హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!

‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్‌ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.

Published : 23 Apr 2024 06:54 IST

అస్వస్థతకు గురైన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి కష్టాలు
రోడ్డు లేక.. ఆసుపత్రికి చేరకముందే మృత్యువాత
కన్నీరు దిగమింగుకొని కొడుకు మృతదేహంతో తిరుగుప్రయాణం
విజయనగరం జిల్లా ఎస్‌.కోట మన్యంలో వరుస మరణాలు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్‌ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో మృత్యుఘోషే అందుకు నిదర్శనం. రహదారి సౌకర్యం లేకపోవడం, వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఇక్కడ మూడు నెలల కిందట ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మరణించారు. తాజాగా మరో బాలుడు కన్నుమూశాడు. బాధితులు, ఆదివాసీ సంఘాల నాయకుల వివరాల ప్రకారం.. దారపర్తి పంచాయతీ శివారు గూనపాడు గ్రామానికి చెందిన బడ్నాయిన జీవన్‌కుమార్‌, దాలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ప్రసాద్‌కు మూడేళ్ల వయసు. సోమవారం ఉదయం ఇంటి వద్ద బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్చేందుకు తండ్రి తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై కొంతదూరం, నడుచుకుంటూ మరికొంత దూరం తీసుకెళ్లారు. అలా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి ఎస్‌.కోటకు వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా బాలుడు మరణించాడు. దీంతో మృతదేహంతో తిరిగి గ్రామానికి చేరుకున్నారు. దారపర్తి, మూలబొడ్డవర పంచాయతీల్లో ఎంతో కాలంగా ఇలాంటి పరిస్థితులున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జనవరిలో డీఎంహెచ్‌వో, ఐటీడీఏ పీవోలు వచ్చి వైద్య శిబిరాలంటూ హడావుడి చేశారని, అనంతరం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పి, మాట తప్పిందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని