వెయ్యి పెంచి.. లక్షలు ముంచి

అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం... మాట తప్పడు అంటే మురిసిపోయాం... అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే..మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం.

Published : 22 Apr 2024 05:26 IST

అంగన్‌వాడీలకు జగన్‌ వెన్నుపోటు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ గాలికి
వేతనం పెంపు వేలల్లో.. దోపిడి లక్షల్లో
ఒంటరి, వితంతు, దివ్యాంగుల పింఛన్లూ దూరం
ఐదేళ్లలో అష్టకష్టాలు పడ్డ అంగన్‌వాడీలు
తెదేపా ప్రభుత్వం రూ.6,300 చొప్పున పెంచినా పథకాలను దూరం చేయలేదు
ఈనాడు, అమరావతి

అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం...
మాట తప్పడు అంటే మురిసిపోయాం...
అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే..
మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం..
కానీ ఈతాకు ఇచ్చి... తాటాకు తీసుకున్నట్లు.. మా సంక్షేమాలను రద్దు చేశావు..
వేతనాలు పెంచాలన్న మా వేదనలను వెక్కిరిస్తూ.. మా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపావ్‌!
ఇదీ.. ఆంధ్రాలోని అంగన్‌వాడీల ఆవేదన.. ఆక్రందన!

పాలన అంటే సచ్ఛీలత. చేసే పని..చెప్పే మాట నిక్కచ్చిగా ఉండాలి. ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. కానీ ముఖ్యమంత్రి జగన్‌లో ఇవి ఇసుమంతైనా కనిపించవు. ఆయనలో కనిపించేదంతా జిత్తులమారి తనమే. అడుగడుగునా కుయుక్తి పన్నడమే. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏ వర్గానికైనా సరే ఐదేళ్ల పాలనలో ఆయన చేసిందిదే. అక్క చెల్లెమ్మలంటూనే అంగన్‌వాడీలను ఇదే తరహా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో కంటే వేతనాలు పెంచి అమలు చేస్తామని గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలవగానే ఆయన తీరు ‘బోడి మల్లయ్య’ చందంగా మారింది. అంగన్‌వాడీల వేతనం రూ.1000 పెంచి.. దానికి మించి వారికి అందే సంక్షేమ పథకాలల్లో కోత విధించారు.


నవరత్నాలు - అందని ద్రాక్షలు

రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 1.03 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలున్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. జగన్‌ వచ్చాక వీరికి వేతనాన్ని రూ.వెయ్యి పెంచారు. అంగన్‌వాడీలు సంబరపడ్డారు. కానీ ఆ పెంపు వెనక... ముప్పును వారు ఊహించలేకపోయారు. ఇటు వేతనం పెంచుతూనే... అటు సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలుపై జగన్‌ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిలో కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదనేది ఒకటి! ఈ ఆదాయపరిమితి అస్త్రాన్ని అంగన్‌వాడీలపై ప్రయోగించారు. వేతనం రూ.10 వేలకు మించిందంటూ గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీల సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. అప్పటికిగాని అంగన్‌వాడీలకు జగన్మాయ అర్థం కాలేదు.


తెదేపా హయాంలో 150% మేర పెంపు...

2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను విభజన కష్టాలు వెంటాడుతున్నా... అంగన్‌వాడీలకు అప్పటి తెదేపా ప్రభుత్వం వేతనాల పెంపులో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం, పేదల సంక్షేమాన్ని చూస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఐదేళ్ల పాలనలో తెదేపా అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.10,500కి పెంచింది. రెండు విడతల్లో వీరికి 150%(6,300) మేర పెంచి వేతనాన్ని తెలంగాణతో సమం చేసింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు 103%, ఆయాలకు 172% పెంచింది. అప్పటి నిబంధనల ప్రకారం వారి వేతనం ఆదాయ పరిమితిని దాటి సంక్షేమ పథకాల లబ్ధి దూరమయ్యే అవకాశం ఉన్నా కోత మాత్రం విధించలేదు. వెసులుబాటు ఇచ్చి అన్ని పథకాలను వారికి వర్తింపచేసింది.

జగన్‌ పెంచింది 9.5 శాతమే..

జగన్‌ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనం రూ.10,500 నుంచి రూ.11,500 పెంచారు. ఏతావాతా ఆయన పెంచింది 9.5 శాతమే. అది కూడా 2019 జూన్‌లో పెంచారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఓవైపు సంక్షేమ పథకాలు అందక.. మరోవైపు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు 100 శాతం పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం 2021లో అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.3,150 చొప్పున వేతనం పెంచింది. ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తామన్న జగన్‌ మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. చివరికి హామీని నెరవేర్చాలంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టినా..కనీసం వారి మాట కూడా ఆలకించలేదు. పోలీసులతో ఉక్కుపాదం మోపించారు. వారికి వర్తించని ఎస్మాను కూడా ప్రయోగించి బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలను తొలగిస్తామని మెడ మీద కత్తిపెట్టినట్లుగా దారుణంగా వ్యవహరించారు.

అంగన్‌వాడీ పోస్టా? సంక్షేమ పథకాలా?

అంగన్‌వాడీల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన జగన్‌ ప్రభుత్వం.. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు కూడా నిలిపి వేసింది. అమ్మఒడి సాయాన్ని అందించకుండా వారి పిల్లల చదువులకు ఇబ్బందిపెట్టింది. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణ రాయితీ ఎత్తేసింది. వారు పదవీ విరమణ పొందే వరకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆదేశించింది. అంటే అంగన్‌వాడీ పోస్టు కావాలా? సంక్షేమ పథకాలు కావాలా? అనే పరిస్థితిని వారికి కల్పించింది.


రూ.12వేలిచ్చి...

తెదేపా ప్రభుత్వ హయాంలోనే అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.10,500 వేతనం అందేది. జగన్‌ పెంచింది రూ.1000. ఈ మొత్తాన్ని ఏడాదికి లెక్కేస్తే వారికి అదనంగా అందేది రూ.12 వేలు. అదే ఒక్క దివ్యాంగ పింఛను(నెలకు రూ.3 వేలు) తీసేయడంతో ఏడాదికి రూ.36 వేలు నష్టపోయారు. ఇంటి నిర్మాణ రాయితీ వర్తించక రూ.1.50 లక్షలు అందలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో కోల్పోయారు. ఇక విద్యాదీవెన, వసతి దీవెన అందక పిల్లల భవిష్యత్తే ఇబ్బందుల్లో పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని