‘ప్రోగ్రెస్‌ కాదు..’ అంతా బోగస్‌!

పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్‌ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.

Updated : 23 Apr 2024 12:42 IST

రైతు భరోసా హామీలపై ఇదీ రిపోర్ట్‌
అడుగడుగునా కోతలు... పైగా బాకాలు
పథకాలపై రాయితీలు ఎత్తేసి మోసం  
వ్యవసాయాన్ని ఉద్ధరించామంటూ ప్రగల్భాలు
ఎన్నికల ప్రచారంలో కపట నాటకాలు
ఈనాడు, అమరావతి

విద్యార్థి ఏడాది చదువుకు ప్రోగ్రెస్‌ రికార్డు ఎలానో...
పాలకుడి ఐదేళ్ల పాలనకు ప్రగతి నివేదిక అంతే...
పిల్లాడు... మార్కులతో తల్లిదండ్రులను,  
నాయకుడు... అభివృద్ధితో పౌరులను మెప్పించాలి!

కానీ, ఎన్నికల్లో మరోసారి ఓట్లు కొట్టేసేందుకు...
జగన్‌ తాను చేయని పనులను దాచేస్తున్నారు!  
గోరంత చేసిన వాటిపై కొండంత ముచ్చట చెబుతున్నారు!

రీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్‌ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి. అలాంటి పనే 51 ఏళ్ల వయసున్న సీఎం చేస్తే ఏమనాలి? ఎందుకంటే ఓ అన్నా.. అక్కా.. అవ్వా... ఇదిగో నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అంటూ జగన్‌ చేస్తున్న ఎన్నికల ప్రసంగాలన్నీ సున్నా ముందు పది చేర్చి చెబుతున్నవే మరి. నవరత్నాలలోని రైతు భరోసా కింద ఇచ్చిన హామీల అమలునే పరిశీలిస్తే... తాను చెప్పేది అబద్ధమని తెలిసినా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ ప్రోగ్రెస్‌ రిపోర్టుకు మోసపు రంగులను అద్దుతున్నారు. హామీలను వంద శాతం అమలు చేసినట్లు బాకాలు ఊదుతున్నారు.


రైతు భరోసాకు కోత పెట్టేశారు

చెప్పింది: ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామన్నారు.

చేసిందేంటి?: ఏడాదికి రూ.7,500 చొప్పున అయిదేళ్లకు రూ.37,500 (1.07లక్షల మంది కౌలు రైతులకే ఏడాదికి రూ.13,500 చొప్పున). మాత్రమే ఇచ్చారు.

ఎగ్గొట్టిన సొమ్మెంత?:  ఐదేళ్లలో రూ.9,800 కోట్లు.


మూడు కోట్ల ఎకరాలకు పంటల బీమా పోయింది

చెప్పింది: పంటల బీమాపై రైతులు ఆలోచించాల్సిన పనిలేదని, సాగు చేసిన ప్రతి ఎకరానికి ఉచిత పంటల బీమా అమలు చేస్తామన్నారు.

చేసిందేంటి?:  కొన్ని పంటలకే.. అదీ ఈ-క్రాప్‌లో  నమోదైతేనే అన్నారు. అధిక శాతం రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపారు.

జరిగింది: ఐదేళ్లలో 3 కోట్ల ఎకరాలకు పంటల బీమా లేకుండా చేశారు.


వడ్డీలేని పంట రుణాలా... తూచ్‌!

చెప్పింది: రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలను ఇస్తామన్నారు.

చేసిందేంటి?: గెలిచాక రూ.లక్ష వరకే అని నిబంధన పెట్టారు. అదీ వడ్డీతో సహా ముందే కట్టిస్తున్నారు. కొర్రీలపై కొర్రీలేసి.. కొందర్ని తప్పించి ఏడాది తర్వాత ఎప్పటికో ఇస్తున్నారు. పావలా వడ్డీని ఎత్తేశారు.


రైతన్నలే ‘బోరు’మనేలా చేశారు  

చెప్పిందేంటి?:  రైతులకు ఉచితంగా రెండు లక్షల బోర్లు వేయిస్తామన్నారు.

చేసిందేంటి?:  రాష్ట్రవ్యాప్తంగా తవ్వించింది ఐదేళ్లలో 25 వేల బోర్లు మాత్రమే. (ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదంటూ.. రైతుల నుంచే డీజిల్‌ సొమ్ములను వసూలు చేస్తున్నారు. తవ్విన బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు, మోటార్లూ ఇవ్వడం లేదు.)


పేరుకే వెలుగులు.. రైతులకు కోతలు!

చెప్పిందేంటి?: వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు.

చేసిందేంటి?:  సేద్యానికి చేస్తోంది 7 గంటల విద్యుత్తు సరఫరానే. అదీ పగలు, రాత్రి రెండు, మూడు దఫాలుగా. అయిదేళ్లలో రాత్రిపూట మోటార్లు వేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన రైతన్నలెందరో ఉన్నారు. ఇదిచాలదన్నట్లు అన్నదాతల మెడపై కత్తి పెట్టి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు.


ఆక్వా కరెంటు... అంతే సంగతులు

చెప్పింది: ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తును రూ.1.50 చొప్పునే సరఫరా చేస్తామన్నారు.

చేసిందేంటి?: ఆక్వా రైతులు 62 వేల మంది వరకు ఉంటే... వారిలో సగటున 55 వేల మందికి మూడేళ్లపాటు మాత్రమే పథకం అమలు చేశారు. 2022-23 నుంచి ఆక్వా జోన్‌లో పదెకరాల వరకే విద్యుత్తు రాయితీ అనే కొత్త నిబంధన తీసుకొచ్చారు. అర్హుల సంఖ్యను 41 వేలకు కుదించారు. ఏడాదికి ఏకంగా రూ.400 కోట్లు మిగుల్చుకుంటున్నారు.


తెదేపాలోనే రద్దు.. అయినా మోసపు పద్దు

చెప్పింది: వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ను, టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేస్తామన్నారు.

చేసిందేంటి?: గత తెలుగుదేశం ప్రభుత్వమే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు చేసింది. అయినా పాత పద్దుకు మోసాలద్దారు.


దోచుకునే వారికే మద్దతు!

చెప్పింది: రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంట వేసే ముందు రేట్లు ప్రకటిస్తామన్నారు. గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తామన్నారు.

చేసిందేంటి?: ధరల స్థిరీకరణ నిధికి ఏడాదికి రూ.500 కోట్లే ఇచ్చారు. వాటిని కూడా బడ్జెట్‌ పత్రాలకే పరిమితం చేశారు. పంటలకు ధరల్లేవంటూ రైతులు ఆర్‌బీకేలకు వెళ్లినా... ఇదిగో, అదిగో అంటూ పంటకాలం పూర్తయ్యాక ఎప్పటికో నామమాత్రంగా కొంటున్నారు. అప్పటికే చాలామంది రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గిట్టుబాటు ధరకు గ్యారంటీ అనేదే లేదు. మద్దతు ధరపై ధాన్యం కొనాలంటే క్వింటాకు 20 కిలోల ధాన్యమో, రూ.400 వరకు నగదునో ఎదురు ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది.

2019లో చిరుధాన్యాలతోపాటు మిరప, పసుపు, బత్తాయి, అరటి, ఉల్లికి మద్దతు ధరలు ప్రకటించారు. 2024 వచ్చినా అవే ధరలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఏటా పెంచుతున్నా.. రాష్ట్రం మాత్రం పాత ధరల్నే తిప్పితిప్పి చెబుతోంది. సాగుకు పెట్టుబడుల ఖర్చు   ఏటా 20% పెరుగుతున్నా మద్దతు ధర   మాత్రం పెంచడం లేదు.


కర్షకులను విపత్తులకు వదిలేశారు

చెప్పిందేంటి?: రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

చేసిందేంటి?:  2019 నుంచి వరసగా వరదలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా కరవు సైతం వెంటాడుతోంది. అయినా ఉదారంగా చేయూతనివ్వలేదు. వరదలతో నిండా మునిగితే 10% మందికైనా సాయం అందలేదు. నిరుడు కరవుతో రైతులు అల్లాడుతుంటే... ఖరీఫ్‌, రబీలో కలిపి 190 కరవు మండలాలను ప్రకటించి అన్నదాతలకు తీరని ద్రోహం చేశారు. విపత్తు సాయంలోనూ ఉదారత లేదు. 2014లో అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించిన సాయమే ఇప్పటికీ అమలవుతోంది. వాటిలోనూ కొన్నింటికి కోత పెట్టారు.


అటకెక్కిన ఆహార శుద్ధి పరిశ్రమలు

చెప్పింది: ప్రతి  నియోజకవర్గంలో శీతల గిడ్డంగులను, గోదాములను నిర్మిస్తామన్నారు. అవసరం మేరకు ప్రతి మండలానికి ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

చేసిందేంటి?: కొత్త శీతల గిడ్డంగి ఏర్పాటు లేదు. గతంలో అనుమతిచ్చిన వాటిని కూడా నిలిపేశారు. రాయలసీమలో టమోటా పండించే చోట మండలానికి ఒక టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ తెస్తామన్న హామీకి నీళ్లొదిలారు. ఆక్వా సాగు చేసే చోట శీతలీకరణ వసతుల    కల్పనకూ మొండిచేయి చూపారు.


పాడి రైతుకు బోనస్‌... తుస్‌!

చెప్పింది: మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోస్తే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తామన్నారు.

చేసింది: ఒంగోలు సహా... ఇతర సహకార డెయిరీలను మూసేశారు. వాటిని అమూల్‌కు నామమాత్రపు లీజుకు అప్పనంగా అప్పగించారు. రూ.6వేల కోట్లతో పాల సేకరణ కేంద్రాలు,  బల్క్‌మిల్క్‌ యూనిట్లు, ఇతర మౌలిక వసతులను కల్పించి అమూల్‌కు పాలను సేకరించి ఇస్తున్నారు. లీటరుకు రూ.4 బోనస్‌ అనే మాటే లేదు.


బాధిత కుటుంబాలకు మోసం

చెప్పింది: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.7 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా... చట్టం తెచ్చి, బాధితులకు అండగా ఉంటామన్నారు.

చేసేదేంటి?: వ్యవసాయంలో వరసగా అయిదేళ్లుగా నష్టాలే. రాష్ట్రంలో సగటున రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా వారిలో 10% మందికి కూడా ప్రభుత్వ సాయం అందడం లేదు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయాధికారుల కమిటీలు వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించడం లేదు. అప్పులకు వ్యవసాయం కారణం కాదంటూ తిరస్కరిస్తున్నారు. వారి కుటుంబాల గోడు పట్టించుకునే నాథుడే లేరు. కౌలు రైతుల కుటుంబాల్లో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే... కొర్రీలతో సాయానికి మోకాలడ్డుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు