ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు.

Updated : 24 Apr 2024 10:23 IST

జగన్‌ అఫిడవిట్‌లో మాయాజాలం
విలువైన వాణిజ్య, నివాస భవనాల ఊసే లేదు
20 ఏళ్లలో రూ.1.74 కోట్ల నుంచి రూ.757 కోట్లకు చేరిన ఆస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా, ఆ సంస్థల వాస్తవ విలువలను పేర్కొనలేదు. ఇంద్రభవనం లాంటి లోటస్‌పాండ్‌ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనాల ఊసెత్తలేదు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులు రూ.757.65 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు, పెట్టుబడుల వాస్తవ విలువ లెక్కించినా కొన్నివేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సాక్షి దినపత్రికలో ఆయన కుటుంబానికి వాటాల విషయాన్ని ప్రస్తావించలేదు. వాస్తవానికి సాక్షిలో ఆయన కుటుంబసభ్యుల సంస్థదే మెజారిటీ వాటా.

కార్మెల్‌లో రూ.8లక్షల షేర్ల అసలు విలువ ఎంతంటే..

జగన్‌ తన అఫిడవిట్‌లో సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్‌ను తమ ఆస్తులుగా పేర్కొనలేదు. కానీ ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్‌లో 69.05% వాటా కార్మెల్‌ ఏషియా హోల్డింగ్‌ సంస్థకు ఉంది. జగతి పబ్లికేషన్స్‌ ప్రారంభ పెట్టుబడి రూ.73.56 కోట్లను ఈ సంస్థ సమకూర్చింది. వాస్తవానికి కార్మెల్‌లో జగన్‌ పెట్టుబడి రూ.8 లక్షలు. కానీ మిగతాది మొత్తం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొందరికి చేసిన మేళ్లకు ప్రతిఫలం. బెంగళూరులో జగన్‌ ఇంటి చిరునామాతో కార్మెల్‌ సంస్థను 2005 నవంబరు 13న ప్రారంభించారు. తాను రూ.8 లక్షలు, తనకు సంబంధించిన సండూర్‌ పవర్‌ నుంచి రూ.12 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సండూర్‌ పవర్‌ నుంచి వచ్చిన రూ.12 కోట్లు వ్యాపారం చేసి సంపాదించింది కాదు. మారిషస్‌కు చెందిన ప్లూరీ ఎమర్జింగ్‌, 2ఐ కేపిటల్‌ నుంచి వచ్చిన రూ.124.6 కోట్ల నుంచి కార్మెల్‌లోకి మళ్లించారు. కార్మెల్‌ ఏషియాలో ఒక్కో షేరు ముఖవిలువ రూ.10. కానీ తండ్రి నుంచి మేళ్లు పొందిన వివిధ కంపెనీలు రూ.252 ప్రీమియం చెల్లించి మొత్తం రూ.82.14 కోట్లు సమర్పించుకున్నాయి. కార్మెల్‌ నుంచి జగతిలోకి ప్రారంభ పెట్టుబడి కింద ఇలా రూ.73.56 కోట్లు వెళ్లాయి. జగతిలో ప్రారంభ పెట్టుబడి కింద ఒక్కో షేరు రూ.10 చొప్పున జగన్‌ తీసుకున్నారు. తర్వాత జగతిలోకి అక్రమ వసూళ్లు చేశారు. ఒక్కోషేరు రూ.360 చొప్పున (రూ.350 ప్రీమియంతో) వసూలు చేశారు. ఇలా సాక్షిలోకి మొత్తం రూ.1,246 కోట్లు రాబట్టారు.

ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌లో తాజా వివరాల ప్రకారం మొత్తం షేర్లు 10,65,58,481. ఇందులో కార్మెల్‌ ఏషియాకు ఉన్న షేర్లు 7,35,81,022. అంటే జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్‌ ఏషియా వాటా 69.05%. ఒక్కోషేరు విలువ రూ.360 లెక్కన జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్‌ ఏషియా సంస్థ వాటా విలువ రూ.2,648.91 కోట్లు అవుతుంది.

రెండు దశాబ్దాల్లో ఎన్ని రెట్లో!

జగన్‌ ఆస్తులు 20 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. 2004లో సమర్పించిన ఐటీ రిటర్నులో నికర ఆస్తుల విలువ రూ.1.74 కోట్లుగా చూపించారు. 2009 నాటికి దాన్ని రూ.77.39 కోట్లుగా చూపించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ భారీగా ఆస్తులు కూడబెట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజావనరులను కొందరికి దోచిపెట్టి, వారినుంచి ప్రతిఫలంగా కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారు. అక్రమ ప్రతిఫలాలతో చేసిన వ్యాపారాలతో ఆస్తుల విలువ 2011 నాటికి రూ.445 కోట్లకు చేరింది. 2019 నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత ఆస్తుల విలువ రూ.510 కోట్ల నుంచి రూ.757 కోట్లకు చేరింది. ఈ అయిదేళ్లలో ఆయన ఆస్తులు 48.45% పెరిగాయి.


క్లాసిక్‌ రియాల్టీ నుంచి ఏడాదికి రూ.52.72 కోట్ల లాభం

బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్డులో జగన్‌కు అయిదెకరాల స్థలంలో 7 అంతస్తుల్లో భారీ వాణిజ్య భవనం ఉంది. ఈ భవనం అప్పట్లో వైఎస్‌ఆర్‌ చేసిన మేళ్లకు ప్రతిఫలంగా చౌక ధరకే జగన్‌ పరమైంది. క్లాసిక్‌ రియాల్టీ పేరిట ఉన్న ఈ భవనంలో 99.99% వాటా జగన్‌ దంపతులదే. ఈ క్లాసిక్‌ రియాల్టీలో జగన్‌ పెట్టుబడి విలువ రూ.65.19 కోట్లు, భారతిరెడ్డి పెట్టుబడి విలువ రూ.4.55 కోట్లు కలిపి మొత్తం పెట్టుబడి విలువ సుమారు రూ.70 కోట్లు ఉన్నట్లు చూపించారు. అయితే క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ గడిచిన ఏడాదికి రూ.52 కోట్లకు పైగా లాభాన్ని చూపింది. 2011 నాటికే ఈ భవనం విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గడిచిన 13 ఏళ్లలో బెంగళూరులో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి. ఈ లెక్కన ఈ భవనం విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని