అవినీతి ‘వర్ధనం’!

ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి.. ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి.. వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి.. గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి.

Published : 22 Apr 2024 06:02 IST

వైకాపా ప్రజాప్రతినిధి భూదందాకు అధికారుల చెంచాగిరీ
అత్తగారి ఊళ్లోనూ అక్రమాల బాగోతం
గుత్తేదారు కమీషన్‌ ఇవ్వలేదని కాల్వ పనులనూ నిలిపి వేయించిన దాష్టీకం
నెల్లూరు జిల్లాలో ఓ కీలక నాయకుడి తీరు
ఈనాడు, అమరావతి

ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి..
ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి..
వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి..
గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి..
సర్కారులో పెద్ద పదవి వచ్చీ రావడంతోనే.. కోర్టులో ఆయన కేసుకు సంబంధించిన ఫైళ్లూ మాయమయ్యాయి..
భారీ వాహనాల నుంచి వసూళ్లు.. సర్కారు భూములపై కన్నేసి అనుచరులకు మేళ్లు..
మద్యం రాబడితో ప్యాలెస్‌ను తలదన్నేలా ఇల్లు..
ఆయన అవినీతి, అక్రమాలు తెలిసిన వారంతా వెళ్లబెడుతున్నారు నోళ్లు!

అవినీతి, అక్రమాల్లో ‘కాక’లు తీరిన నాయకుడాయన. తన పేరులో ఉన్న ‘కొండ’ంత స్థాయిలో అరాచకాలను సాగిస్తూ సార్థక నామధేయుడిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అధికార వైకాపాకు చెందిన ఈ సీనియర్‌ ప్రజాప్రతినిధి రాష్ట్రస్థాయిలో ఉన్నత హోదాను వెలగబెడుతున్నారు. జిల్లాలో ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది పదేళ్ల కిందటి నకిలీ మద్యం అక్రమ రవాణా, పంపిణీ వ్యవహారం. క్వార్ట్జ్‌, మట్టి, గ్రావెల్‌, ఇసుక.. ఇలా సహజ వనరుల దోపిడీతో దండుకుంటున్నారీ నేత. నియోకజవర్గ పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు ఎక్కడ లేఅవుట్లు వేసినా  ఎకరాకు కొంత చొప్పున ఈ నేతకు కప్పం కట్టాల్సిందే.

అంతర్జాతీయ స్మగ్లర్‌తో కలిసి..

2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తాను ఉంటున్న నియోజకవర్గంలో ఓటర్లకు పంచి పెట్టించారీ నేత. ఆ కల్తీ మద్యం తాగి కొందరు ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అందుకు కారణమైన ఈ నేతపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇందులో అంతర్జాతీయ స్మగ్లర్‌ ప్రమేయమూ ఉండటం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయంతో నెల్లూరు నగరంలోని తన పాత నివాసం పక్కనే అధునాతన హంగులతో రూ.కోట్లు వెచ్చించి భారీ భవనం నిర్మించారని ప్రతిపక్ష నేతలు   విమర్శిస్తున్నారు. అందుకే ఆ నివాసాన్ని వ్యంగ్యంగా  ‘రా...ప్యాలెస్‌’ అని పిలుస్తుంటారు. విచిత్రమేంటంటే.. వైకాపా నేతలూ అదే పేరుతో పిలుస్తుండడం గమనార్హం.

తవ్వుకో.. అమ్ముకో..

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నియోజకవర్గ పరిధిలో రూ.వందల కోట్ల విలువైన క్వార్ట్జ్‌, మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలను కొల్లగొట్టారు. ఈ ప్రజాప్రతినిధి అండతో అనుచరులే ఈ దందాను సాగిస్తున్నారనేది   బహిరంగ రహస్యం. ఇందులో ఈ నేతకు నేరుగా ముడుపులు అందుతున్నాయి. పక్క జిల్లాలో ఎంపీగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడికి తెలియకుండానే.. ఆయన పేరుతో అనుమతులు తీసుకుని సర్వేపల్లి రిజర్వాయరు నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలించారు. దీనిపై కొందరు  లోకాయుక్తాకు ఫిర్యాదు చేయగా.. విచారణ కొనసాగుతోంది. కనుపూరు చెరువు,    ఈదగాలి, కంటేపల్లి, రామదాసుకండ్రిగ, మహ్మదాపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో భారీగా గ్రావెల్‌ తవ్వేశారు. ఈ తవ్వకాలపై ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయటంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.

అడ్డంగా దోచేశారు..

ఈ ప్రజాప్రతినిధి సొంత మండలంలోని ఒక ‘గిరి’ కొండకు ఎంతో విశిష్టత ఉంది. గతంలో ఈ నేత ఆ కొండపైకి వెళ్లి ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఈ కొండను ఎవరినీ తాకనివ్వను’ అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడే ఆయన తెలివిని ప్రదర్శించారు. తాను ఎక్కిన కొండను మాత్రం  వదిలేసి.. దాని చుట్టూ ఉన్న గుట్టలను అనుచరుల సాయంతో కొల్లగొట్టేశారు. ఇదే మండలంలోని రీచ్‌లో అనుమతులు లేకుండానే భారీగా ఇసుకను అక్రమ రవాణా  చేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు.

కమీషన్‌ ఇవ్వలేదని..

నియోజకవర్గంలోని రెండు మండలాలకు ఉపయుక్తమైన ఒక కాలువను తెదేపా హయాంలో మంజూరు చేసి పనులు ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక, తనకు కమీషన్‌ ఇవ్వలేదని గుత్తేదారును బెదిరించి పనులను నిలిపివేయించారు. ఒక మండలంలో తెదేపా హయాంలో రూ.4.5 కోట్లతో భారీ శుద్ధ జల ప్లాంటు ఏర్పాటు చేయగా.. వైకాపా అధికారంలోకి రావడంతోనే అక్కసుతో దాన్ని నిలిపివేయించారు. కనుపూరు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్‌, మట్టి తవ్వేసి.. నెల్లూరులోని ప్రైవేటు లేఅవుట్లకు, ఈ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ప్లాట్లకు, పొలాలకు తరలించారని స్థానికులే చెబుతున్నారు. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు, ఆయకట్టు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో లోకాయుక్తా దృష్టికి తీసుకెళ్లారు. కోడూరు, పిడతాపోలూరు, వల్లూరు చెరువుల నుంచీ భారీగా మట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు.


అనధికార టోల్‌

ముత్తుకూరు-వెంకటాచలం మండలాల సరిహద్దులో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై అనధికారికంగా టోల్‌ ఏర్పాటు చేయించారీ ప్రజాప్రతినిధి. ఆ మార్గంలో రాకపోకలు సాగించే భారీ వాహనాల నుంచి వసూళ్లు చేయడం ప్రారంభించారు. ముత్తుకూరు మండలంలోని థర్మల్‌ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదనూ వదల్లేదు. కరోనా సమయంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకంటూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.

కరోనా కాలంలో..

ఆ ప్రాంతంలో 850 కేజీల ధాన్యాన్ని ఒక పుట్టిగా వ్యవహరిస్తుంటారు. కరోనా సమయంలో ఇక్కడి వైకాపా నాయకులు దళారుల అవతారమెత్తి, రైతుల నుంచి పుట్టికి వెయ్యి కేజీలకుపైగా ధాన్యాన్ని బలవంతంగా తీసుకున్నారు. మరోవైపు పంటకాల్వల్లో పూడికతీత, ఇతర పనులు చేయకుండానే బిల్లులు మింగేశారు. కనుపూరు కాల్వ పనులు, మంజూరైన నిధుల వివరాలను స.హ. చట్టం కింద అడిగినా అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం.

కోర్టులోని ఫైళ్లు మాయం

వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ ప్రజాప్రతినిధిపై   అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు విదేశాల్లో ఆస్తులున్నాయనీ, అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయంటూ కొన్ని డాక్యుమెంట్లనూ మీడియాకు విడుదల చేశారు. అవన్నీ అబద్ధాలనీ, నకిలీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశారని ఆయన కేసు కూడా పెట్టారు. దాదాపు రెండేళ్ల కిందట ఈ ప్రజాప్రతినిధికి రాష్ట్రస్థాయిలో పదవి దక్కిన రెండు మూడు రోజులకే నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు అపహరణకు గురయ్యాయన్న వార్తలూ వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేపట్టింది.


అత్తగారి సొమ్ములా భూముల ఆక్రమణ

నెల్లూరు గ్రామీణ మండలంలోని అత్తగారి ఊరిలోనూ ఈ ప్రజాప్రతినిధి తన పనితనాన్ని చూపించారు. ఆ గ్రామంలో ఆయనకు కొంత భూమిని అత్తింటివాళ్లు ఇచ్చారు. దానికి ఆనుకుని ఉన్న దళితుల భూములను తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఈ ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణ నిజమేనని తేల్చి, ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించారు. అత్తగారిచ్చిన స్థలానికి మరో వైపున్న విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాలనూ ఆయన ఆక్రమించారని ఆయా ప్లాట్ల యజమానులు కేసు పెట్టారు. ప్రభుత్వ, చెరువు భూములనూ అనుచరుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంద ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇక్కడో తహసీల్దారు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాకుటూరు పంచాయతీ పరిధిలో జాతీయ  రహదారిని ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన సర్కారు భూములను, ఈ నేత ప్రైవేటు వాటిగా రికార్డులు మార్పించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆయన  అనుచరుడితోపాటు మరికొందరిపై అధికారులు కేసు నమోదు చేసి, జైలుకు పంపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని