ఇదో నియంత పోకడ.. టీచర్ల ఆవేదనపై కొరకొర

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మంచివారే.. పాదయాత్రలో సీపీఎస్‌పై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఉపాధ్యాయులు అనడం మాత్రం తప్పయిపోయిందట.

Published : 22 Apr 2024 09:17 IST

సీపీఎస్‌ రద్దు చేయలేదని, సకాలంలో జీతాలు రావడం లేదని చెప్పడం ఉల్లంఘనా?
అభిప్రాయాలు చెప్పారని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడంపై విమర్శలు

ఈనాడు, అమరావతి: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మంచివారే.. పాదయాత్రలో సీపీఎస్‌పై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఉపాధ్యాయులు అనడం మాత్రం తప్పయిపోయిందట. వారు ప్రభుత్వంపై అవిధేయత చూపారట. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారట. ఆ కారణాలతో అనంతపురం జిల్లాలో ఉద్యోగ సంఘ నేతలు విజయభాస్కర్‌, హరికృష్ణలను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా? నిజానికి ఉపాధ్యాయులేమీ ఏ పార్టీ జెండానూ పట్టుకుని ఎక్కడా ప్రచారం చేయలేదు. ప్రభుత్వాన్నీ విమర్శించలేదు. పత్రికాముఖంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే వారికి భావప్రకటనా స్వేచ్ఛ కూడా లేదా? కరపత్రాలు, ఓ పార్టీ జెండాలు పట్టుకుని పక్కా కార్యకర్తల్లా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేసే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తే.. దాని ఆధారంగా ఏకపక్షంగా వీరిని సస్పెండ్‌ చేయడం ఏమిటి?

సమయానికి వేతనాలు అందడం లేదనడం వాస్తవం కాదా?

వైకాపా ప్రభుత్వంలో ఒకటో తేదీన వేతనాలు అందడం లేదనేది ‘జగ’మెరిగిన సత్యం ఇది. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్‌కు ఇదేమీ ఇబ్బంది కాకపోవచ్చు కానీ.. నెలనెలా జీతపు రాళ్లపైనే ఆధారపడే ఉద్యోగులకు మాత్రం పూట గడవడమూ కష్టమే. ఆ కష్టం ఉద్యోగులకే తెలుస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు హరికృష్ణ అదే విషయాన్ని చెప్పారు. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని, అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. రెండేళ్లయినా పీఎఫ్‌ రుణాలు మంజూరు కాలేదని వివరించారు. ఉద్యోగవర్గాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చెప్పడమే అధికారుల దృష్టిలో తప్పయిపోయింది.

సీపీఎస్‌ రద్దు చేయలేదు కదా?

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక దీన్ని పట్టించుకోలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్నే ఉపాధ్యాయుడు విజయభాస్కర్‌ వెల్లడించారు. సీపీఎస్‌ రద్దు చేయలేదని తన అభిప్రాయాన్ని పత్రికకు తెలిపారు. ఉద్యోగులు మానసికంగా పడుతున్న ఇబ్బందిని చెప్పడమే అధికారుల దృష్టిలో తప్పయిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారే తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంగానీ, రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనడంగానీ చేయలేదు. అభిప్రాయం చెబితేనే సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సమజమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని