యాక్సిస్‌తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ

యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మోకాలడ్డింది.

Updated : 23 Apr 2024 06:49 IST

కమిషన్‌ నిబంధనలకు అవి విరుద్ధం
బిడ్డింగ్‌ ద్వారానే విద్యుత్‌ తీసుకోవాలన్న ఏపీఈఆర్‌సీ

ఈనాడు, అమరావతి: యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మోకాలడ్డింది. కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థతో పీపీఏలు చేసుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. గత ఒప్పందం ప్రకారం 764.6 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ తీసుకునేలా పీపీఏ కుదుర్చుకోవాలని డిస్కంలను జగన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారం ప్రాజెక్టు ఏర్పాటుకు అయ్యే వాస్తవ ఖర్చు ఆధారంగా టారిఫ్‌ను నిర్దేశించాలని యాక్సిస్‌ సంస్థ ఏపీఈఆర్‌సీని కోరింది. కానీ, ఓపీ 5/2017 ప్రకారం జారీచేసిన ఉత్తర్వుల మేరకు డిస్కంలు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలోనే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి తీసుకునే విద్యుత్‌కు పీపీఏలు కుదుర్చుకోవాలని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఈ దృష్ట్యా పాత రెగ్యులేషన్‌ ఆధారంగా ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోడానికి డిస్కంలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పింది.

ప్రజలపై రూ.7,300 కోట్ల భారం

పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి అధిక ధరకు విద్యుత్‌ తీసుకునేలా గత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని జగన్‌ ప్రభుత్వం విమర్శించింది. పీపీఏల రద్దు పేరుతో హడావుడి చేసింది. అప్పటి నుంచి పీపీఏల ప్రతిపాదన పక్కన పెట్టింది. యాక్సిస్‌ సంస్థతో పీపీఏ కుదుర్చుకోవాలని డిస్కంలను ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ ఆమోదానికి డిస్కంలు పంపాయి. యాక్సిస్‌ సంస్థ కోరిన ప్రకారం టారిఫ్‌ను నిర్దేశిస్తే.. 25 ఏళ్లలో ఆ సంస్థ నుంచి తీసుకోబోయే 42,500 మిలియన్‌ యూనిట్లకు.. మార్కెట్‌ ధరతో పోలిస్తే రూ.7,300 కోట్ల అదనంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా.

అవసరమైతే బిడ్డింగ్‌ నిర్వహించుకోండి

డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను బిడ్డింగ్‌ విధానంలోనే తీసుకోవాలని కమిషన్‌ ఆదేశించింది. బిడ్డింగ్‌ను డిస్కంలు సొంతంగా నిర్వహించాలని.. అలా సాధ్యం కాకుంటే భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) ద్వారా నిర్వహించుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి తీసుకునే విద్యుత్‌కు పంపిణీ ఛార్జీల మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అలా కాకుండా గత విధానంలో ప్రాజెక్టు ఏర్పాటుకు చేసే వాస్తవఖర్చు ఆధారంగా స్థిర ఛార్జీలను నిర్దేశించే విధానం అమలులో లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ దృష్ట్యా యాక్సిస్‌తో పీపీఏలు కుదుర్చుకోవాలన్న డిస్కంల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని