అయినవాళ్లకే భద్రత

ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్‌ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.

Published : 24 Apr 2024 03:43 IST

వైకాపా నాయకుడైతే చాలు భద్రత కేటాయింపు
తెదేపా వారికి ముప్పున్నా పట్టించుకోరు
భద్రతనూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న జగన్‌ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్‌ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. వైకాపా నాయకులైతే చాలు.. అదే ఏకైక అర్హత అన్నట్లుగా అడ్డూ అదుపులేకుండా సాయుధులైన భద్రతా సిబ్బందిని కేటాయించేస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులకు ముప్పున్నా సరే తగినంత భద్రత కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైకాపా నాయకుల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తున్న ఏపీ నిఘా, పోలీసు విభాగాలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. అధికార పక్ష నాయకులకైతే ఓ న్యాయం.. విపక్షాల వారికి మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

తెదేపా అభ్యర్థికి ప్రాణహాని ఉన్నా ఇవ్వరు..  

ఈ ఎన్నికల్లో వైకాపా తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తుంటే చాలు వారికి ఉదారంగా సాయుధ భద్రత కేటాయిస్తున్నారు. అదే తెదేపా నుంచి బరిలో ఉండే అభ్యర్థులకు ప్రాణహాని, ముప్పు ఉన్నా సరే సవాలక్ష నిబంధనల సాకులు చూపించి భద్రత ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై పులివెందులలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న బీటెక్‌ రవికి అసలు భద్రత ఇవ్వలేదు. తనకు ముప్పు ఉందని ఆయన తెలిపినా పట్టించుకోవట్లేదు. అసలు గన్‌మన్‌ల కేటాయింపునకు ఓ ప్రాతిపదిక ఉండదా? వైకాపా నేతలు కావడమే భద్రతకు ప్రాతిపదికా?

  • జగన్‌ పాలనలో చంబల్‌లోయలా మారిపోయిన పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి నిరంతరం ముప్పు పొంచే ఉంటోంది. కానీ ఆయనకు మాత్రం గన్‌మన్లను కేటాయించలేదు. ప్రైవేటుగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. మరో అరాచక సామ్రాజ్యమైన పుంగనూరులో తెదేపా తరఫున పోటీ చేస్తున్న చల్లా రామచంద్రారెడ్డి(బాబు)కి భద్రత కల్పించలేదు.
  • అనంతపురం జిల్లా మడకశిర, శింగనమల నియోజకవర్గాల వైకాపా అభ్యర్థులు ఈరలక్కప్ప, వీరాంజనేయులకు వారి అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే 1 ప్లస్‌ 1 గన్‌మన్లను కేటాయించారు. అవే నియోజకవర్గాల నుంచి తెదేపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం అసలు భద్రతే కల్పించలేదు.
  • విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలే రాజేష్‌కు 1 ప్లస్‌ 1 గన్‌మన్‌ కేటాయించారు. అదే స్థానంలో తెదేపా నుంచి పోటీ పడుతున్న కోండ్రు మురళీమోహన్‌కు భద్రతే ఇవ్వలేదు.

ఇలా రాజీనామా.. అలా భద్రత వెనక్కు

తెదేపా సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, అది ఆమోదం పొందిన వెంటనే భద్రతను ఉపసంహరించేశారు. కానీ తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాలోకి ఫిరాయించిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వల్లభనేని వంశీమోహన్‌లపై అనర్హత వేటు పడినా సరే వారికి భద్రతను కొనసాగిస్తున్నారు. వంశీకైతే ఏకంగా 4 ప్లస్‌ 4 భద్రత.. వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు 1 ప్లస్‌ 1 కొనసాగిస్తున్నారు.

వైకాపాను వీడితే గన్‌మన్‌ తొలగింపు..

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల వైకాపాను వీడి జనసేనలో చేరారు. అప్పటివరకూ ఆయనకు 2 ప్లస్‌ 2 భద్రత కల్పించిన ప్రభుత్వం.. పార్టీ మారటమే తరువాయి.. దాన్ని కుదించేసింది.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భద్రత కట్‌

నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు వైకాపాలో కొనసాగినంత కాలం వారికి 2 ప్లస్‌ 2 భద్రత కల్పించారు. వారు గతేడాది వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుగుబాటు జెండా ఎగరేసిన వెంటనే 1 ప్లస్‌ 1కు కుదించేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ భద్రత వద్దని వారు అప్పట్లో నిరాకరించారు. ప్రస్తుతం వీరిద్దరికీ భద్రత కల్పించలేదు.

కోర్టును ఆశ్రయిస్తేనే..

ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు 1 ప్లస్‌ 1 భద్రత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆయన ఆరోపించిన అనంతరం ఆయనకున్న భద్రతను లాగేశారు. చివరికి ఆయన భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.  

ఎర్రచందనం స్మగ్లరైనా ‘భద్రమే’  

చిత్తూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులున్నాయి. గతంలో పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగించారు. ఆయనకు 1 ప్లస్‌ 1 గన్‌మన్‌  కేటాయించారు.


అచ్చెన్న, నిమ్మలకు 1 ప్లస్‌ 1  నానీలకు మాత్రం 4 ప్లస్‌ 4 భద్రత

తెదేపా శాసనసభా పక్ష ఉపనేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు 1 ప్లస్‌ 1 భద్రతే కేటాయించారు. వీరిద్దరూ సీనియర్‌ ఎమ్మెల్యేలు. అచ్చెన్నాయుడు ఏపీ తెదేపా అధ్యక్షుడు, మాజీ మంత్రి కూడా. వారికి నామమాత్రపు భద్రత కల్పించిన పోలీసులు.. ప్రతిపక్ష నాయకులపై దుర్భాషలతో నోరేసుకుని పడిపోవటంలో ముందుండే కొడాలి నాని, పేర్ని నానిలకు ఏకంగా 4 ప్లస్‌ 4 భద్రత కల్పించారు. దేవినేని అవినాష్‌ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి మాత్రమే. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయనకూ 2 ప్లస్‌ 2 గన్‌మన్లు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలైతే వారికి తక్కువ భద్రతిస్తారా? అదే అధికార పార్టీ నాయకులైతే ఎంతమంది సిబ్బందినైనా కేటాయిస్తారా? ఇదేం భద్రతా సమీక్ష? ఇది అధికారపక్షానికి కొమ్ముకాయటం కాదా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని