ప్రజాప్రభుత్వం వస్తుంది.. కష్టాలన్నీ తీరతాయి

‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్‌ పనిచేస్తున్నారన్నారు.

Published : 22 Apr 2024 05:28 IST

మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం
ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి

మంగళగిరి, న్యూస్‌టుడే: ‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్‌ పనిచేస్తున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలోని బేతపూడిలో మల్లెపూల తోటల్లో పూలుకోసే మహిళా కూలీలతో ఆమె మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే ‘టాటా తనేరా’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు లోకేశ్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతిని విధ్వంసం చేసి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు.

సమస్యలు తెలిపిన కూలీలు..

పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇంటి పన్నులు, విద్యుత్తు బిల్లులు కట్టలేకపోతున్నామని.. రోజంతా పనిచేసినా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని మహిళా కూలీలు బ్రాహ్మణికి వివరించారు. ఆమె స్పందిస్తూ.. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు.. మీ కష్టాలు తీరుస్తారు’ అని భరోసా ఇచ్చారు. స్త్రీశక్తి కేంద్రాల్లో కుట్టు శిక్షణ తీసుకుని అదనపు ఆదాయం పొందాలని వారికి సూచించారు.


కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛన్‌ తీసేశారు..

గత ప్రభుత్వంలో కందిపప్పు కిలో రూ.70 ఉంటే నేడు రూ.170వరకు పెరిగింది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛన్‌ తీసేశారు. మా కోడలు బీఈడీ చదివినా ఉద్యోగం లేకుండా పోయింది.

దుర్గ


మా పిల్లలకు ఉద్యోగాల్లేవు..

రాజధాని ప్రాంతంలో భూమిలేని వారికి గతంలో ప్రకటించిన పింఛన్లు రెండేళ్లుగా ఇవ్వడం లేదు. అమరావతి పనులను నిలిపివేశారు. మా పిల్లలకు ఉద్యోగాలు లేక కూరగాయలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.

కనకదుర్గ


నాసిరకం బియ్యం ఇస్తున్నారు

రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. వాటిని నానపెడితే నీళ్లలో తేలుతున్నాయి. ప్లాస్టిక్‌ బియ్యం ఏమోనని అనుమానంగా ఉంది. ఇలా అయితే ఏం తినాలి.

పద్మ


మూడేళ్లుగా కౌలు ఇవ్వడం లేదు..

రాజధానికి ఆరెకరాల భూమి ఇచ్చాం. మూడేళ్లుగా కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని కోసం ఆనాడు భూములిచ్చాం. గత ఐదేళ్లుగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. రేషన్‌కార్డులు కూడా ఇవ్వడం లేదు.

వెంకటేశ్వరమ్మ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని