నేర చరిత్ర వివరాలేవి?

తన తండ్రి, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి నేర చరిత్రపై వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు.

Published : 22 Apr 2024 05:27 IST

సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిలను ప్రశ్నించిన సునీత

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, వేంపల్లె: తన తండ్రి, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి నేర చరిత్రపై వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు. నేర చరిత్ర గల వ్యక్తులు, హత్యానేరంలో పాలుపంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో ఆదివారం ఆమె పీసీసీ మీడియా సెల్‌ కన్వీనర్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నామినేషన్‌ వేసిన 48 గంటల్లో ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో అభ్యర్థుల నేర చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలనే నిబంధన ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలింగ్‌లోగా మూడుసార్లు ప్రకటన ఇవ్వాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి విషయంలో నిబంధనలు పాటించలేదని, నేర చరిత్ర గల వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో వైకాపా ఓటర్లకు వివరించాల్సి ఉందని తెలిపారు. టికెట్ ఇచ్చిన పార్టీ తమ వెబ్‌సైట్లో కూడా నేర వివరాలు పొందుపర్చాలన్నారు. 40 ఏళ్లుగా పులివెందుల ప్రజలకు వివేకానందరెడ్డి ఎంతో సేవ చేశారని, ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలను గెలిపించాలని కోరారు.

సీఎంకో న్యాయం.. పేదలకో చట్టమా?

‘సీఎం జగన్‌పై గులకరాయి విసిరాడంటూ పిల్లవాడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. పులివెందుల్లో మురార్‌చింత గ్రామంలో ఇటీవల వృద్ధులపై దారుణంగా దాడి చేసిన వైకాపా నేతలపై బెయిలబుల్‌ కేసు పెట్టారు’ అని సునీత ఆరోపించారు. ప్రజలను నిందితులు బెదిరిస్తూ రోడ్లపై తిరుగుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ ఘటనపై తాను స్పందించగా, దాడులకు పాల్పడవద్దని తన అనుయాయులను అవినాష్‌రెడ్డి కోరారని, దాడులు చేస్తే అది షర్మిల, సునీతకు అస్త్రంగా మారుతుందని అంటూ హెచ్చరించినట్లు తెలిపారు. పులివెందులలో ఎక్కడైనా అక్రమాలు, దాడులు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఎవరూ భయపడవద్దని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడానికి ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని