వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ

మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది.

Published : 23 Apr 2024 05:19 IST

దిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు సీజే కార్యాలయాల్లో ఫిర్యాదులు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు రూరల్‌: మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది.  ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఆమె ఈ విధంగా చేశారు. ఈ ఘటన ఆదివారం దిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి బాధితురాలి కథనం ఇలా ఉంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయులు కొందరు గుంటూరు నగర శివారు స్వర్ణభారతినగర్‌, అడవితక్కెళ్లపాడు పరిధిలో భూదందాలకు పాల్పడ్డారు. పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి విక్రయిస్తూ అసలైన హక్కుదారులను రోడ్డున పడేశారు. వారి అన్యాయాలను స్థానికంగా ఉన్న ఆదర్శ మహిళా మండలి సభ్యులు ప్రశ్నించి కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీ, సీఐడీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. వాటిపై వారు స్పందించకపోగా తిరిగి శ్రీలక్ష్మిపైనే కేసులు పెట్టారు. దీంతో ఆమె కొందరు మహిళలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడానికి దిల్లీ వెళ్లారు. ఆయా కార్యాలయాలకు వెళ్లి ఆమె వినతిపత్రాలు అందజేశారు. అలాగే ఈ వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుని శ్రీలక్ష్మి తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని నియోజకవర్గంలో చోటుచేసుకున్న భూకబ్జాలు, దందాలు, గంజాయికి బానిసలవుతున్న యువత పరిస్థితిని తెలియజేశారు.

పేదల స్థలాలే లక్ష్యంగా..

స్వర్ణ భారతినగర్‌, అడవితక్కెళ్లపాడులో పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. గతంలో ఇక్కడ పలు సందర్భాల్లో పేదలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో కొందరు అక్కడ ఉండడం లేదు. ఇలాంటి వారి స్థలాలను కబ్జా చేసి నకిలీ హక్కు పత్రాలతో విక్రయిస్తున్నారని, ఈ అన్యాయాలపై ప్రశ్నిస్తే తనను సుచరిత అనుయాయులు లక్ష్యంగా చేసుకున్నారని, అధికారం వినియోగించి తనపైనే పోలీసులకు లేనిపోనివి చెప్పి ఎదురుకేసులు పెట్టించారని శ్రీలక్ష్మి ‘ఈనాడు’కు తెలిపారు. వీరి అక్రమాలకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని చెప్పారు. అందుకే దేశం దృష్టికి సుచరిత అనుయాయుల అరాచకాలను తీసుకెళ్లాలని భావించి దిల్లీ వెళ్లి ఆదివారం బొటన వేలిని నరుక్కున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులైన మేరీ, వెంకట్‌, నాగులు, మోహన్‌ అక్కడ జరిగే అక్రమాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆమె ఆరోపించారు. వీరే అధికారుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. స్వర్ణభారతినగర్‌లో నివాసం ఉంటున్నానని, అక్కడ జరిగే ప్రతి అన్యాయం, అరాచకం తనకు తెలుసన్నారు. ఇతరులు ఎవరూ అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందని, గంజాయివిక్రయాల్లో కూడా సుచరిత అనుచరులదే కీలకప్రాత అని ఆరోపించారు.


వేళ్లు కోసుకోవద్దు.. అదే వేలుతో ఓటేసి జగన్‌కు బుద్ధి చెప్పండి: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ప్రజలారా! మీ వేళ్లు కోసుకోవడం కాదు.. రేపటి ఎన్నికల్లో అదే వేలితో బటన్‌ నొక్కి, సీఎం జగన్‌కు బుద్ధి చెప్పండి’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రానికి చెందిన మహిళ వేలు కోసుకున్న ఘటనపై సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


బాబాయినే హతమార్చిన వారు.. వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్‌

‘వైకాపా అరాచకాలు, అవినీతిపై పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మి.. దిల్లీలోనూ వైకాపా అక్రమాలను ఎలుగెత్తి చాటుతున్నారు. సొంత బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా? నిరసన తెలియజేయడానికి అనేక మార్గాలున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని