షెడ్యూల్‌ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Published : 24 Apr 2024 06:30 IST

రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఓ రికార్డు
సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పట్టుబడిన దానికంటే ఇది రెండు రెట్లు అధికమన్నారు. ఎన్నికలకు ఇన్నిరోజుల ముందు ఇంత పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకోవడం ఓ రికార్డని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎలాంటి తావు లేకుండా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిరంతరం నిఘా పెడుతూ.. రాష్ట్రాన్ని జల్లెడపడుతోందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలను స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా నిర్వహించడమే మా ప్రధాన లక్ష్యం. సీఈఓ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, జప్తులపై పటిష్ఠ పర్యవేక్షణ, నియంత్రణను పకడ్బందీగా చేస్తున్నాం. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 424 తనిఖీ కేంద్రాల్లో సుమారు 358 కేంద్రాల (84.4%) నుంచి వెళ్లే వాహనాల కదలికలు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నాం’ అని తెలిపారు. ‘ఓటర్లపై మద్యం ప్రభావం ఉండకూడదనే లక్ష్యంతో అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని