ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?

రాజీనామా చేశాక వాలంటీర్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 24 Apr 2024 06:29 IST

వివరాలివ్వాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజీనామా చేశాక వాలంటీర్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాలంటీర్లు తమ జేబుల్లో నుంచి సొమ్ము తీసి లబ్ధిదారులకు ఇవ్వడం లేదంది. వాలంటీర్ల మాట విని ఓటేసేంత బలహీనంగా ఓటర్లు ఉన్నారా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా ఈసీని ఆదేశించాలంటూ భారత ఛైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ‘అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ సర్క్యులర్‌ జారీ చేసింది. వాటిని అపహాస్యం చేసేలా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలిచ్చి, వైకాపాకు ప్రచారం చేస్తున్నారు. ఇలా రాజీనామా ఇచ్చి, వైకాపాకు ప్రచారం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. రాజీనామా చేసినవారు లక్షల మంది ఓటర్లను వైకాపాకు అనుకూలంగా ప్రలోభపెట్టే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. రాజీనామా చేయడం వాలంటీర్ల వ్యక్తిగత హక్కన్నారు.

రాజీనామా చేశాక మేం నియంత్రించలేం: ఈసీ

ఈసీ తరఫున న్యాయవాది సత్యశివదర్శిన్‌ వాదనలు వినిపిస్తూ.. రాజీనామా చేశాక వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనంలోకి రారన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను నియంత్రించలేమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని