అర్చకులకు జగన్‌ శఠగోపం!

వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్‌ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Published : 22 Apr 2024 06:02 IST

మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకు లభించని మోక్షం
పెరగని ధూప, దీప నైవేద్యాలు, వేతనాల భృతి
ఇళ్ల స్థలాల మంజూరుపైనా కరుణ చూపని సర్కారు
దాడులు చేసి అవమానించిన అధికార పార్టీ నేతలు
వైకాపా పాలనలో పూజారులకు అష్టకష్టాలు
ఈనాడు, అమరావతి

వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్‌ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్చకులు కళ్లలో ‘ఒత్తులు’ పెట్టుకుని చూసినా.. ఐదేళ్ల ‘పుణ్యకాలం’ గడిచిపోయినా.. ఆ హామీలకు ‘మోక్షం’ లభించలేదు. స్థలాలు అందిస్తాం.. ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన వాగ్దానంపైనా ‘కరుణాకటాక్షం’ చూపలేదు. వెరసి.. జగన్‌ ఇచ్చిన హామీలు ‘దేవతా’వస్త్రాలే అయ్యాయి. మాటలు ఉత్తరకుమార ప్రగల్భాలుగానే మిగిలాయి


మా మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఒక ఖురాన్‌, ఒక బైబిల్‌, ఒక భగవద్గీతలా భావిస్తున్నాం. ఈ మ్యానిఫెస్టో మా వెబ్‌సైట్‌తో సహా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రభుత్వ అధికారి వద్ద ఉంది.  మా పార్టీ కార్యకర్త వద్ద కూడా అందుబాటులో ఉంది. ఇందులో పేర్కొన్న ప్రతి లైన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేశాం.

వైకాపా 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అమలుపై సీఎం జగన్‌ ఇటీవల వ్యాఖ్యలివి..


మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆయన ఊదరగొడుతున్నారు. కొన్ని హామీలను అస్సలు అమలుచేయకుండా, మరికొన్నింటిని అరకొరగా అమలుచేసి.. 99 శాతం నెరవేర్చామంటూ అబద్ధాలు వల్లెవేస్తున్నారు. గత మ్యానిఫెస్టోలో అర్చకులకు ఇచ్చిన హామీలే ఇందుకు నిదర్శనం.

అధికారంలోకి రాగానే అర్చకుల వేతనాలను రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు ఇస్తామంటూ గత ఎన్నికలకు ముందు జగన్‌ ఎంతో గొప్పగా హామీ ఇచ్చారు. అధికార పీఠం చేజిక్కించుకున్నాక దాని ఊసెత్తకుండా దగా చేశారు. వారికి ఇచ్చిన ఇతర   వాగ్దానాలను కూడా నెరవేర్చకుండా ‘మమ’ అనిపించారు. అర్చకులను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవప్రదంగా చూస్తారు. అలాంటి వారిని జగన్‌ నేతృత్వంలోని వైకాపా నేతలు, కార్యకర్తలు ఎంతగానో అవమానపరిచారు. వారిపై ఎడాపెడా దాడులకు తెగబడ్డారు. వాతలు పడేలా చెర్నాకోలాతో కొట్టారు. వారు ధరించే జంధ్యాన్ని సైతం తెంచేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ వ్యవహరించని రీతిలో వైకాపా సర్కారు ఇలా.. వారిపై ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది.


‘వరం’ ఇచ్చినా.. ఫలం ఇవ్వలే..

ఆదాయంలేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ఎంతోకాలంగా ధూప, దీప నైవేద్య పథకం (డీడీఎన్‌ఎస్‌) అమలవుతోంది. ఆలయ అర్చకుని ఖాతాలో ప్రతినెలా రూ.5 వేలు జమ అవుతుండగా.. అందులో రూ.2 వేలను ధూప, దీప, నైవేద్యాలకు ఖర్చుచేయాలి. మిగిలిన రూ.3 వేలను అర్చకుడు భృతిగా తీసుకుంటారు. 2010లో ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే.. అప్పటికీ, ఇప్పటికీ నిత్యావసర సరకుల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ     జనాభాను బట్టి అర్చకులకు వేతనాల కింద రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు ఇస్తామని జగన్‌ 2019 వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. జగన్‌ హామీలను అర్చకులు నిజమేనని భ్రమపడ్డారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి అయిదేళ్లు అయి ‘పుణ్య’కాలం గడిచిపోయినా ఆ ‘వరం’ కార్యరూపం దాల్చలేదు. వారి వేతనాలను పెంచడం దేవుడెరుగు.. ధరలు పెరిగిన దృష్ట్యా కనీసం ధూప, దీప నైైవేద్యాలకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, ఇతర సంస్థలకు వచ్చే రాబడిలో ఏటా 9 శాతాన్ని దేవాదాయ శాఖ.. సర్వ శ్రేయో నిధిగా వసూలు చేస్తుంది. అందులో నుంచే డీడీఎన్‌ఎస్‌కు చెల్లిస్తారు. ఇలా 5,338 ఆలయాల అర్చకులకు ప్రతినెలా రూ.5 వేల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. అందులో రూ.2 వేలు ధూప, దీప నైవేద్యాలకు పోను మిగిలిన రూ.3 వేలతో అర్చకులు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో జగనే చెప్పాలి.


2,551 దరఖాస్తుల్లో.. 288 మందికే ఇళ్ల స్థలాలు

అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ జగన్‌ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఇంతకాలం దీని గురించి పట్టించుకోని జగన్‌.. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ అంశంపై హడావుడి చేశారు. ఈ ఇళ్ల స్థలాల కోసం 2,551 మంది అర్చకులు దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనలను సాకుగా చూపిన అధికారులు.. దరఖాస్తుదారుల్లో 1,459 మందికి మాత్రమే స్థలాలు పొందే అర్హత ఉందని తేల్చారు. వారిలోనూ 151 మందికే జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 137 మందికి వారు అర్చకులుగా కొనసాగుతున్న ఆలయాలకు చెందిన భూముల్లో కేటాయించారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేవలం 288 మందికే స్థలాలు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు వచ్చే రాబడి నుంచి ఏటా 3 శాతాన్ని అర్చక సంక్షేమ నిధి కింద జమచేస్తారు. ఈ నిధి నుంచి 460 మంది అర్చకులకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించారు.


మార్గదర్శకాలు లేక నిలిచిన పదోన్నతులు

ఆలయాల్లో అర్చకులకు పదవీ విరమణ విధానం తొలగిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్‌.. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా దాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. గతంలో అర్చకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉండేది. ఆ అర్చకుడు పదవీ విరమణ పొందితే తర్వాతి స్థానంలో ఉండే అర్చకులకు పదోన్నతి దక్కేది. ప్రస్తుతం వైకాపా సర్కారు పదవీ విరమణ విధానాన్ని తొలగించడంతో ఈ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ‘తాను ఇక పనిచేయలేను’ అని చెప్పేంతవరకు ఆయనే అర్చకుడిగా కొనసాగుతారు. నిర్దిష్ట గడువులోపు పదవీ విరమణ లేకపోవడంతో కొత్తగా అర్చకులుగా కొనసాగాలనుకునేవారు అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దేవాదాయ శాఖ నిర్వహించే అర్చక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే అర్చకులుగా నియమిస్తారు. తర్వాత దశల వారీగా నిర్వహించే పరీక్షల్లో అర్చకులు.. ముఖ్య, ఉప ప్రధాన అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా పదోన్నతి పొందుతారు. ఇప్పటికే ఎందరో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై అర్చక, ముఖ్య, ఉప ప్రధాన అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా నియమితులయ్యేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పదవీ విరమణ విషయమై స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని