నక్కపల్లిలో వెలవెలబోయిన జగన్‌ రోడ్‌షో

నక్కపల్లి మండలంలో సీఎం జగన్‌ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. ఆయన శుక్రవారం రాత్రి గొడిచెర్ల వద్ద బస చేశారు.

Updated : 21 Apr 2024 10:36 IST

నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలంలో సీఎం జగన్‌ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. ఆయన శుక్రవారం రాత్రి గొడిచెర్ల వద్ద బస చేశారు. శనివారం ఉదయం పదిన్నర ప్రాంతంలో అక్కడినుంచి యాత్ర మొదలైంది. ప్రారంభంలోనే పట్టుమని 200 మంది కూడా లేకపోవడంతో పార్టీ వర్గాలు సైతం ఆందోళన చెందాయి. మరోవైపు పోలీసులు ఈ ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలుచేశారు. ఈ కూడలి నుంచి గొడిచెర్ల, డొంకాడ, జి.జగన్నాథపురం, చీడిక కొత్తూరు, ముకుందరాజుపేట తదితర ప్రాంతాలకు జనం రాకపోకలు సాగిస్తుంటారు. పాఠశాలలు, పనికి వెళ్లే వారికి ఆటంకం కల్పిస్తూనే బయటకు పంపించగా.. పల్లెల్లోకి ఉద్యోగులను తప్పితే మిగిలినవారిని వెళ్లనీయలేదు. దీంతో జనం చేసేది లేక ఉద్దండపురం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. జగన్‌ బస్సు యాత్ర బయలుదేరడానికి సుమారు అరగంట ముందే తుని నుంచి విశాఖ మార్గంలో వాహనాలను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు అవస్థలు పడ్డారు. దాదాపు రెండు గంటలకుపైగా ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. కాగిత, నక్కపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోగా.. ఎండవేడికి తాళలేని జనాలు వాహనాల నుంచి దిగి రోడ్లపక్కన చెట్ల కింద సేదదీరారు. గొడిచెర్ల కూడలిలో ఉన్న దుకాణ సముదాయాలను భద్రత పేరిట పోలీసులు మూయించేశారు. యాత్ర పొడవునా జనం లేకపోయినా సీఎం బస్సులో నుంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. సభలకు పెద్దగా స్పందన లేకపోవడంతో సీనియర్‌ నేతల వద్ద ప్రస్తావించి సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్‌.రాయవరం మండలంలో ద్విచక్రవాహనాల పెట్రోల్‌కు రూ.200, బిర్యానీకి రూ.100 చొప్పున ఇస్తామని జనాలను తరలించారు.

గోకులపాడు వద్ద ప్రజలకు అభివాదం చేసేందుకు జగన్‌ బస్సు తలుపు వద్దకు రాగానే అక్కడి యువకులు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి సీఎం పవర్‌స్టార్‌ అంటూ పెద్దఎత్తున నినదించారు. అక్కడున్న పోలీసులు నినాదాలు వద్దని హెచ్చరించారు. జగన్‌ మొక్కుబడిగా ఓ మహిళతో మాట్లాడి బస్సు లోపలికి వెళ్లిపోయారు.

ఒక్కడికే వందనం: నక్కపల్లి మండలం ఉద్దండపురం కూడలి వద్ద  ఉన్న ఒక్కడికే బస్సులో నుంచి వంగి నమస్కారం చేస్తున్న జగన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు