‘ఓర్నీయ... కూర్చో నేనూ రైతునే’!.. అన్నదాతపై మంత్రి కారుమూరి దుర్భాషలు

పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరో మారు రైతుపై నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో శనివారం ఆయన పర్యటించారు.

Updated : 21 Apr 2024 07:19 IST

గతంలో ‘ఎర్రిపప్పా’ అని తిట్టిన మంత్రి

తణుకు, న్యూస్‌టుడే: పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరో మారు రైతుపై నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో శనివారం ఆయన పర్యటించారు. ధాన్యం విక్రయాల సమస్యలను తెలుసుకొనే క్రమంలో ఆయన గోటేరు గ్రామానికి చెందిన రైతుతో ధాన్యం బస్తాలపై కూర్చొని మాట్లాడారు. ఈ కమ్రంలో రైతు పైకి లేచారు. దీంతో మంత్రి ‘ఓర్నీయ... కూర్చో నేను కూడా రైతునే’ అని దుర్భాషలాడారు. దీంతో పక్కనున్న రైతులంతా ఇదేంటి మంత్రి స్థాయిలో ఉండి ఇలా బూతు మాటలు తిడుతున్నారని అవాక్కయ్యారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు వైకాపా ప్రజాప్రతినిధి ఇచ్చే గౌరవం ఇదా అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నదాతంటే అంత అలుసా..

అన్నదాతలను దుర్భాషలాడటం మంత్రికి కొత్తేం కాదు. గతంలో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. ఆ సమయంలో వేల్పూరు వచ్చిన మంత్రికి ధాన్యం మొలకలు వచ్చాయని, గోనె సంచులు ఇవ్వడం లేదని ఓ రైతు గోడు వినిపించగా ‘తడిస్తే మొలకలు రాకపోతే ఏం వస్తాయి వెర్రిపప్పా’ అని దుర్భాషలాడారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..‘ఆ మాట బూతు కాదు..ఎర్రిపప్పా అంటే బుజ్జికన్నా అని అర్థం’ అంటూ సమర్థించుకున్నారు. ఇప్పుడు మరోసారి నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఓర్నియ... కూర్చో అన్నది ఆత్మీయ పలకరింపేనని సమర్థించుకున్నారు. ఆ రైతును పక్కన పెట్టుకొని ఈ వివరణ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని