తలరాతలు మార్చేది ఓటే.. ఓటరును చైతన్యపరుస్తున్న చిన్న పుస్తకం

‘ఏ సమాజంలో నీతి తప్పినవాళ్లు విజయం సాధిస్తారో.. నేరస్థులు ఆరాధ్యులుగా మారతారో, విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో..  అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాటా కోసం ఎక్కడైతే ప్రజలు అర్రులు చాస్తుంటారో.. అక్కడ వ్యవస్థ పునఃసమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం’.

Updated : 22 Apr 2024 09:29 IST

డబ్బు, మద్యం కోసం అమ్ముకోవద్దు
అవినీతిపరులు, నేరస్థులు గద్దెనెక్కితే ప్రమాదకరం
ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు


‘ఏ సమాజంలో నీతి తప్పినవాళ్లు విజయం సాధిస్తారో.. నేరస్థులు ఆరాధ్యులుగా మారతారో, విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో..  అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాటా కోసం ఎక్కడైతే ప్రజలు అర్రులు చాస్తుంటారో.. అక్కడ వ్యవస్థ పునఃసమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం’.

రాబర్ట్‌ క్లిట్‌గార్డ్‌, ప్రఖ్యాత సామాజికవేత్త


ఈనాడు, అమరావతి:  ‘మన తలరాతలు మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని చాలామంది ఇప్పటికీ గుర్తించడం లేదు. అవినీతిపరులు, అరాచకశక్తులను ఓడించే శక్తి ఓటుకే ఉంది. డబ్బు కోసమో, మద్యం కోసమో నేరస్థులు, అవినీతిపరులకు ఓటేస్తే అది దేశ భవిష్యత్తునూ నిర్వీర్యం చేస్తుంది’.. అంటూ అక్షర చైతన్యం కల్పిస్తోంది దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌. నేటితరానికి ఓటు విలువను తెలియజేసేందుకు ‘ఎన్నికలు అంటే ఏమిటి? ఎందుకు అవసరం?’పేరుతో ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవినేని మధుసూదనరావు, జయశ్రీ ఓ పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ‘నేనొక్కణ్ని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే భావనతోనే చాలామంది పోలింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు. కానీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే అనే భావనతో ప్రతి ఒక్కరూ ఓటేయాలి’ అని ఈపుస్తకం హితవు చెబుతోంది.

ఒకప్పుడు ఓటు హక్కు కోసం పోరాటాలు

‘‘యూరప్‌లో 1600 సంవత్సరానికి ముందే ఓటు ద్వారా ఎన్నుకునే విధానం అమల్లో ఉంది. ఉన్నత వర్గాల్లోని పురుషులకే ఓటు హక్కు ఉండేది. అది తమకూ కావాలంటూ అప్పట్లో పోరాటాలు జరిగాయి. మన దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరునికీ ఓటు హక్కు ఉన్నా చాలామంది వినియోగించుకోవడం లేదు. ఓటు వేయకపోవడమంటే జీవించి ఉన్నా లేనట్టే. అభ్యర్థులు ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్లు గెలిస్తే ఏం చేస్తారో ప్రశ్నించాలి. గత పాలనలో మీకు జరిగిన అన్యాయంపై నిలదీయాలి. ప్రలోభాలకు లొంగి ఓటేస్తే, తర్వాత మనకు జరిగే అన్యాయంపై మాట్లాడే, నిలదీసే హక్కు ఉండదు..’ అని ఈ పుస్తకం ప్రేరణ కలిగిస్తోంది.

మరో వెనెజువెలా కావద్దు  

అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి ఏమాత్రం లేకుండా కేవలం ఓట్ల కోసం పథకాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టిన కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దిగజారిపోయాయి. 1970ల్లో సమృద్ధిగా చమురు వనరులతో తులతూగిన వెనెజువెలా దేశమే దీనికి ఉదాహరణ. ఓ పాలకుడు తీసుకున్న నిర్ణయాల దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఉద్యోగుల జీతాలు అయిదు రెట్లు పెంచేసి, అందుకోసం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించుకుంటూ పోవడంతో డబ్బుకు విలువ లేకుండాపోయింది. ద్రవ్యోల్బణం దారుణ స్థితికి చేరింది. ప్రస్తుతం తిండి కోసం హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో ఆ దేశం అల్లాడిపోతోంది.


అందరిలో ఆలోచన రేకెత్తించాలనే..

ఓటు అనేది ప్రతి ఒక్కరికీ ఆత్మ, ఆస్తి, భవిష్యత్తు. సరైన పాలకులను ఎన్నుకోకపోతే ధరలు అదుపులో ఉండవు, వైద్యారోగ్యం కుంటుపడుతుంది. చివరికి తాగునీళ్లు, రహదారుల్లాంటి మౌలిక సౌకర్యాలూ గగనమైపోతాయి. ఉపాధి అవకాశాల్లేక ప్రజల జీవితాలే దారుణంగా దెబ్బతింటాయి. అందుకే మా వంతు ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని ముద్రించాం. ఎవరికి కావాలన్నా ఉచితంగా పంపిస్తాం. ఫోన్‌ నంబరు: 99890 51200లో సంప్రదించొచ్చు.      

మధుసూదనరావు, జయశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు