గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి

కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది.

Updated : 24 Apr 2024 08:44 IST

అదేం భాషండీ. వయసుకు గౌరవం ఇవ్వాలనే జ్ఞానం లేదు. పెద్దాచిన్నా.. అందర్నీ ఒకేగాటన కట్టేసి మాట్లాడే వాళ్లని ఏమనాలి? నోరు తెరిస్తే చాలు బూతులే.  పక్కనే కూర్చున్న పిల్లలతో కలిసి అతని మాటలు వినాలంటే సిగ్గేస్తోంది.’

పెంజెండ్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంతరంగం


‘ఈ ఏడాది పండిన వరి పంటను సంక్రాంతి పండగ సమయంలో ఆర్‌బీకే ద్వారా మచిలీపట్నంలోని బియ్యం మిల్లులకు తరలించాం. ట్రాక్టరు కిరాయికి తీసుకొని వెళ్లి రెండ్రోజులు ఉన్నాక క్వింటాకు 5-6 కిలోల తరుగు తీశారు. 10 రోజుల్లో డబ్బు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. మూడునెలలు దాటినా ఇప్పటికీ అతీగతీ లేదు. సొంతూళ్లో అమ్ముకునే అవకాశం లేకుండా చేసి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే సర్కారులో కొడాలి నాని రెండున్నరేళ్లు పౌరసరఫరాల మంత్రిగా పనిచేసినా నోరుమెదపలేకపోయారు’

గుడ్లవల్లేరు మండలంలోని అయిదుగురు రైతుల ఆవేదన ఇది.


‘గుడివాడ పట్టణం నుంచి రోజూ కళాశాలలకు బస్సుల్లో వెళుతుంటాం. నాలుగేళ్లుగా గోతుల మార్గాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాం. మొదట్లో బాధ అనిపించేది. రాన్రాను అలవాటైంది. ఇదంతా మా జగన్‌ మామయ్య ఇచ్చిన బహుమతులని అనుకుంటూ నవ్వుకుంటాం. ఇంత ప్రధానమైన రహదారిని బాగు చేయాలనే కనీస స్పృహలేని నాయకుడిని గెలిపించి తప్పుచేశామని మా తల్లిదండ్రులు అంటుంటారు. అందుకే మేం ఈసారి మా ఓటుతో మామయ్యకు రిటర్న్‌ గిఫ్టు ఇద్దామనుకుంటున్నాం’

గుడివాడ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానం.


‘ఈ అయిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పాలి. కరెంట్‌ బిల్లు రూ.150 నుంచి రూ.350కి పెరిగింది. ఒక్కఛాన్స్‌ అంటూ వచ్చి మధ్యతరగతి కుటుంబాలను నిలువునా ముంచేశారు.

గుడివాడలో చెప్పులు కుట్టే వ్యక్తి మాటలు.

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుంది?.. ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై ఇప్పటికే భారీఎత్తున బెట్టింగులు మొదలయ్యాయి. అంతటి కీలకమైన నియోజకవర్గంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నట్లు చెబుతున్నారు. పంటచేలు, విద్యాలయాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాన్ని జూదశాలలకు చిరునామాగా మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ సోమ, మంగళవారాలు గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల్లోని మల్లయ్యపాలెం, పెంజెండ్ర, మోటూరు, చిత్రం, గుడ్లవల్లేరు, నందిపాడు, తుమ్మలపల్లి, రామాపురం, ఐనంపూడి, జొన్నవాడ, విన్నకోట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని  రైతుకూలీలు, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులను నియోజకవర్గ అభివృద్ధి, రహదారుల నిర్మాణం, రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించినప్పుడు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 2024 ఎన్నికల్లో తాము చరిత్రాత్మక మార్పును కోరుకుంటున్నామని వెల్లడించారు.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు..

నియోజకవర్గంలో ఏ దారి చూసినా గుంతలు. రోజూ సుమారు 25,000-30,000 మంది వివిధ ప్రాంతాల నుంచి గుడివాడ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన కేంద్రాన్ని కలిపే దారులన్నీ మరమ్మతులు లేక దెబ్బతిన్నాయి. కంకిపాడు-గుడివాడ ప్రధాన రహదారితోపాటు పట్టణంలోని అంతర్గత మార్గాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. కార్లు, ద్విచక్రవాహనాలపై కొత్తగా వచ్చిన వారిలో 80శాతం మంది ప్రమాదాలకు గురవుతుంటారని గుడివాడకు చెందిన న్యాయవాది తెలిపారు. కంకిపాడు-గుడివాడ మార్గంలో రాత్రిళ్లు ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందారని, కొందరు వికలాంగులుగా మారినట్లు వివరించారు. దొండపాడు, వలివర్తి, లింగవరం, పోలుగూడ, గుడివాడ నుంచి నందివాడ వెళ్లే వైపు జనార్దనపురం, తుమ్మలపల్లి, కుదరవల్లి, రామాపురం రహదారులు గుంతలు పడ్డాయి. ఎన్నికల సమయంలో జనం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రోడ్లు తవ్వి వదిలేశారు. వాటిని పూడ్చేందుకు తారు కొరత ఉందని చెబుతున్నారని నందివాడకు చెందిన పచారీ దుకాణ యజమాని తెలిపారు. ‘తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బాగు చేసిన రోడ్లే. నాలుగేళ్లలో గోతులు పడి జనం ఇబ్బందులు పడుతున్నా మా ఎమ్మెల్యే కన్నెత్తి చూసిన పాపానపోలేదు’ అంటూ తుమ్మలపల్లికి చెందిన ఒక వ్యక్తి వివరించారు. ‘విజయవాడ-గుడివాడ రోజూ అయిదు ట్రిప్పులు వేస్తుంటాం. ఒంటి నొప్పులతో నిద్రకూడా పట్టదు. మా కళ్లెదుటే చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి రోడ్లలో ఇంధనం కూడా ఎక్కువ ఖర్చవుతుంది. డబ్బులు వస్తున్నాయని ఆశపడి తప్పటడుగు వేస్తే ప్రతిఫలం ఇలానే ఉంటుందని ప్రజలు గమనించాలి’ అని ఆర్టీసీ కండక్టర్‌ తెలిపారు.


రైతుల గోడు పట్టదు.. తాగునీరు రాదు

వైకాపా హయాంలో రైతులకు రాయితీల్లేవు. పంటకాల్వల్లో పూడిక తీయక ఏళ్లవుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కొనుగోళ్లు చేపట్టినా లాభం లేదు. ఆక్వా సాగుచేసే వారికి గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్‌ రాయితీ తీసేశారని విన్నకోట గ్రామానికి చెందిన రైతు తెలిపారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు, తాలు అంటూ తీస్తున్నారు. తమ పంటను తామే అమ్ముకోకుండా నిబంధనలు విధించారంటూ నందివాడకు చెందిన ఇద్దరు రైతులు వాపోయారు. నందివాడ, గుడివాడల్లో తాగునీటి ఎద్దడి పెరిగిందంటున్నారు. తాగేందుకు నీళ్లు కూడా రోజుకు రూ.30 ఇచ్చి కొంటున్నామని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మహిళ తెలిపారు. ప్రతి గ్రామంలో 20 మందితో మాట్లాడితే 12-15 మంది ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు. అమరావతి రాజధానిని తరలించడాన్ని అందరూ వ్యతిరేకించారు. ‘45 ఏళ్లు దాటిన నా భార్యకు డబ్బులిస్తున్నారు. మా అమ్మకు పింఛన్‌ ఇవ్వడం మంచిదే. ఇంజినీరింగ్‌ చేసిన నా బిడ్డ ఉద్యోగం చేయాలంటే బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్లాలా? ఇన్నేళ్లలో ఒక్క ఐటీ కంపెనీ, పరిశ్రమ తెస్తే ఉపాధి ఇక్కడే దొరికేది కదా’ అంటూ చిత్రం గ్రామానికి చెందిన ఒకరు ప్రశ్నించారు. ఏటా రూ.10వేలు తీసుకుంటున్న ఆటోడ్రైవర్లలోనూ నిరాశే కనిపించింది. గుడివాడ, గుడ్లవల్లేరులో పలకరించిన 10 మంది ఆటోడ్రైవర్లలో 8 మంది.. డీజిల్‌ ధర పెంచడం వల్ల ఏటా రూ.12,000 నష్టపోతున్నామని, ప్రభుత్వం ఇచ్చేది రూ.10వేలైతే.. తాము రూ.12 వేలు చెల్లిస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని