విలీన.. విషాదం!

దూరపు కొండలు నునుపు... అన్న చందంగా గత ఎన్నికల్లో జగన్‌ వెంట నడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు అసలు నిజం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు.

Updated : 21 Apr 2024 13:01 IST

జగన్‌ దెబ్బకు ఆర్టీసీ ఉద్యోగుల విలవిల
నమ్మించి గొంతుకోసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వంలో చేరాక తర్వాత అనేక ప్రయోజనాల కోత
నాలుగేళ్లు దాటినా చెల్లించని బకాయిలు

నమ్మక ద్రోహం...
ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ చేసిందిదే!
2019లో హామీలతో వారికి ఎరవేశారు...
విలీనం చేస్తా.. వీరతాళ్లు వేస్తానన్నారు...
ఓట్లేయించుకుని ఒడ్డుకు చేరారు...
ప్రభుత్వంలో కలిపేసి సమస్యలను వదిలేశారు!
నాడు గెలిపించినందుకు నేడు గేలిచేశారు...

దూరపు కొండలు నునుపు... అన్న చందంగా గత ఎన్నికల్లో జగన్‌ వెంట నడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు అసలు నిజం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. వైకాపాని గెలిపిస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. తర్వాత పేరుకి విలీనం చేసినా... ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు కల్పించలేదు. సరికదా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన అనేక సదుపాయాలనూ కోసేశారు. బకాయిలనూ చెల్లించలేదు. విలీనం జరిగి నాలుగేళ్ల నాలుగు నెలలైనా ఇంకా వీరికి ఏ పింఛను ఇస్తారో చెప్పడంలేదు. తమ విధులు, వాటి సమయాలు వేరని, ఆరోగ్య సమస్యలు ఎక్కువని, మెరుగైన వైద్యం అందించాలని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా ఖాతరు చేయడంలేదు. ఇక ఉద్యమిస్తామంటూ గట్టిగా హెచ్చరిస్తే ఒకటీ, అరా సమస్యలను పరిష్కరించారు. దీంతో జగన్‌ ప్రభుత్వానికి ఓ దండమంటూ ఆర్టీసీ ఉద్యోగులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సంస్థలో నాలుగేళ్లకే వేతన సవరణ

ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేది. సంస్థలో 2017లో చివరగా వేతన సవరణ జరిగింది. అయితే, 2020 జనవరి ఉంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్లకు ఒకసారి వేతన సవరణ ఉంటుంది. విలీనం కారణంగా వేతన సవరణ రూపంలో ఆర్టీసీ ఉద్యోగులకు నష్టమే జరుగుతోంది. ఆర్టీసీలో ఏడేళ్ల కిందట వేతన సవరణ చేశారు. దీనికి సంబంధించి 2017 ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 22 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సంస్థలోని 51 వేల మంది ఉద్యోగులందరికీ ఒకేసారి బకాయిలు
ఇవ్వలేదు. తొలుత ఉద్యోగ విరమణ చేస్తున్న వారికే అంటే... ఈ ఏడాది జనవరి నుంచి మొదలు 2030 డిసెంబరు వరకు రిటైర్‌ అయ్యేవారికి చెల్లించారు. 2031 నుంచి రిటైర్‌ అయ్యే వారికి తొలుత 50% చెల్లిస్తామని ఇటీవలే ప్రకటించారు. వీరిలోనూ కొందరికి 25 శాతమే
చెల్లించారు. అందరికీ పూర్తిగా బకాయిలు అందేందుకు ఎన్నేళ్లు ఎదురుచూడాలో మరి.

ఇప్పుడు రిటైరైనోళ్లకు ఏ వైద్యమూ లేదు

సాధారణంగా ఆర్టీసీలో రిటైర్‌ అయ్యేముందు ఉద్యోగులకిచ్చే సెటిల్‌మెంట్‌ సొమ్ములో రూ.25-30 వేల మధ్య తీసుకొని... దానితో ఆ ఉద్యోగికి, భాగస్వామికి జీవితాంతం ఆర్టీసీ తరపున వైద్యం అందించేవారు. విలీనమయ్యాక రిటైర్‌ అవుతున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. దీంతో వీరికి ఆర్టీసీ వైద్యం పొందే సదుపాయం లేదు. ప్రభుత్వ పింఛను తీసుకుంటేనే ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం పొందొచ్చు. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి పింఛను లేదు. అంటే ఏవైద్యమూ అందే అవకాశం లేకుండా పోయింది. వీరికి అనారోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.

పథకాలు రద్దయినా రికవరీ సొమ్ము ఇవ్వలేదు... 

ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో గతంలో రెండు పథకాలు కొనసాగేవి. విలీనమయ్యాక వాటిని యాజమాన్యం రద్దుచేసింది. స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ (ఎస్‌బీటీ) కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే, బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షలతోపాటు ఆ ఉద్యోగి నుంచి సేకరించిన మొత్తాన్ని
వడ్డీతోసహా అందించేవారు. ఉద్యోగి రిటైరైతే వడ్డీతోసహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు ఎస్‌బీటీ నిలిపేశారు. వీరికి ఏపీ ప్రభుత్వ జీవిత బీమా(ఏపీజీఎల్‌ఐసీ) వర్తింపజేశారు. 55 ఏళ్లు దాటని వారికి ఏపీజీఎల్‌ఐసీకి అర్హత లేకపోవడంతో వారికి ఎస్‌బీటీ కొనసాగుతోంది. ఎస్‌బీటీ రద్దయిన వారికి, ఇన్నేళ్లు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సి ఉండగా, 2026-27 వరకు రిటైర్‌ అయ్యేవారికి మాత్రమే చెల్లించారు. మిగిలిన వారికి ఎప్పుడిస్తారో స్పష్టత లేదు.

 ఆర్టీసీలో పదవీ విరమణ ప్రయోజనం పథకం(ఎస్‌ఆర్‌బీఎస్‌) కొనసాగింది. దీనిలో భాగంగా ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత పక్కనబెట్టి, దానికి యాజమాన్య వాటా జతచేసి, ఉద్యోగి రిటైర్‌ అయితే నెలకు రూ.3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు. ఆ ఉద్యోగి మరణిస్తే, జీవిత భాగస్వామికి అందులో సగం అందించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక దీన్ని నిలిపేశారు. విలీనానికి ముందు రిటైర్‌ అయిన ఉద్యోగులకు మాత్రమే ఎస్‌ఆర్‌బీఎస్‌ కింద నగదు ప్రయోజనం అందిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఈ పథకం రద్దవడంతో..
వారు ప్రతినెలా చెల్లించిన మొత్తాన్నీ వెనక్కి ఇవ్వాల్సి ఉంది. కానీ 2026-27 వరకు రిటైర్‌ అయ్యేవారికి మాత్రమే సెటిల్‌మెంట్‌ చేశారు.

పాతపింఛను లేకుండా నమ్మకద్రోహం

ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛన్‌ను తమకూ వర్తింపజేస్తారనే నమ్మకంతో ఆర్టీసీ ఉద్యోగులంతా విలీనం కోరుకున్నారు. జగన్‌ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. అసలు పాత పింఛను ఊసే ఎత్తొద్దంది. పైగా ఏ పింఛను ఇవ్వాలనే దానిపై నాలుగేళ్ల వరకు నిర్ణయమే తీసుకోలేదు. ఎన్నికలు సమీపించడంతో దీనిపై హడావిడి చేశారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు ఉద్యోగులు... ఉద్యోగి భవిష్య నిధి(ఈపీఎఫ్‌) పింఛను పొందేవారు. 11వ వేతన సవరణ అమలు సందర్భంగా ఈ ఉద్యోగులకు పింఛన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని పీఆర్సీ కమిషన్‌ సూచించింది. దీంతో గతయేడాది చివర్లో ఉద్యోగుల నుంచి ఆప్షన్స్‌ అడిగారు. ప్రస్తుతమున్న ఈపీఎఫ్‌ పింఛనులో కొనసాగుతారా? కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌)లో చేరి, ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) పొందుతారా? అని ఉద్యోగులందరినీ అడిగారు. పదేళ్ల సర్వీసు ఉంటేనే జీపీఎస్‌కు అర్హత పొందుతారని, 33 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తిస్థాయి జీపీఎస్‌ అందుతుందనే నిబంధనలు ఉన్నాయి. దీంతో అత్యధిక ఉద్యోగులు ఈపీఎఫ్‌ పింఛనులో కొనసాగుతామన్నారు.

నాటి వైద్య సేవలు ఏవీ?

ఆర్టీసీ ఉద్యోగుల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ల సంఖ్య ఎక్కువ. వీరంతా పగలు, రాత్రి షిఫ్ట్‌లు పనిచేస్తారు. గతంలో ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు జరిపిస్తే... 15,004 మందికి బీపీ, 13,390 మందికి షుగర్‌, 4,588 మందికి కీళ్లనొప్పులు, 2,260 మందికి ఆస్తమా, 261 మందికి క్యాన్సర్‌, 2,363 మందికి గుండె జబ్బులు, 606 మందికి కిడ్నీ సమస్యలు, 3,562 మందికి కంటి చూపు సమస్య, 3,276 మందికి నరాల వ్యాధి కలిపి మొత్తం 45,310 మందికి అనారోగ్య సమస్యలున్నట్లు తేలింది. అందుకే సంస్థ వీరికి నగదు పరిమితిలేని ఉచిత వైద్యాన్ని అందించింది. ఆర్టీసీ ఆసుపత్రులతోపాటు వ్యాధిని బట్టి రిఫరల్‌ ఆసుపత్రులకు పంపేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈహెచ్‌ఎస్‌ అమలు చేస్తున్నారు. దీనివల్ల అనేక ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదు. తమకు పాత విధానం అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

భత్యాలు ఇవ్వడంలోనూ పేచీలే

డ్రైవర్లు, కండక్టర్లు ప్రతిరోజూ రాత్రిపూట 3వేల సర్వీసుల్లో విధులకు హాజరవుతారు. వారికి రాత్రిపూట భత్యాన్ని ప్రతినెలా జీతంతోపాటు కలిపి చెల్లించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక దీన్ని ఆపేశారు. ఉద్యోగ సంఘాల విన్నపంతో భత్యం ఇచ్చేందుకు అంగీకరించినా... జీతంతో కాకుండా వేరుగా ఇస్తున్నారు. జీతంతోపాటు ఇవ్వాలని అనేక వినతులు ఇవ్వగా ఇటీవల ఉత్తర్వులిచ్చారు. అయినాసరే ఇప్పటికి
47 డిపోల ఉద్యోగులకు జీతంతోపాటు భత్యం అందడంలేదు.

మొదటి నెల రికవరీలు.. రూ.100 కోట్లు ఇవ్వలేదు

ఆర్టీసీ ఉద్యోగులకు 2022 సెప్టెంబరు నుంచి పీఆర్సీ అమలు చేయగా, ప్రభుత్వం ఆ నెల నెట్‌ జీతాన్ని మాత్రమే చెల్లించింది.
ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌, కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) రుణ రికవరీ తదితరాలన్నీ కలిపి రూ.100 కోట్ల వరకు కట్‌ చేసుకుంది. వీటిని పీఎఫ్‌ ట్రస్ట్‌కు, సీసీఎస్‌లకు ఏడాదిన్నర దాటినా జమ చేయడంలేదు.

అప్పీళ్లలోనూ అన్యాయమే!

గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏవైనా తప్పులు చేస్తే, యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. వాటిపై మూడు స్థాయిల్లో అప్పీలుకు అవకాశం ఉండేది. తొలుత సీనియర్‌ స్కేల్‌ అధికారికి, తర్వాత రీజనల్‌ మేనేజర్‌(ఆర్‌ఎం), చివరికి జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)లను
ఆశ్రయించేవారు. ఒకవేళ వీరివద్ద ఉపశమనం లభించకుంటే కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏడాది, ఏడాదిన్నరలో కేసు పరిష్కారమయ్యేది. విలీనం తర్వాత ఇప్పుడు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి, ఈడీల వద్ద మాత్రమే అప్పీలుకు అవకాశమిచ్చారు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండాపోయింది. హైకోర్టును ఆశ్రయిస్తే కేసు పూర్తయ్యేసరికి ఎన్నో ఏళ్లు పడుతుందని, ఖర్చునూ భరించలేమని ఉద్యోగులు వాపోతున్నారు.

నెలనెలా ప్రభుత్వం వాటా

ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలు ఇస్తున్నప్పటికీ... సంస్థ ఆదాయం నుంచి 25% వాటా తీసుకుంటోంది. ఆర్టీసీకి నెలకు రూ.500-600 కోట్ల రాబడి ఉంటే అందులో నుంచి రూ.125-150 కోట్లను తన ఖజానాలో వేసుకుంటోంది. ప్రభుత్వం ఒక ఏడాదిపాటు వాటాను తీసుకోకుంటే ఉద్యోగుల అన్ని బకాయిలను చెల్లించే వీలుంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటంలేదు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని