మాటలతో ఓదార్చి.. చేతల్లో ఏమార్చి..!

రైతుల కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్‌ వారింటికి వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇవ్వాలి.

Updated : 21 Apr 2024 12:51 IST

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు దక్కని భరోసా
సాయం కోసం నెలలు, ఏళ్ల తరబడి ఎదురుచూపులే
బాధితులను ఓదార్చని కలెక్టర్లు, వైకాపా ఎమ్మెల్యేలు
43 జీవోపై మాట తప్పిన సీఎం జగన్‌
మళ్లీ రైతుల ముందుకు ఎలా వస్తున్నారు?

జగన్‌ గొప్పగా చెప్పిందేమిటంటే

రైతుల కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్‌ వారింటికి వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇవ్వాలి. అదీ ఏడు రోజుల్లోనే అందించాలి. అన్నదాతల విషయంలో సానుభూతి, మానవీయతతో ఉండాలి. మనిషే చనిపోయిన తర్వాత మనం కూడా తోడుగా లేకుంటే సరైన సందేశం ఇచ్చినట్టు కాదు. బాధితులకు ఆత్మస్థైర్యం ఇవ్వడమే మన ఉద్దేశం’’ అంటూ 2019 జులై 10న స్పందన సమీక్ష సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ ఎంతో మానవతావాదిగా గొప్పలు చెప్పారు.

వాస్తవంగా జరిగిందిదీ...

రాష్ట్రంలో ఏటా 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో కనీసం 1% మంది ఇళ్లకు కూడా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు వెళ్లిన దాఖలాలు లేవు. సాయం కోసం బాధితులు నెలలు, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఓదార్పులైనా లేవు. త్రీమెన్‌ కమిటీలు కూడా రైతుల్ని పరామర్శించలేదు. వైకాపా నేతల సిఫార్సులనే పరిగణనలోకి తీసుకున్నారు. వారి కరుణ లేకుంటే... ఆత్మహత్య చేసుకున్న వారిని అసలు రైతులుగా గుర్తించడం లేదు. 7రోజుల్లో సాయం నిబంధన అమలు కావడమే లేదు.

ఇంటి యజమానిని కోల్పోయి... కుటుంబం గడిచే మార్గం లేక, పిల్లల చదువులు సాగక, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతు కుటుంబాలకు మేమున్నామనే ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, జగన్‌ మాటల్లో విన్పించే ఉదారత... సాయం విషయంలో లేశమాత్రమైనా కనిపించదు. సాగులో నష్టాల కారణంగా అన్నదాతలు ప్రాణాలను వదులుతుంటే.. దానికి ప్రభుత్వ   అస్తవ్యస్త విధానాలూ ఒక కారణమనే ఆలోచనే చేయరు. సరికదా? రైతు కుటుంబాల్లో జగన్‌కు మాత్రం చిక్కటి చిరునవ్వులు కన్పిస్తున్నాయంట. బాధిత కుటుంబానికి వారంలో రూ.7లక్షల పరిహారం  అందజేస్తామన్న హామీ గాలిలో దీపమైంది. పార్టీల ముసుగులో పరిహారం అందకుండా వైకాపా నేతలు కొర్రీలు పెడుతున్నారు.

పరిహారం ఇమ్మంటే  పరిహాసపు మాటలు!

వందల సంఖ్యలో ఉన్న రైతు ఆత్మహత్యల నివేదికలను పరిశీలించకుండానే కార్యాలయాల్లో అధికారులు తొక్కిపట్టారు. ఆ వచ్చే డబ్బు కన్నబిడ్డల భవిష్యత్తుకు కొంతైనా భరోసా ఇస్తుందని, తమపై దయతలచాలని వేడుకుంటున్న బాధితులను వంకర మాటలతో అవహాళన చేస్తున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా, స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ వాపోయారు. మీ ఆయన వ్యవసాయం చేసేందుకు తెచ్చిన అప్పుల కారణంగానే చనిపోయాడని రుజువేంటంటూ ఓ వ్యవసాయ అధికారి  చులకనగా మాట్లాడారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక రైతు భార్య విలపించారు. అనంతపురం జిల్లాకు చెందిన జయప్ప అనే రైతు టమాటా సాగుతో రూ.8 లక్షలు అప్పుచేసి తీర్చలేక.. పొలంలోనే బలవన్మరణం చెందారు. తన ఇద్దరు చిన్న పిల్లలను రూ.3000 వితంతు పింఛన్‌తోనే బతికిస్తున్నానంటూ రైతు భార్య శిరీష కన్నీరు పెట్టుకున్నారు.

శ్మశానంలోనే తనువు చాలించారు

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన నంద్యాల గురవయ్య(62) కౌలు రైతు. భార్య దాసమ్మతో కలిసి పంటలు సాగు చేస్తున్నారు. తమ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. మూడేళ్లుగా పంటలు పండకపోవడంతో అప్పులు అధికమయ్యాయి. అవి రూ.8 లక్షలకు చేరుకున్నాయి. ఊళ్లోనే రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చారు. వాటిని తీర్చే దారి కనిపించక... ఫిబ్రవరి 6న శ్మశానంలోనే    పురుగుల మందు తాగి, ప్రాణాలు వదిలారు. పోలీసులు, వీఆర్‌వో సైతం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు. గురవయ్యకు కౌలుకార్డు లేదని, దీన్ని సాకుగా చూపి, పరిహారాన్ని ఆపొద్దని ఆయన భార్య అధికారులను వేడుకుంటున్నారు.


ఇదీ... అధికారులు చేయాల్సింది

ఆత్మహత్యలధిత రైతు కుటుంబాలకు సత్వరమే భరోసా ఇస్తామంటూ 2019 అక్టోబరు 14న జగన్‌ ప్రభుత్వం జీవో43 తీసుకొచ్చింది. దాని ప్రకారం... బాధిత కుటుంబాన్ని కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే పరామర్శించి, వారికి ధైర్యాన్నివ్వాలి. అదే రోజు వీఆర్వో సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి రైతు కుటుంబ వివరాలను సేకరించాలి.

  •  మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి 24 గంటల్లోపు    డివిజన్‌ స్థాయి కమిటీకి ప్రాథమిక నివేదిక అందజేయాలి.
  •  రైతు ఇల్లు/పొలం పరిధి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, అప్పుల వివరాలను సేకరించి, వాటిని నిర్ధారించుకోవాలి. జాయింట్‌ కలెక్టర్‌/వ్యవసాయ శాఖ జేడీ నివేదిక రూపొందించాలి.
  •  డివిజన్‌ స్థాయి త్రిసభ్య కమిటీ ఏడు రోజుల్లోగా   పరిశీలనను పూర్తి చేసి, బాధిత కుటుంబం ప్రభుత్వ     పరిహారం పొందేలా ఆఖరి సిఫార్సు చేయాలి.
  •  తుది నివేదిక పూర్తయ్యాక రూ.7లక్షలు బాధితులకు అందించేలా వ్యవసాయశాఖ కమిషనర్‌/డైరెక్టర్‌కు జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదన చేయాలి.

పరామర్శ లేదు.. సాయం చేయలేదు!

  •  రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్‌, ఎమ్మెల్యే పరామర్శించడంలేదు.  వారింటికి క్షేత్రస్థాయి అధికారులు వెళ్లడంలేదు.
  •  మండల, డివిజన్‌ స్థాయి త్రిసభ్య కమిటీల్లో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల వద్ద దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.
  •  అధికార పార్టీ నేతల సిఫార్సులతోనే త్రిసభ్య కమిటీలు తమ నివేదికలను రూపొందిస్తున్నాయి.
  •  కమిటీలు... పార్టీలు, కులం, ప్రాంతాల ప్రభావానికి గురవుతూ పరిహారానికి సిఫార్సు చేస్తున్నాయి.
  •  2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన దరఖాస్తుల ఆలస్యానికి కారణాలు చూపుతూ వ్యవసాయ శాఖ కమిషనర్‌  జస్టిఫికేషన్‌ రిపోర్టులు కావాలంటున్నారు.
  •  బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా యంత్రాంగం స్పందించడం లేదు.
  •  కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో నివేదికల తయారీ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు.

రెండేళ్లుగా తిప్పుకొంటున్నారు...!

గుంటూరు జిల్లాకు చెందిన పులి వెంకటరెడ్డి, సుబ్బరత్తమ్మలు...  బతుకుదెరువు కోసం ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ శివారు శివరాజ్‌నగర్‌కు వచ్చారు. వారికి శ్రీనివాసరెడ్డి(6 తరగతి), నాగేందర్‌రెడ్డి(4వ తరగతి) అనే ఇద్దరు పిల్లలు. పదేళ్లుగా పొలాలను కౌలుకు తీసుకుని, వ్యవసాయం చేస్తున్నారు. చందలూరు వద్ద ఐదెకరాల్లో మిరప, దర్శి ప్రాంతంలో 10 ఎకరాల్లో వరి వేశారు. ఎప్పుడూ నష్టాలే వచ్చాయి. అప్పులు రూ.12 లక్షలకు పెరిగాయి. వాటిని తట్టుకోలేక వెంకటరెడ్డి 2020 అక్టోబరు 1న పురుగుల మందు తాగారు. ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.3 లక్షల ఖర్చుతో 12 రోజులపాటు వైద్యం అందించారు. ఆరోగ్యం విషమించటంతో గుంటూరు  ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే నెల 15న మరణించారు. మొత్తం రూ.15 లక్షల భారం ఆయన భార్య నెత్తిన పడింది. రైతు ఆత్మహత్య కింద పరిహారం పొందేందుకు రెండేళ్లుగా ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడేమో ఫైల్‌ పోయిందంటున్నారని, 7రోజుల్లోనే డబ్బులొస్తాయని చెప్పి... రెండేళ్లుగా తిప్పించుకుంటున్నారని వాపోయారు. బిడ్డల కోసం సుబ్బరత్తమ్మ కూలీ పనులకు వెళ్తున్నారు.


రెండు నెలలైనా నివేదిక కదల్లేదు!

ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు సమీపంలోని చౌటపల్లికి చెందిన గురజాల శ్రీనివాసరావు, సామ్రాజ్యం దంపతులకు చైతన్య, ప్రవల్లిక పిల్లలు. వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ కుటుంబానికి 13 ఎకరాల సొంత పొలముంది. మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న, కంది, పత్తి, మిరప సాగు చేసేవారు. 2021లో తెగుళ్లు, తుపాన్లతో తీవ్ర నష్టం వచ్చింది. బ్యాంకులో తీసుకున్న రూ.25 లక్షల రుణం, బయట తెచ్చిన అప్పులతో మొత్తం రూ.కోటిన్నరకు చేరింది. గొప్పగా బతికిన చోట తలెత్తుకోలేననే బాధతో శ్రీనివాసరావు ఈ ఏడాది జనవరి 15న పురుగుమందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయారు. వ్యవసాయ శాఖకు అన్ని వివరాలను సమర్పించి రెండు  నెలలైనా నివేదిక ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదని ఆయన కుమారుడు చైతన్య వాపోతున్నారు.


స్పందించని మండలస్థాయి త్రిసభ్య కమిటీ

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్లంపల్లి కోటయ్య, త్రివేణి దంపతులకు సేద్యమంటే ప్రాణం. సొంత పొలం లేకున్నా... కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వారికి బాలకృష్ణ(9వ తరగతి), సాత్విక(5వ తరగతి) సంతానం. నాలుగేళ్లుగా ఐదెకరాల్లో పత్తి, మిరప సాగు చేస్తున్నారు. ఏనాడూ దిగుబడులు సరిగా రాలేదు. అప్పులు, వడ్డీలు కలిపి రూ.10 లక్షలకు చేరడంతో తీర్చలేననే భయంతో ఈ ఏడాది జనవరి 28న పురుగుల మందు తాగారు. రెండ్రోజులు మృత్యువుతో పోరాడి మరణించారు. కళ్లెదుటే పచ్చటి సంసారం కుప్పకూలడంతో త్రివేణి హతాశురాలైంది. మానసికంగా కుంగిపోయిన కొడుకు బడికి వెళ్లడం లేదు. రైతు ప్రాణపదంగా పెంచుకున్న ఎడ్లను పోషించలేక అమ్మేశారు. ఏడు రోజుల్లోనే నివేదిక పంపాల్సిన మండల త్రిసభ్య కమిటీ బాధితులకు న్యాయం చేయలేకపోయింది. తహసీల్దార్‌ నుంచి నివేదిక రాలేదని, తామేం చేయలేమంటూ ఆర్డీవో కార్యాలయం చేతులెత్తేసింది.

 ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని