అవునా.. స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందా?

విశాఖ ఉక్కుకు జగన్‌ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

Updated : 24 Apr 2024 09:55 IST

ఏమీ తెలియనట్లు అడిగిన జగన్‌
వైకాపా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు విశాఖ ఉక్కు గురించి చూస్తానన్న సీఎం
మూడేళ్ల తర్వాత తనను కలిసేందుకు కార్మిక సంఘాలకు అనుమతి
మిగులు భూములు అమ్ముకోవాలని ఉచిత సలహా
వామపక్షాల అభ్యర్థిని విత్‌డ్రా చేయించి అమర్‌నాథ్‌ను గెలిపించాలట!

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు జగన్‌ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఆర్థికసాయం, సెయిల్‌లో విలీనం గురించి చెప్పేందుకు మూడేళ్లుగా కార్మిక, అధికారసంఘాల ప్రతినిధులు జగన్‌ను కలవాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎన్నికల వేళ మంత్రి అమర్‌నాథ్‌ ద్వారా స్టీలుప్లాంటు కార్మికసంఘాల నేతలను పిలిపించారు. బస్సుయాత్రలో భాగంగా విశాఖలోని ఎండాడలో జగన్‌ బసచేసిన శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, అధికార సంఘం ప్రతినిధులు కొందరు ఆయనను మంగళవారం కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్‌ స్టీలుప్లాంటు వ్యవహారంపై  స్పందించిన తీరుకు కార్మిక నేతలు నివ్వెరపోయారు. ‘తెదేపా-భాజపా-జనసేన కూటమిని ఓడించి గాజువాకలో అమర్‌ను గెలిపించండి. వైకాపా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు స్టీలుప్లాంటు సంగతి చూస్తా’ అని జగన్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాజువాకలో వామపక్షాల అభ్యర్థి జగ్గునాయుడితో విత్‌డ్రా చేయించి అమర్‌నాథ్‌కు మెజారిటీ తెప్పించి అప్పుడు ప్లాంటు గురించి అడగాలని సూచించినట్లు సమాచారం.

రాష్ట్రంలో స్టీలుప్లాంటుకు ఉన్న గర్భాం మాంగనీస్‌ గనులు, సారపల్లిలోని సిలికాన్‌ శాండ్‌ అనుమతుల గడువు పెంచాలని కార్మికసంఘాల నేతలు జగన్‌ను కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘స్టీలుప్లాంటులో ఇనుప ఖనిజం ఎక్కువ వాడతారు. తక్కువ వాడే మాంగనీస్‌, సిలికాన్‌ గురించి ఎందుకు? అది చిన్న అంశం’ అంటూ గనుల లీజు పొడిగింపుపై ఏమీ చెప్పకుండా దాటేశారు. వైకాపా అధికారంలోకి వస్తే.. స్టీలుప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం ఒడిశా నుంచి తెప్పించవచ్చని జగన్‌ తెలిపారు.

అధికారంలోకి వస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలతో మాట్లాడి ప్రత్యేక గనులు కేటాయించేలా చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో వైకాపా నేత విజయసాయిరెడ్డి... స్టీలుప్లాంటు కోసం పాదయాత్ర చేశారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ప్రైవేటీకరణ ఆపడానికి ఎంపీలతో సంతకాలు చేయించామంటూ ఓ లేఖను వెలుగులోకి తెచ్చి వైవీ సుబ్బారెడ్డి డ్రామాలాడారు. గత 1,300 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఆర్థికసాయం చేయాలని, సెయిల్‌లో విలీనం చేయాలంటూ కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.2వేల కోట్ల ఆర్థికసాయం చేయాలని జగన్‌ను కోరాయి. ఇవన్నీ తెలిసి కూడా... కార్మిక సంఘాలు ‘ప్లాంటులో జీతాలివ్వని పరిస్థితి నెలకొంది’ అని కార్మికసంఘాలు చెప్పగానే.. ‘అయ్యో... స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ తిరిగి ప్రశ్నించడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిగులుభూములు అమ్ముకుంటే నష్టాల నుంచి ప్లాంటు గట్టెక్కుతుందని ఒక ఉచిత సలహా సైతం ఇచ్చారట.

విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, వాయిదాల పద్ధతిలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ బకాయిలు చెల్లిస్తుందని, దానికి సహకరించాలని జగన్‌ను కార్మిక, అధికారసంఘ ప్రతినిధులు కోరారు. ‘డిస్కంకు రూ.లక్ష కోట్ల అప్పు ఉంది. మీరు కట్టకపోతే ఎలా?’ అంటూ జగన్‌ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని