పురోహితుడిపై ఆకతాయిల వికృత చేష్టలు

పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడితో ఆ కార్యక్రమంలోనే పాల్గొన్న కొందరు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Published : 22 Apr 2024 05:24 IST

పెళ్లి జరిపిస్తుండగా ఆయన తలకు సంచి తగిలించి పైశాచికానందం
బ్రాహ్మణ, హిందూ సంఘాల ఆగ్రహం

కొత్తపల్లి, పిఠాపురం - న్యూస్‌టుడే: పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడితో ఆ కార్యక్రమంలోనే పాల్గొన్న కొందరు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మూలపేటకు చెందిన ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ ఈ నెల 12న స్థానికంగా ఓ వివాహ క్రతువు జరిపించేందుకు వెళ్లారు. కార్యక్రమం జరిపిస్తుండగా కొందరు ఆకతాయిలు ఆయన తలకు సంచి తగిలించి ఎగతాళి చేశారు. అక్కడితో ఆగకుండా పసుపు, కుంకుమ, నీళ్ల ప్యాకెట్లను ఆయనపై విసురుతూ అమానవీయంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. బ్రాహ్మణ, హిందూ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమయింది. కాకినాడ, పిఠాపురం, బిక్కవోలు ప్రాంతాల్లో బ్రాహ్మణులపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆయా సంఘాల వారు విమర్శలు గుప్పించారు. సోమవారం సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ ఆదివారం క్షేత్రస్థాయిలో విచారించి పురోహితుడి నుంచి రాతపూర్వక ఫిర్యాదు కోరారు. వివాహం జరిగిన ఇంటికి వెళ్లి ఘటనపై ఆరాతీశారు.

బ్రాహ్మణ ఎట్రాసిటీ చట్టం తేవాలి

బ్రాహ్మణులపై దాడులు ఆపకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీహెచ్‌వీ సాంబశివరావు, కామర్స్‌ చిరంజీవి, పి.సోమసుందర్‌, వడ్డాది గోపికృష్ణ, కె.హనుమంతరావు, జొన్నలగడ్డ కామేష్‌ హెచ్చరించారు. బ్రాహ్మణ ఎట్రాసిటీ చట్టం తేవాలని వారు డిమాండ్‌ చేశారు. పురోహితుడిపై అమానవీయంగా ప్రవర్తించడం మానవ హక్కుల ఉల్లంఘనేనని బాధ్యులతో పాటు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వారిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. బ్రాహ్మణుల రక్షణకు హామీ ఇచ్చే పార్టీలు, అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని