ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!

ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది.

Published : 24 Apr 2024 06:48 IST

జగన్‌ జమానాలో వాడవాడలా.. గంజాయి, డ్రగ్స్‌
చాక్లెట్‌లు కొనుక్కోగలిగేంత సులువుగా అందుబాటు
బాధితులుగా లక్షల మంది యువత...వందల మంది ఆత్మహత్యలు
ఈనాడు, అమరావతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ ఐటీకి బ్రాండ్‌.. విభజన తర్వాత రూపుదిద్దుకుంటున్న అమరావతి మన బ్రాండ్‌...
జగన్‌ జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్‌, గంజాయికి బ్రాండ్‌గా ముద్ర పడింది.
‘ఆడుదాం ఆంధ్రా’ కాదు... ‘డ్రగ్స్‌ వాడుదాం ఆంధ్ర’ అన్నంతలా పరిస్థితులు దిగజారిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరేసరికి దీని విలువ రూ.25 వేల కోట్ల్ల పైనే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా వ్యవస్థీకృత దందా ఇంత భారీగా సాగుతుంటే ఉక్కుపాదం మోపి అణచి వేయాల్సిన జగన్‌... నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మొక్కుబడి సమీక్షలు, అమలుకు నోచుకోని ప్రకటనలివ్వడం తప్ప గత ఐదేళ్లలో గంజాయిని అరికట్టే కఠినచర్య ఒక్కటంటే ఒక్కటీ తీసుకోలేదు. మత్తు ముఠాలపై నిఘా లేదు. కింగ్‌పిన్‌ల ఆచూకీ కనిపెట్టలేదు. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి దాడులు నిర్వహించలేదు. స్మగ్లర్ల ఆస్తులు గుర్తించి జప్తు చేయలేదు. ఈ మత్తు మాఫియాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అష్ట దిగ్బంధనం చేయడం, లభ్యతే లేకుండా చూడటం వంటి వాటిపై అసలు దృష్టి పెట్టిందే లేదు. గంజాయి కట్టడిపై పనిచేసేలా ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు. పర్యవసానంగా ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకూ గంజాయి ఇప్పుడు పెనుసవాల్‌గా మారింది.

గంజాయి ఇచ్చి... బదులుగా డ్రగ్స్‌ తెచ్చి

విశాఖ మన్యంలో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. దీంతో మత్తు ముఠాలు కొన్నేళ్లుగా ఇక్కడ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తొలుత స్థానిక యువతకు అలవాటు చేసి వారినే సరఫరాదారులుగా మార్చుకుంటున్నాయి. పక్కదారి పట్టిన యువత ఈ రాకెట్లలో భాగస్వాములవుతున్నారు. గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపి అక్కడి నుంచి ఎల్‌ఎస్‌డీ వంటివి తెస్తున్నారు. తెలిసిన నైజీరియన్‌ ముఠాల ద్వారా బెంగళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి మత్తు మాత్రలు, ఇంజక్షన్లు తెప్పించుకుని సరఫరా చేస్తున్నారు. విశాఖలో ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ గుళికలు, కొకైన్‌ తదితర మత్తు పదార్థాలు పట్టుబడిన సందర్భాలెన్నో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లెహంగాల పార్సిల్‌లో మాదకద్రవ్యాలను పెట్టి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో బెంగళూరులో పట్టుకుంది. గంజాయే కాకుండా ఇలా ఖరీదైన మాదకద్రవ్యాలు ఏపీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న ఉదంతాలున్నాయి.


ఇదీ మత్తు లెక్క!

కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం గతేడాది పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక  ప్రకారం...


ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు 20.19 లక్షలు


మాదకద్రవ్యాలు వాడేవారిలో బాలలు: 3.17 లక్షలు   (15.70 శాతం)


గంజాయికి బానిసలు:4.64 లక్షలు


ఏపీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19 లక్షల మందిలో 22.98 శాతం మంది గంజాయి వాడుతున్నారు.


10-17 ఏళ్ల మధ్య వయసున్న 3.17 లక్షల మంది బాలలు మాదకద్రవ్యాలకు అలవాటుపడగా.. వారిలో 21 వేల మంది (6.62 శాతం) గంజాయికి బానిసలయ్యారు.


సియొర్రా లియోన్‌...

పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం..
అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యాలు...  
యువతకు ఉపాధి అవకాశాలు లేవు...
ఈ పరిస్థితుల్లో ఆరేళ్ల క్రితం ఆ దేశంలోకి ప్రవేశించిందో భూతం...
దాని పేరు ‘‘కుష్‌’’... ఓ మాదకద్రవ్యం.
అస్తవ్యస్త పరిస్థితుల్లో దాన్ని ఒంటపట్టించుకున్న సియొర్రా లియోన్‌ ఇప్పుడా మత్తులో ఊగిపోతోంది.
నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా యువత ‘‘కుష్‌’’ ఊబిలో కూరుకుపోయారు. వేలమంది
మరణిస్తున్నారు. దేశమంతా అతలాకుతలమైపోతోంది. దాన్ని అరికట్టలేక,  దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటీవల అక్కడ అత్యవసర స్థితి విధించారు.  


ఆంధ్రప్రదేశ్‌...

ఐదేళ్ల క్రితం.. ఒకేఒక్క అవకాశం అంటూ వచ్చాడో మాయలమారి..  అంతే... రాష్ట్రం అల్లకల్లోలమైంది
అభివృద్ధి ఆగిపోయింది... పరిశ్రమలు పారిపోయాయి.. ఉపాధి ఊసులేకుండాపోయింది
రాష్ట్రం గంజాయి, మాదకద్రవ్యాల అడ్డాగా మారిపోయింది.
వీధివీధిలో, సందు సందులో ఎక్కడ చూసినా అవే!
చిల్లర కొట్టుకి వెళ్లి చాక్లెట్‌లు కొన్నంత సులువుగా గంజాయి కొనొచ్చిక్కడ విద్యాసంస్థలనూ ఈ మత్తు కమ్మేసింది.
ఆ మత్తులో నేరాల సంఖ్యా పెరిగింది.  
దీన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన జగన్‌ సర్కారు పట్టించుకోకపోవటంతో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే.. సియొర్రా లియోన్‌ మాదిరిగానే ఏపీలోనూ అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితులొస్తాయేమో!


ఓపియెడ్స్‌, ఇన్‌హెలెంట్స్‌, సెడిటివ్స్‌కు సంబంధించిన మాదకద్రవ్యాల వినియోగం 17 ఏళ్ల లోపు బాలల్లోనూ, 18 ఏళ్లు దాటిన వారిలోనూ ఎక్కువగానే ఉంది.


రాష్ట్రంలో అత్యధికంగా 9.86 లక్షల మంది ఓపియెడ్స్‌కు బానిసలుగా మారారు. వీటి తర్వాత గంజాయి వినియోగమే ఏపీలో అధికంగా ఉంది.


నషా ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సహకారంతో (ఎన్‌సీబీ) ఈ జిల్లాలను గుర్తించాయి. ఆ జాబితాలో మన రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి. వీటిల్లో విశాఖ మన్యం గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా ఉంది.


జగన్‌ నివాసం సమీపంలోనే..

  • ముఖ్యమంత్రి జగన్‌ నివసించే తాడేపల్లికి సమీపంలోని వడ్డేశ్వరంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ ఇద్దరు యువకులు గతేడాది పట్టుబడ్డారు. బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ తెచ్చి విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తూ ముగ్గురు కొన్నాళ్ల క్రితం పట్టుబడ్డారు.
  • గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా ప్రజాప్రతినిధి బంధువు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. అయినా ఆయన్ని కేసులో నిందితుడిగా చేర్చకపోవటంతో కొన్నాళ్ల క్రితం లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆ విషయంలో మొదటి స్థానం...

పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. ఏ రాష్ట్రమైనా.. కేంద్రప్రభుత్వ శాఖలు విడుదల చేసే వివిధ రకాల ప్రగతి నివేదికల్లో, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో ముందువరసలో ఉండాలని అనుకుంటుంది. కానీ జగన్‌ జమానాలో ఏపీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో మూలమూలకూ గంజాయి, డ్రగ్స్‌ వ్యాపించాయి. అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు పట్టుకుంటున్నది 2 శాతమైనా లేదు. ఆ మాత్రానికే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తదితర విభాగాలు విడుదల చేసే నివేదికల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.


  • అత్యధికంగా గంజాయి పట్టుబడ్డ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 2019, 2021 సంవత్సరాల్లో మొదటిస్థానంలో, 2020లో రెండోస్థానంలో ఉంది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా... అందులో అత్యధికంగా 2,00,588 కిలోలు (26.75%) ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుబడింది. 2020లో దేశవ్యాప్తంగా 5,81,644 కిలోల గంజాయి పట్టుకోగా.. అందులో 97,826 కిలోలు (16.81%), 2019లో దేశవ్యాప్తంగా 3,42,044.87 కిలోలు పట్టుకోగా అందులో 70,229.77 కిలోలు (20.53%) ఏపీలోనే స్వాధీనం చేసుకున్నారు.
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌ఐ అధికారులు దేశవ్యాప్తంగా 34,002.60 కిలోల మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోగా.. అందులో సగం 18,267.84 (53%) ఏపీలోనే దొరికాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయి.
  • 2019 నుంచి 2022 మధ్య మొత్తం 30,483 మంది ఆత్మహత్యలు చేసుకోగా... వారిలో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారి బలవన్మరణాలకు పాల్పడిన వారు 1,638 మంది ఉన్నారు. రాష్ట్రం  డ్రగ్స్‌, గంజాయికి కేంద్రంగా మారిన ఫలితంగానే ఈ బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

ఉడ్తా ఆంధ్రా

డ్రగ్స్‌ పేరు చెబితే ఒకప్పుడు ఎవరికైనా గుర్తొచ్చే పేరు పంజాబ్‌. అలాంటిది ఆ రాష్ట్రంలో నాలుగేళ్లలో 306 మంది మత్తుబానిసలు ఆత్మహత్యలు చేసుకోగా... ఏపీలో అంతకు అయిదున్నర రెట్లు అధికంగా బలవన్మరణాలు జరిగాయి. విస్తీర్ణం, జనాభాపరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ నాలుగేళ్లలో 464 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరగడం ఇక్కడ మాదకద్రవ్యాల వినియోగం, వ్యాప్తి తీవ్రతకు నిదర్శనం. వీరిలో ఎక్కువమంది యువతే ఉండడం ఆందోళన కలిగించే పరిణామం.


రెండేళ్లలో 292.57 శాతం పెరుగుదల...

మాదకద్రవ్యాలకు అలవాటుపడి, బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ (ఎన్‌ఏపీడీడీఆర్‌)
కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో ఏపీ నుంచి 2018-19లో 1,752 మంది నమోదవగా.. 2020-21 నాటికి వారి సంఖ్య ఏకంగా 6,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 292.57 శాతం మంది నమోదుదారులు పెరిగారు. 2019-20తో పోలిస్తే 2020-21లో ఏకంగా 233.39 శాతం మంది పెరిగారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.


పట్టుబడింది రూ.800 కోట్లు పైనే.. అది 2 శాతమైనా ఉండదు

గన్‌ గద్దెనెక్కినప్పటి నుంచి 2022 వరకూ డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, పోలీసు, సెబ్‌ తదితర విభాగాలన్నీ కలిపి 5,33,620 కిలోల గంజాయి పట్టుకున్నాయి. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. విశాఖ మన్యం నుంచి ఏటా లక్షల కిలోల గంజాయి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు తరలిపోతోంది. అందులో పట్టుబడుతున్నది 2% కూడా లేదు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఇన్ని వందల కోట్లలో ఉందంటే...ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ ఎంత భారీగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని