వైకాపా అవినీతి ‘పురం’పర!

వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు.

Updated : 22 Apr 2024 06:43 IST

పట్టణ స్థానిక సంస్థల్లో జగన్‌ అనుచరుల దోపిడీ
అక్రమ వసూళ్లతో అవినీతి కూపాలుగా పురపాలికలు
ఈనాడు, అమరావతి

వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు. నగరాలూ, పురపాలికల ఆధ్వర్యంలోని దుకాణాలు, కల్యాణ మండపాలు, మార్కెట్ల.. అద్దెలూ, లీజుల పునరుద్ధరణ, కొత్త కేటాయింపుల్ని ఆదాయ వనరులుగా మలుచుకుని.. తమ జేబుల్ని నింపుకొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందక.. ఇప్పటికే పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడింది. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్టుగా.. స్థానికంగా వచ్చే కొద్దిపాటి ఆదాయాన్నీ పురపాలికలకు అందకుండా.. దోచుకుంటున్నారు వైకాపా నాయకులు. ‘పట్టణ స్థానిక సంస్థల్లో అవినీతి పోవాలి. నీతివంతమైన పాలన అందించాలి. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించాలి..’ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో పురపాలక సంస్థలపై నిర్వహించిన సమీక్షలో జగన్‌ వల్లించిన పాలనా సూక్తులు ఇవి. కానీ వాస్తవంలో ఆయన ప్రభుత్వ పనితీరు మొదటిరోజు నుంచీ.. ‘దోచుకోవడం, దాచుకోవడం’లా సాగింది. వైకాపా నేతలు కూడా తమ ముఖ్య నేత స్ఫూర్తితో రెచ్చిపోయారు. ఇసుకనుంచీ తైలం తీయవచ్చన్నట్లు... ప్రతి పనిలోనూ వసూళ్లకు బరి తెగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ వైకాపా పాలనలోనే ఉన్నాయి. ఆ పార్టీ మేయర్లు, ఛైర్మన్ల నుంచి కార్పొరేటర్‌, కౌన్సిలర్ల వరకు అత్యధిక చోట్ల పట్టణ స్థానిక సంస్థలను అవినీతి కూపాలుగా మార్చేశారు. వీరేం చేసినా అధికారులు ‘జీ హుజూర్‌’ అనాల్సిందే. మొదట్లో సూక్తి ముక్తావళి వినిపించిన సీఎం జగన్‌కు ప్రస్తుతం ఈ అవినీతి అస్సలు కనిపించడం లేదు. అక్రమ వసూళ్లపై ప్రజలు పెడుతున్న గగ్గోలు వినిపించడం లేదు.


సీమలో అవినీతి ‘గేట్లు’ తెరిచారు..

తిరుపతి నగరపాలక సంస్థ ఆదాయానికి వైకాపా నేతలు భారీగా గండి కొడుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ మార్కెట్‌లో గేట్ల(ఆసీళ్లు) కాంట్రాక్టు తీసుకుని.. నగరంలో ఇతర చోట్లా చిరు వ్యాపారులు, రైతులు, వాహనదారుల నుంచి ముక్కుపిండి గేట్లు రాబడుతున్నారు. నగరపాలక సంస్థకు ఏడాదికి కట్టేది రూ.2.3 కోట్లయితే... దానికి రెండింతలు లాగించేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఆదోని జేఎల్‌బీ మార్కెట్‌లో గేటు వసూళ్ల కాంట్రాక్టును వైకాపా నేతలు చేజిక్కించుకుని పురపాలక ఆదాయానికి గండికొట్టేందుకు సిద్ధమయ్యారు. 2024-25 సంవత్సరానికి మార్కెట్‌ వేలం ఈపాటికే నిర్వహించాల్సిన అధికారులు వైకాపా నేతల ఒత్తిడితో జాప్యం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని వేలం నిర్వహించకుండా పాత కాంట్రాక్టర్‌తో నెలకు రూ.6.25 లక్షలు చొప్పున కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. వేలం నిర్వహిస్తే రూ.10 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది.


కుప్పంలో రూ. 78 లక్షలు స్వాహా

వైకాపా నేత ఒకరికి కుప్పం పురపాలక సంఘం అధికారులు దాసోహమయ్యారు. సంతలు, మార్కెట్లు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల నుంచి పురపాలక సంఘానికి గేట్లు కింద ఏటా  రూ.90 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది. వ్యాపారుల తరఫున ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు పురపాలికకు గత ఏడాది రూ.12 లక్షలు చెల్లించారు. దాంతో పురపాలక సంఘం రూ.78 లక్షలు నష్టపోయింది.


ఇదో రకమైన దందా...

  • భీమవరం మార్కెట్‌ కూడలి వద్ద పురపాలక వాణిజ్య సముదాయంలో దుకాణాలు తీసుకున్న వైకాపా నేతలు అద్దెలు సరిగా చెల్లించడం లేదు. ఆపై భవనాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కొందరైతే దుకాణాల ముందు వైకాపా జెండాలు పెట్టి అద్దె చెల్ల్లించకుండా ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు.
  • కాకినాడ నగరపాలక సంస్థ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాల్లో బినామీల హవా నడుస్తోంది. తొమ్మిది మున్సిపల్‌ కాంప్లెక్స్‌లలో 186 దుకాణాల నుంచి రూ.2.44 కోట్ల అద్దె బకాయిలు రావాలి. చెల్లించని వారిలో ఎక్కువగా వైకాపా నేతలే ఉన్నారు. గాంధీనగర్‌ కాంప్లెక్స్‌లో దుకాణం అద్దెకు తీసుకున్న వైకాపా నేత ఒకరు ఒప్పందానికి విరుద్ధంగా షాపుని రెండుగా విభజించి అద్దెకు ఇచ్చారు. పాత మున్సిపల్‌ కార్యాలయం కాంప్లెక్స్‌లో వైకాపా నేతలే ఇతురులకి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక వాణిజ్య సముదాయంలో అద్దెకు తీసుకున్న దుకాణాన్ని వైకాపా నేత ఒకరు ప్రభుత్వ మద్యం షాపు నిర్వహణకు ఇచ్చారు. అక్కడ మద్యం షాపు నిర్వహించరాదని పాలకవర్గం తీర్మానం చేసినా బేఖాతర్‌ చేస్తున్నారు.  
  • పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక లాడ్జి భవనంలో దుకాణాలు, గోదాములను వైకాపా నేతలు ఆక్రమించి వాటిని అద్దెలకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. విషయం అధికారులకు తెలిసినా వైకాపా పెద్దల ఒత్తిడితో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నేతల ఆక్రమణలతో పురపాలిక ఆదాయానికి ఏటా రూ.లక్షల్లో గండి పడుతున్న విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళుతున్నా స్పందన లేదు.

గ‘లీజు’ పనులు...!

  • విశాఖలో పూర్ణా మార్కెట్‌ నుంచి నగరపాలక సంస్థకు వెళ్లాల్సిన ఆదాయం కొందరి వైకాపా నేతల జేబుల్లోకి చేరుతోంది. అద్దెల రూపంలో 2022-23లో    రూ.1.10 కోట్ల ఆదాయం రాగా.. 2023-24 నాటికి   అది రూ.90 లక్షలకు తగ్గింది. దుకాణాల అద్దె పెరగకుండా వైకాపా నేతలు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. అధికారులకు విషయం తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.  
  • విజయవాడ నగరపాలక సంస్థలో ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడొకరు హవా చెలాయిస్తున్నారు. కొత్త షాపుల కేటాయింపు, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్ల లీజుల పొడిగింపు, పార్కింగ్‌ స్థలాలు లీజులకు ఇవ్వడం, భవన నిర్మాణాలకు అనుమతులు వంటి అనేక విషయాలు ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. లీజు మొత్తం తగ్గించేందుకు, లీజు కాలాన్ని పొడిగించేందుకు.. ఇలా ప్రతి దానికీ బేరం పెట్టి అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్నారు.
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మార్కెట్ల లీజు వసూళ్ల వేలంలో వైకాపా నేతలే పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్నారు. వీరంతా ఆ పార్టీ నేత ఒకరు చెప్పినట్లుగా వేలం పాట పాడి వీటిని ఇటీవల సొంతం చేసుకున్నారు. వేలంలో ఇతరులు పాల్గొని ఉంటే వారి మధ్య పోటీ పెరిగి పురపాలక సంఘానికి ఆదాయం ఎక్కువగా వచ్చేది.

నగరపాలక ఆదాయం నేతల జేబుల్లోకే...!

  • విశాఖ నగరపాలక సంస్థలో చక్రం తిప్పే వైకాపా నేత, సీనియర్‌ కార్పొరేటర్‌ ఒకరు అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అందిన మేరకు దోచుకుంటున్నారు. తన డివిజన్‌తోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఉన్నారంటే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులూ అనుమతులు తీసుకోని భవన నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. నగరపాలక సంస్థకు కట్టాల్సిన ఫీజుల్ని వైకాపా నాయకుడే తన జేబులో వేసుకుంటున్నారు.
  • తిరుపతి నగరపాలక సంస్థలో వైకాపా యువ నేత ఒకరు సాగిస్తున్న అక్రమ వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. నగరపాలక సంస్థ నుంచి వివిధ పనులకు ఇచ్చే అనుమతుల నుంచి లీజుల వరకు ఆయనదే హవా. అధికారుల పాత్ర నామమాత్రమే. ఆయన నిర్ణయమే శాసనం. ప్రత్యేకించి భవన నిర్మాణ అనుమతులు కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. యువ నేత అవినీతి, అక్రమాలతో నగరపాలక సంస్థ ఆదాయం కోల్పోతున్నా అధికారులకు పట్టదు. ఎందుకంటే అలాంటి అధికారులనే ఆయన ఏరికోరి నియమించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని