వ్యాపార సంస్థలా.. వైకాపా

వైకాపాలో ఇమడలేక ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ పదవికి అనంత రామకృష్ణప్రసాద్‌ రాజీనామా చేశారు.

Published : 22 Apr 2024 05:27 IST

సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తోంది
బ్రాహ్మణ కోఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ రామకృష్ణప్రసాద్‌ రాజీనామా

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: వైకాపాలో ఇమడలేక ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ పదవికి అనంత రామకృష్ణప్రసాద్‌ రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. తాను రాజశేఖరరెడ్డి అభిమానినని, 2018 నుంచి వైకాపా సోషల్‌ మీడియాలో చురుగ్గా పనిచేస్తున్నానని తెలిపారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డి ఛైర్మన్‌గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమం అంటూ సంక్షోభం సృష్టిస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. ఇసుక, మద్యం వ్యాపారం చేస్తోందన్నారు. వైకాపా ఒక వ్యాపార సంస్థలా మారిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సునామీ లాంటి వార్త వింటారన్నారు. అవినీతిపరులు సామాన్యులను జలగల్లా పీలుస్తున్నారని చెప్పారు. నిజమైన నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని.. రెండు చోట్ల ఓడిపోయినా ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నారని గుర్తుచేశారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. పార్టీ కోసం తన సొంత డబ్బు ఖర్చుచేస్తున్నారని కొనియాడారు. సోమవారం దుర్గమ్మను దర్శించుకుని భవిష్యత్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని