నిరాడంబరంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం కణేకల్లు క్రాసింగ్‌లోని విద్యానికేతన్‌ పాఠశాల ఆవరణలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు శనివారం నిరాడంబరంగా జరిగాయి.

Published : 21 Apr 2024 05:28 IST

కణేకల్లు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం కణేకల్లు క్రాసింగ్‌లోని విద్యానికేతన్‌ పాఠశాల ఆవరణలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు శనివారం నిరాడంబరంగా జరిగాయి. తెదేపా శ్రేణులు, పాఠశాల యాజమాన్యం, చిన్నారులు వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు కేక్‌ కోసి చిన్నారులకు తినిపించారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. తెదేపా రాయదుర్గం, అనంతపురం, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థులు కాలవ శ్రీనివాసులు, దగ్గుపాటి ప్రసాద్‌, బండారు శ్రావణిశ్రీ, అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యానికేతన్‌ కరస్పాండెంట్‌ రవికుమార్‌, కౌసల్య ఆనందరాజు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.


ఏపీ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు అంకితం

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన నాయకుడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. శనివారం ఆయన జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు. నిరంతరం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితమయ్యారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు దేవుడు దీర్ఘాయువు, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానికి చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేయడానికి కంకణబద్ధుడనై ఉంటానని పేర్కొన్నారు.


సినీ నటుడు చిరంజీవి శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రబాబుకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమానికి పాటుపడే చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


చంద్రబాబుకు ఐటీ ఉద్యోగుల అభినందన

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీ ఉద్యోగులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ టవర్స్‌ కూడలిలో ఆయనకు మద్దతుగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తున్న ఐటీ ఉద్యోగులు

న్యూస్‌టుడే, మాదాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని