విశాఖలో ఏం మిగిల్చారని వస్తున్నారు జగన్‌!

బిగ్‌ బాస్కెట్‌లో పెట్టిన ఆర్డర్‌ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌.. ‘మీరు హెచ్‌ఎస్‌బీసీలో పనిచేశారు కదా? నన్ను గుర్తు పట్టారా’ అని నన్ను అడిగారు.

Updated : 21 Apr 2024 08:40 IST

భూములన్నీ వైకాపా నాయకులు స్వాహా చేశారు
పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేశారు
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు
నేడు విశాఖకు సీఎం జగన్‌

బిగ్‌ బాస్కెట్‌లో పెట్టిన ఆర్డర్‌ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌.. ‘మీరు హెచ్‌ఎస్‌బీసీలో పనిచేశారు కదా? నన్ను గుర్తు పట్టారా’ అని నన్ను అడిగారు. తాను కూడా హెచ్‌ఎస్‌బీసీలో మాజీ ఉద్యోగినని చెప్పడంతో నేను షాక్‌ అయ్యాను. కార్పొరేట్‌ ఉద్యోగం వదిలి ఇలా డెలివరీ బాయ్‌గా ఎందుకు మారారని అడిగాను. హెచ్‌ఎస్‌బీసీ విశాఖలో కార్యకలాపాలు నిలిపివేయడంతో మానుకోవాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాలకు వెళ్లలేక ఇలా డెలివరీ బాయ్‌గా మారానని.. ఒక్కో డెలివరీకి రూ.45 చొప్పున సంపాదిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం డెస్టినీ నగరానికి ఉజ్వల భవిష్యత్‌ను కల్పించిందని చెబుతోంది కదా? స్థానికంగా అవకాశాలు లేవా అని అడిగాను. ఎత్తైన భవనాలు నిర్మించడం, కూడళ్లలో బొమ్మలు పెట్టడం కాదని, అన్ని రకాల నైపుణ్య శిక్షణలతో ఉపాధి అవకాశాలు స్థానికంగా కల్పించడమే భవిష్యత్‌ అంటూ అతను సమాధానం ఇచ్చారు’

  ఓ యువతి తన ఇన్‌స్టా పేజీలో పెట్టిన సందేశం ఇది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


ఈనాడు, విశాఖపట్నం: ‘వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు విశాఖలోని భూములన్నీ స్వాహా చేసేసుకున్నారు..! పరిశ్రమలు, పెట్టుబడుల్నీ తరిమేశారు..సీఎం ముచ్చట తీర్చుకోవడం కోసం రుషికొండకు గుండు కొట్టారు. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ముఖ్యమంత్రి నివాసం కోసం విలాసవంతమైన భవంతిని నిర్మించారు. పర్యాటక రంగాన్ని పడకేయించారు. ఐటీ రంగంలో చీకట్లు నింపారు.. అయిదేళ్ల పాలనలో విశాఖకు ఇవి తప్ప మీరేం చేశారు జగన్‌?’ ఆదివారం విశాఖ జిల్లాలో ‘సిద్ధం’ బస్సు యాత్రకు వస్తున్న ముఖ్యమంత్రికి ఇక్కడి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. దసపల్లా, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో, సీబీసీఎన్‌సీ, ఎన్‌సీసీ.. ఇలా నగరంలో అత్యంత విలువైన భూములు, ప్రాజెక్టులనూ వైకాపా నేతలు కొట్టేశారు. పోనీ ఈ ప్రాంతానికి విపక్ష నేతగా పాదయాత్రలోను, ముఖ్యమంత్రి హోదాలోనూ ఇచ్చిన హామీలను ఏమైనా జగన్‌ నెరవేర్చారా అంటే అదీ లేదు? విశాఖ నుంచి ఎంత వీలైతే అంత పిండుకోవాలన్న ఆలోచన తప్ప నగరం అభివృద్ధికి చేసింది శూన్యమే. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి రూ.23,200 కోట్ల రుణం తెచ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ అయిదేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా తేలేదు సరికదా, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి ప్రాజెక్టులను, పెట్టుబడులనూ వెళ్లగొట్టారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్న జగన్‌ను.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని నిలదీసేందుకు విశాఖ ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు.

ఐటీలో చీకట్లు నింపిన జగన్‌..!

సాగరతీరంలో ‘ఐటీ వెలుగులు నింపుతాం’ అంటూ అప్పటి విపక్ష నేతగా జగన్‌ ఢంకాభజాయించి చెప్పారు. ఆయన అధికారంలోకి రాగానే, ఉన్న కంపెనీలను విశాఖపట్నాన్ని వదిలేలా చేసి ఐటీ రంగాన్ని చీకట్లలోకి నెట్టేశారు. కార్పొరేట్‌ ఉద్యోగాలు కోల్పోయిన యువత క్యాబ్‌ డ్రైవర్లుగా, డెలివరీ బాయ్స్‌గా మారారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరుగున ఉన్న ఒడిశాలోని భువనేశ్వర్‌లో గత అయిదేళ్లలో ఐటీ రెండింతలు అభివృద్ధి చెందింది. ఇన్ఫోసిస్‌ వంటి పెద్ద క్యాంపస్‌లతోపాటు, పలు బడా కంపెనీలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఐటీ ఎగుమతులు పెరిగిపోయాయి. అదే అయిదేళ్లలో ఏపీలో చూస్తే జగన్‌ నాయకత్వలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి రూ.100 కోట్లు బకాయిపెట్టారు. తొలివిడతగా విశాఖలోని 86 ఐటీ కంపెనీలకు సంబంధించి రూ.28 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే ఖాతాల్లో జమ చేస్తామంటూ ఐటీ మంత్రి అమర్నాథ్‌ కోతలు కోశారు. ఫలితం లేకపోవడంతో కొన్ని ఐటీ కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 8 వారాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికీ రూపాయి అందించలేదు.

ఉత్తుత్తి శంకుస్థాపనలతో సరి..!

జగన్‌ 2019 డిసెంబరులో విశాఖకు వచ్చిన సందర్భంగా ఒకేసారి రూ.750 కోట్ల విలువైన జీవీఎంసీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఖర్చు చేసింది సుమారు రూ.130 కోట్లు మాత్రమే.  ప్రతి నియోజకవర్గానికి ఈతకొలను, ఇండోర్‌ స్టేడియం హామీలు అటకెక్కాయి. రూ.37 కోట్లతో శంకుస్థాపన చేసిన ప్లానిటోరియం ప్రాజెక్టు చతికిలపడింది. తూర్పు నియోజకవర్గంలోని పాండురంగపురంలో రజకులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలు కాలేదు. విశాఖ నగర తాగునీటి సమస్యను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు తాడేపల్లిలో జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏలేరు నుంచి పైపులైన్ల ద్వారా 300 ఎంఎల్‌డీ జలాలు నేరుగా నగరానికి సరఫరా అయ్యేలా రూ.3,338 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని చెప్పి మాట ఇచ్చి నెరవేర్చలేదు. ఎప్పుడో పరుగులు పెట్టించాల్సిన విశాఖ మెట్రోను అటకెక్కించి, డీపీఆర్‌ మార్పు చేసి ఈ ఏడాది జనవరి 15న శంకుస్థాపన చేస్తామంటూ హడావుడి చేసి పక్కన పెట్టేశారు.

హనుమంతువాక పైవంతెనకు అతీగతీ లేదు

జగన్‌ 2022లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. హనుమంతువాక వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ దీనికి అతీగతీ లేదు. నగరవాసులు ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం మధ్య 58 కి.మీ.ల పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని నెలల క్రితం నిర్ణయించింది. గాజువాక, మద్దిలపాలెం/సత్యం జంక్షన్‌, హనుమంతువాక, కారుషెడ్‌ జంక్షన్లలో ప్రధానంగా నాలుగు వంతెనలను జీవీఎంసీ ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులను ఎన్‌హెచ్‌ఏఐ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం, డీపీఆర్‌ ఖరారు చేయడంలో నిర్లక్ష్యం నగరవాసులకు శాపమైంది.

‘ఉక్కు’ ఊపిరితీసి ఓట్లెలా అడుగుతారు జగన్‌?

విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనుల కేటాయింపుపై అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే స్టీల్‌ ప్లాంటుకు ప్రత్యేక గనులు కేటాయింపుపై కిక్కురుమనలేదు. పైగా విశాఖ ఉక్కు పరిశ్రమకు విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్‌ గనుల లీజు పొడిగించకుండా నిలిపి వేశారు. రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయం చేసి, ప్రతిగా ప్రభుత్వ పథకాలకు స్టీల్‌ను తీసుకెళ్లాలని అభ్యర్థించినా పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని