కరవు సీమలో ‘అవినీతి’ సిరి!

రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు.

Updated : 23 Apr 2024 13:06 IST

కబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక, మట్టి మాఫియా..
ప్రభుత్వ, దళితుల భూములనూ వదల్లేదు
కమీషన్‌ ఇవ్వకుంటే కాంట్రాక్టర్లను తన్ని తరిమేయడమే..
కర్నూలు జిల్లాలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి సకుటుంబ అక్రమాలు, దౌర్జన్యాల బాగోతమిదీ..  
ఈనాడు, అమరావతి

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా..
తమ పార్టీ అధికారంలో ఉండగానే.. ఆస్తులు కూడబెట్టుకోవాలనుకున్నారా ప్రజాప్రతినిధి!


రెండు చేతులతో అయితే సరిపోదని.. తోడుగా నలుగురు మనుషుల్నీ పెట్టుకున్నారు


తమ ముఖ్య నాయకుడి స్ఫూర్తితో, తోటి ప్రజాప్రతినిధుల ప్రేరణతో ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని పీల్చి పిప్పిచేశారు!


రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. వీరికి చుట్టమని చెప్పుకొనే ఒక జడ్పీటీసీ  కూడా ఆయన పరిధిలో వసూళ్లు చేసి ఈ కుటుంబానికి ముట్టజెబుతున్నారు. మొదట నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధి పుత్రరత్నం సెటిల్‌మెంట్లలో దుందుడుకుగా వ్యవహరించారు.

పరిస్థితి చేయి దాటడంతో ఆయనని తమ సొంత మండలం వెల్దుర్తికి పంపారా ప్రజాప్రతినిధి. అక్కణ్నుంచే దందాల్ని పర్యవేక్షిస్తున్నాడాయన. జనం కరవుతో అల్లాడుతుంటే.. ప్రజాప్రతినిధి కుటుంబం సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు.. ఇసుక, మట్టి మాఫియాలతో రూ.కోట్లు దండుకుంటోంది. ఈ ప్రజాప్రతినిధి సొంత మండలం జాతీయ రహదారి-44కు పక్కనే ఉంది. అక్కడ స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసుకోవాలంటే వీరు నిర్ణయించినంత మొత్తం కప్పంగా కట్టాల్సిందే.

కమీషన్‌ ఇవ్వకుండా పనులు చేస్తే..

మద్దికెర-బేతంచెర్ల మధ్య రైల్వే పనులకు సంబంధించి కాంట్రాక్టు పొందిన ఒక గుత్తేదారును వీరు కమీషన్‌ అడిగారు. పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ఆధారంగా కమీషన్‌ ఇస్తామని గుత్తేదారు చెప్పగా.. గంపగుత్తగా ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టారు. ఇంకా మొదలు పెట్టని, చెయ్యని పనులకు మామూళ్లు ఎలా ఇచ్చేదంటూ ఆ గుత్తేదారు చెప్పారు. దీంతో ప్రజాప్రతినిధి మనుషులు మద్దికెర రైల్వేస్టేషన్‌లో ఆయన చేయిస్తున్న వంతెన పనులను అడ్డుకున్నారు.. అడ్డొచ్చిన కూలీలలోపాటు గుత్తేదారుపైనా దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడి చేయడమే కాకుండా గుత్తేదారు వినియోగించే కారు, కంకర మిషన్‌ను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వాహనాలను ఎత్తుకెళితే కేసుకు బలం చేకూరుతుందనే భావనతో వాటిని మధ్యలో వదిలేసి వెళ్లారు.

  • కృష్ణగిరి టోల్‌ప్లాజా వద్ద వీరి వాహనాలను ఉచితంగా వదిలేయలేదని.. ఈ ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు..
  • ‘చెప్పినట్లు పనిచేయకపోతే ప్రజాప్రతినిధికి చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తాం.. సస్పెండ్‌ చేయిస్తాం’ అంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తారు. ‘నేను చెప్పినట్లుగా బిల్లులు చెల్లించకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈని మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త హెచ్చరించారు. ఆ విషయాన్ని ఏఈ పైఅధికారులకు చెప్పినా.. వారూ ఏం చేయలేక ‘ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇలాంటి బాధలు తప్పవ’ని సర్దిచెప్పినట్లు తెలిసింది.

ఇసుకా మాదే.. మట్టీ మాదే..

ఈ ప్రజాప్రతినిధి అనుచరులు పత్తికొండ మండలంలో హంద్రీ నది నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. కొత్తవారెవరైనా ఇసుక కోసం అక్కడకు వచ్చారంటే చాలు అధికారులు వాలిపోయి వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధిస్తారు. మండలంలోని వంకలు, వాగుల నుంచి రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలోని చెరువుకు అవతలి వైపు నల్ల కాలువకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారు. చక్కరాళ్ల రోడ్డు సమీపంలోని బూడిదగుండ్లు నుంచి యథేచ్ఛగా ఎర్ర మట్టిని దోచేస్తున్నారు. గతంలో బొందిమడుగుల సమీపంలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు.


ప్రజాప్రతినిధి వెంటే వసూళ్ల ‘గణం’

ఈ ప్రజాప్రతినిధికి వసూళ్లు చేసిపెట్టే బ్యాచ్‌.. ఎప్పుడూ ఆ నేతతోపాటే పయనిస్తూ ఉంటారు. ఒక ప్రధాన అనుచరుడు ఎక్కడెక్కడ కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయో తెలుసుకుంటాడు. ఆపై బ్యాచ్‌తో అక్కడకు వెళ్లి పనిస్థాయిని బట్టి కమీషన్‌ మొత్తాన్ని నిర్ణయించి, ఆ మేరకు వసూలు చేసుకొస్తారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా ఈ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలి. నాణ్యత లేకుండా వారు ఆ పనులను చేసినా పర్యవేక్షక ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది ప్రశ్నించడానికి వీళ్లేదట. ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడొకరు ఎంపీ నిధులతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని గడప గడపకు.. కార్యక్రమంలో అదే ప్రజాప్రతినిధి ముందు వారి పార్టీ నాయకులే ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి మండల పరిధిలోని హంద్రీనీవా కాలువ గట్టు రాళ్లనూ వైకాపా నాయకులకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.


ఉద్యోగాల పేరుతో వసూళ్లు...

సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 లక్షల వరకు ఈ ప్రజాప్రతినిధి అనుచరులు వసూలు చేశారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు రూ.10లక్షలు, కార్యకర్త పోస్టుకైతే రూ.3లక్షల వరకు వసూలు చేయగా.. వీరిలో కొంతమందికి ఉద్యోగాలు రాలేదు.. కట్టిన డబ్బు తిరిగి రాలేదు. అంగన్‌వాడీ ఆయా పోస్టులనూ అమ్మకానికి పెట్టడం గమనార్హం.

  • ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో జరిగిన ఓ అవినీతి వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్‌లో కథనం వచ్చినందుకు ఆ మీడియా ప్రతినిధిపై వీరి మనుషులు దాడి చేశారు.

భూ‘మంతర్‌’

పత్తికొండ చెరువు ముందున్న తూము ప్రాంతాన్ని(రూ.కోట్లు విలువజేసే సుమారు 2 ఎకరాలు) ఈ ప్రజాప్రతినిధి అనుచరుడు మట్టితో పూడ్చి ఆక్రమించారు. అడ్డుకున్న రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో కథనాలు రావడంతో మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు ఆక్రమణలను తొలగించారు. కానీ, అదే రోజు రాత్రి ఆక్రమణదారుడు అక్కడ షెడ్లు వేయించారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణదారుడిని జైలుకు పంపారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించే యత్నం చేశారు.


  • పత్తికొండ శివారులోని హంద్రీనీవా కాల్వ సమీపంలో ఓ విలేకరి కుటుంబానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు జిల్లా కలెక్టర్‌ను, కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలంలో కొంత కాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

  • ప్రజాప్రతినిధి బంధువు అండతో తుగ్గలి మండలం శభాష్‌పురంలో బూజుగుండ్ల రంగస్వామి మాన్యం భూమిని వైకాపా నాయకుడొకరు ఆక్రమించారు. దీనిపై గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

  • ఒక దళిత కుటుంబం పొలాన్ని ఈ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఆక్రమించుకుని, అక్కడ అక్రమంగా వెంచర్‌ వేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపైన దాడులు చేశారు. బాధితుల తరఫున దళితులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడంతో విధిలేక పోలీసులు కలగజేసుకుని ఆ అనుచరుడిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని