జగన్‌ భక్త ఐపీఎస్‌లపై వేటు

అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది.

Updated : 24 Apr 2024 09:28 IST

నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా బదిలీ
వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ
నేటిలోగా ప్యానల్‌ పంపాలని సీఎస్‌కు ఆదేశం
ఈనాడు-అమరావతి

ధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా... ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి, తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా... ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్‌ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్‌ సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని పేర్కొంది.

కాంతిరాణాకు.. టాటా చెప్పిన ఈసీ

ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకుని కాంతిరాణా ఎగిరెగిరి పడ్డారు. అఖిలభారత సర్వీసు అధికారిననే విషయం మరిచిపోయి.. అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారు. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టారు. తెదేపాలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపా పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించటంలో కాంతిరాణా వెనక్కి తగ్గలేదు. తెదేపా, భాజపా, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది. తాను కళంకితుడిగా ఉంటూ.. వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారులందరి తరఫున వకల్తా పుచ్చుకుని మీడియా, ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతిరాణాకే చెల్లింది. ఇవే అంశాలతో ఐపీఎస్‌ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు. కాంతిరాణా భార్య ఐఆర్‌ఎస్‌ అధికారి. భువనేశ్వర్‌లో పనిచేస్తున్న ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి, వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైకాపా అరాచకాలకు మరింతగా కొమ్ముకాశారు.

అనంతపురం రేంజి డీఐజీగా పనిచేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పనిచేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోలేదు. అప్పటి ఎస్పీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

ముఖ్యమంత్రిపై గులకరాయి ఘటన.. వైకాపాకు మేలు కలిగేలా దర్యాప్తు

సీఎం జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతిరాణా వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌ కింద కేసు నమోదుచేసిన కాంతిరాణా... అందులో తెదేపా నాయకుల్ని ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తద్వారా వైకాపాకు మేలు కలిగించేలా దర్యాప్తు చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసులో తెదేపా నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని నాలుగైదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఆయన ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పెస్‌ పిటిషన్‌ వేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవడంతో ఇక తప్పక విడిచిపెట్టారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని దుర్గారావు మీడియాకు వివరించారు. జగన్‌పై గులకరాయి విసిరితే హత్యాయత్నం సెక్షన్‌ పెట్టిన కాంతిరాణా... 2022 నవంబరులో నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడిచేసిన ఘటనలో మాత్రం వెంటనే కేసు పెట్టలేదు. తర్వాత తప్పనిసరై ప్రమాదకర ఆయుధంతో దాడి (ఐపీసీ సెక్షన్‌ 324) కింద కేసు పెట్టేసి మమ అనిపించేశారు. అయినా ఇప్పటికీ నిందితులెవరో గుర్తించలేదు. అంతే కాదు.. ‘‘చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు.. వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చు’’ అని ఆ ఘటనపైన అప్పట్లో వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎం జగన్‌కు పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని ఇటీవల కాంతిరాణాను విలేకరులు ప్రశ్నించగా... కాదు, రాయి విసరటం వల్లే జరిగిందని చెప్పారు. అధికార, ప్రతిపక్షాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

హత్యాయత్నానికి తెగబడితే... వైకాపా నాయకులపై ఈగ వాలనివ్వలేదు

తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే... ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణా కొమ్ముకాశారు. చేత్తో కొట్టటం వల్లే కంటికి గాయమైందంటూ ఆ ఘటనను చాలా తేలిగ్గా తీసిపారేశారు. వెంటనే కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత కూడా తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. సంకల్పసిద్ధి కేసులో అధికారపార్టీ ముఖ్య నాయకుల్ని తప్పించారన్న ఫిర్యాదులున్నాయి. మంత్రి జోగి రమేష్‌.. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్తుంటే ఆ సమాచారం ముందుగానే తెలిసీ ఆయన్ను నిలువరించకపోగా.. పరోక్షంగా సహకరించారన్న విమర్శలున్నాయి. ఇటీవల నందిగామలో తెదేపా నాయకులపై దాడి జరిగితే రివర్స్‌లో బాధితులపైనే కేసులు నమోదుచేసిన ఘనత కాంతిరాణాదే.

ప్రతిపక్షాలపై అణిచివేత, కక్షసాధింపు వెనక మాస్టర్‌ మైండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కొనసాగిస్తున్న అణచివేత, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసుల వెనక మాస్టర్‌ మైండ్‌ నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులేనని ప్రతిపక్ష పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. తెరపై ఎక్కడా కనిపించకపోయినా... ప్రతిపక్ష నాయకుల్ని ఎవర్ని, ఎక్కడ దెబ్బతీయాలి? వైకాపా ప్రభుత్వంపై ఎదురుతిరుగుతున్న వారిపై ఎలా సామదానభేద దండోపాయాలు ప్రయోగించాలనే అంశాలపై వ్యూహరచన, అమలు అంతా పీఎస్‌ఆర్‌దేనని తెదేపా, భాజపా, జనసేన నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం కోసం మొత్తం నిఘావ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైకాపా నాయకులకు చేరవేయడానికి ఆంజనేయులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారు. నిఘా విభాగాధిపతిగా ఆయన్ను కొనసాగిస్తే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అది మరణశాసనం అవుతుంది’’ అంటూ ఎన్డీయే నేతలు ఇటీవల ఆయనపై సీఈసీకి ఫిర్యాదుచేశారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఆయన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులతో నిఘా విభాగాన్ని పూర్తిగా నింపేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఐఏఎస్‌ అధికారి గిరీశాపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుల్లో జరిగిన అవకతవకలపై సస్పెన్షన్‌కు గురై, మళ్లీ విధుల్లో చేరిన ఐఏఎస్‌ అధికారి గిరీశాపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ను నియమించింది. ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న గిరీశా లాగిన్‌ ఐడీని వినియోగించి కార్డులు డౌన్‌లోడ్‌ చేసినట్లు అభియోగాలున్నాయి. ఈ ఏడాది జనవరిలో గిరీశాను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ఇటీవలే ఆయన సస్పెన్షన్ను ఈసీ ఎత్తివేయడంతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. తనపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలని ఫిబ్రవరిలో గిరీశా ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 35వేల ఎపిక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


వైకాపాతో అంటకాగిన ఎస్‌బీ సీఐ గంగిరెడ్డిపై ఈసీ వేటు

మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదుల వెల్లువ

ఈనాడు, చిత్తూరు: చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)లో పనిచేస్తున్న సీఐ గంగిరెడ్డిపై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను ఎస్‌బీ నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులు కేటాయించకూడదని, పోలీసు హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేయాలని స్పష్టంగా పేర్కొంది. పేరుకే గంగిరెడ్డి పోలీసు అధికారి.. లోలోపల వైకాపాకు కరడుగట్టిన కార్యకర్త అనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కింది స్థాయి అధికారులు, సిబ్బందికి బహిరంగంగానే మౌఖిక ఆదేశాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. దీనికితోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగు శిష్యుడిగా పేరొందారు. అడుగడుగునా అధికార పార్టీకి అంటకాగి చివరకు తన పైస్థాయి అధికారినే బదిలీపై జిల్లా నుంచి తరిమేయించిన ఘన చరిత్ర ఆయనది. మంత్రి పెద్దిరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పుంగనూరు నుంచి ఎస్‌బీకి వచ్చిన ఆయన.. కొత్తగా వచ్చిన ఎస్పీ జాషువానూ తనదైన శైలిలో ప్రభావితం చేశారు. అటు ఎస్పీ, ఇటు మంత్రి అండతో సుధాకరరెడ్డి అనే డీఎస్పీని ఎస్‌బీ నుంచి పంపేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎస్‌బీలో సిబ్బందిని తనకు అనుకూలంగా బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇన్ని వివాదాల నేపథ్యంలోనూ ఆయన్ను నూతన ఎస్పీ మణికంఠ ఎస్‌బీ నుంచి ఎలక్షన్‌ సెల్‌కు పంపారు. అక్కడ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనపై వేటు పడింది.

ముందు నుంచీ అదే వైఖరి..

వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గంగిరెడ్డి పుంగనూరులో సీఐగా ఉన్నారు. అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల్లో భారీగా ఏకగ్రీవాలు జరగడంలో ఆయన పాత్ర కీలకం. దీనిపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయన్ను బదిలీ చేయాలని ఆదేశించగా, కోడ్‌ ముగియగానే మళ్లీ పుంగనూరుకు వచ్చారు. ఆపై చిత్తూరు తాలూకా స్టేషన్‌కు వెళ్లినా తీరు మారలేదు. జడ్పీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెదేపా నాయకుడు ఒకరిని స్టేషన్‌కు పిలిచి చేయి చేసుకోవడమే కాకుండా చిత్తూరులో కనిపించకూడదని ఆదేశించడం తీవ్ర దుమారాన్ని రేపింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తారని అనుకున్నా.. ‘పెద్ద’ మంత్రి అండతో లూప్‌లైన్‌లోకి వచ్చి కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు వేటు పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని