్వ విద్యా సంస్థలైన ట్రిపుల్‌ఐటీల్లో జగన్‌ ఇచ్చే వసతి దీవెన సరిపోవడం లేదని, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్న వారికి ఏడాదికి రూ.25వేల నుంచి రూ.30వేల బిల్లులు వేస్తున్నారు.

జగన్‌ దమనకాండలో పేదలే సమిధలు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ప్రభుత్వాలు డబ్బులను నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాలకు వేసేవి. దీన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చూసిన జగన్‌ పాత విధానాన్ని మార్చేశారు. కళాశాలల ఖాతాలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసే విధానాన్ని తెచ్చారు. ఎన్నికలకు ముందు దీన్నీ మార్చేశారు. తల్లుల ఓట్లతోపాటు విద్యార్థుల ఓట్లపైన దృష్టిపెట్టిన జగన్‌ తల్లి, విద్యార్థి సంయుక్త బ్యాంకు ఖాతాకు వేస్తామంటూ మరో కొత్త విధానాన్ని తెచ్చారు. దీంతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎక్కడో దూరంగా ఉన్న విద్యార్థులు కళాశాలలకు సెలవు పెట్టి, ఇళ్లకు రావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి వెళ్లేందుకు రూ.వేలల్లో ఖర్చులు అయ్యాయి. తరగతులూ నష్టపోవాల్సి వచ్చింది.

  •  గతంలో కళాశాలల ఖాతాలకే ప్రభుత్వం నేరుగా ఫీజులు వేయడం వల్ల విద్యార్థులకు ఫీజుల తలనొప్పి ఉండేది కాదు. ప్రభుత్వం, కళాశాలల మధ్యే ఫీజుల బకాయిలు వ్యవహారం కొనసాగేది. కానీ ఓట్ల కోసం జగన్‌ సాగించిన దమనకాండలో ఇప్పుడు పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమిధలుగా మారారు. ఫీజుల డబ్బులను తల్లుల ఖాతాల్లో వేసినా.. వేయకపోయినా తమకు సంబంధం లేదని, మొత్తం ఫీజులు కట్టాలంటూ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి... ముక్కుపిండి మరీ వసూలు చేశాయి.  
  •  ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇచ్చినా ‘మీ బ్యాంకు ఖాతాల్లోనే పడతాయి. అప్పుడు వాటిని మీరే తీసుకోండి. ఇప్పుడు ఫీజు కడితేనే హాల్‌టికెట్‌’ అంటూ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేశాయి. డబ్బులు చెల్లించలేని పేదవారు కొన్నిచోట్ల ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. కొన్నిచోట్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. 

ప్రభుత్వ కళాశాలకే దయలేని వేళ...

  •  ప్రభుత్వం ఫీజులు జమ చేశాక కడతామని చెప్పినా యాజమాన్యం అంగీకరించకపోవడంతో గతేడాది డిసెంబరు 16న నర్సింగ్‌ విద్యార్థులు నెల్లూరులో రోడ్డుపైకి వచ్చి, ఆందోళన చేశారు.  
  •  విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు అందక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిరుడు ఆగస్టు 25న మూడు విభాగాల్లో నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులను అనుమతించ లేదు. ప్రభుత్వ వర్సిటీలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటులో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు!
  •  ఏలూరు జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటా, జేఎన్‌టీయూ వర్సిటీ కామన్‌ ఫీజు కట్టాలని, లేకపోతే పరీక్షలకు హాజరుకానివ్వమని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులంతా అప్పులు చేసి, ఫీజులు కట్టారు.
  •  విజయవాడకు చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే చివరి సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరించడంతో అప్పు చేసి, రూ.70వేలు చెల్లించారు.
  •  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ముందే ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని