ఒడిశా డిస్కంల కంటే మనమే వెనుకబాటు!

కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల డిస్కంలకు కేటాయించిన గ్రేడింగ్‌లో రాష్ట్ర డిస్కంలు  మెరుగైన పనితీరు చూపలేకపోయాయి.

Published : 21 Apr 2024 05:35 IST

ఒక్క డిస్కంకూ దక్కని ఎ ప్లస్‌ గ్రేడింగ్‌
ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లకు బి మైనస్‌
ప్రభుత్వం సబ్సిడీ బకాయిలు చెల్లించని ఫలితం
డిస్కంల ఆర్థిక నిర్వహణపై ప్రభావం

ఈనాడు-అమరావతి: కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల డిస్కంలకు కేటాయించిన గ్రేడింగ్‌లో రాష్ట్ర డిస్కంలు  మెరుగైన పనితీరు చూపలేకపోయాయి. దేశవ్యాప్తంగా 12 డిస్కంలు  ఎ ప్లస్‌ గ్రేడింగ్‌ సాధిస్తే.. అందులో రాష్ట్రానికి చెందిన ఒక్క డిస్కంకూ చోటు దక్కలేదు. డిస్కంల నిర్వహణ ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదనడానికి ఇటీవల కేంద్రం ప్రకటించిన గ్రేడింగులే నిదర్శనం. విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరు ఆధారంగా నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ రేటింగ్‌, ర్యాంకింగ్‌ను కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా గ్రేడింగ్‌ కోసం 72 రాష్ట్ర, ప్రైవేటు డిస్కంలు అందించిన వివరాలను కేంద్రం పరిశీలించింది. అందులో 66 డిస్కంలకు అవి చూపిన ప్రతిభ ఆధారంగా ఎ ప్లస్‌, ఎ, బి, బి మైనస్‌ , సి, సి మైనస్‌ గ్రేడ్లను ఇచ్చింది. డిస్కంల ఆర్థిక నిర్వహణకు 75 మార్కులు, పనితీరుకు 13 మార్కులు,  ఇతర అంశాలకు 12 మార్కులు
కలిపి మొత్తం 100 మార్కుల ఆధారంగా గ్రేడ్లను కేటాయించింది. 

మనకంటే.. ఒడిశా మేలు!

దేశ వ్యాప్తంగా 12 డిస్కంలు ఎ ప్లస్‌ గ్రేడింగ్‌ దక్కించుకుంటే.. అందులో గుజరాత్‌కు చెందిన 6 డిస్కంలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన రెండు డిస్కంలూ జాబితాలో చోటు సంపాదించాయి. ఎంతో గొప్పగా చెప్పుకునే రాష్ట్ర డిస్కంలు మాత్రం వెనుక వరుసలో నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్రకు చెందిన డిస్కంలూ మనకంటే మెరుగైన పనితీరు చూపాయి. రాష్ట్రానికి చెందిన ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లు పనితీరు కొంత మెరుగు పరుచుకున్నా.. బి(-) గ్రేడింగ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డిస్కంల గ్రేడింగ్‌ దెబ్బతినడానికి పరోక్షంగా ప్రభుత్వమే కారణం. వాటికి చెల్లించాల్సిన రాయితీ బకాయిలను మూడేళ్లలో సవ్యంగా విడుదల చేయ లేదు. ప్రభుత్వ విభాగాలు వినియోగించిన విద్యుత్తుకు బిల్లులు నిర్దేశిత వ్యవధిలో చెల్లించడం లేదు. ఈ కారణంగా ఆర్థిక సర్దుబాటు కోసం డిస్కంలు అప్పులు తెచ్చి నిర్దేశిత వ్యవధిలో తీర్చలేక పోయాయి. అలాగే ట్రాన్స్‌కో, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా నిర్దేశిత గడువులో ఇవ్వకపోవడం వల్ల వాటి గ్రేడింగ్‌ దెబ్బతింది.


మూడు డిస్కంలు.. అంతంత మాత్రమే
ఎస్‌పీడీసీఎల్‌: బి(-) గ్రేడ్‌

ః కేంద్రం ప్రకటించిన గ్రేడ్‌లలో 100 మార్కులకు గాను ఎస్‌పీడీసీఎల్‌ 47.8 మార్కులు పొంది 28వ స్థానంలో నిలిచింది. రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా 10 మార్కులకు గాను ఒక్కటీ రాలేదు. నగదు సర్దుబాటుకు కేటాయించిన 7 మార్కులకు గాను.. 1.6 మార్కులే వచ్చాయి. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతించిన మేరకు పంపిణీ నష్టాలను నియంత్రించని కారణంగా 2 మార్కులకు గాను కేవలం 0.8 మార్కులే దక్కాయి.

సీపీడీసీఎల్‌: బి మైనస్‌ గ్రేడ్‌

సీపీడీసీఎల్‌ 45.1 మార్కులు మాత్రమే సాధించి 31వ స్థానంలో నిలిచింది. నిర్దేశిత వ్యవధిలో రుణాలను చెల్లించని కారణంగా 10 మార్కులకు గాను.. ఒక్క మార్కు కూడా సాధించలేక బి మైనస్‌ గ్రేడ్‌తో సరిపెట్టుకుంది.

ఈపీడీసీఎల్‌: ఎ గ్రేడ్‌

ఈపీడీసీఎల్‌ 71.2 మార్కులతో ఎ గ్రేడ్‌ దక్కించుకుంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీల వసూలులో రెడ్‌ కేటగిరిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని