కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 06:34 IST

హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన వివేకా కుమార్తె సునీత, తెదేపా నేత బీటెక్‌ రవి
నేడు విచారణ జరపనున్న ధర్మాసనం

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన తుది నివేదికలోని అంశాలు, ప్రజాబాహుళ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం, పబ్లిక్‌ రికార్డులను ఆధారం చేసుకుని మాత్రమే దావాలోని ప్రతివాదులు వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో కడప కోర్టు విఫలమైందన్నారు. కడప కోర్టు ఉత్తర్వులు.. ఓ రాజకీయ పార్టీపై ఉన్న అసమ్మతిని వ్యక్తం చేయకుండా నోరు మూయించడమేనని.. ఎన్నికల సమయంలో ఓ పార్టీకి అనుచిత లబ్ధి చేకూర్చడమే అవుతుందన్నారు.

ఈ తరహా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు

‘విచారణ పరరిధికి మించి కడప పీడీజే కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దావాలో ప్రతివాదులుగా ఉన్న వారి (వైఎస్‌ షర్మిల, నర్రెడ్డి సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, ఎ.రవీంద్రనాథ్‌రెడ్డి) వాదనలు వినకుండానే వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ సభ్యులపై పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కడప కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దావాకు విచారణ అర్హత లేదు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి’ అని కోరారు. వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎన్‌ విజయ్‌తో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యాజ్యాల విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు జస్టిస్‌ శేష  సాయి మౌఖికంగా తెలిపారు. వ్యాజ్యాలు తమ వద్దకు విచారణకు వచ్చాక తగిన ఉత్తర్వులిస్తామన్నారు. ఈ రెండు వ్యాజ్యాలు జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద బుధవారం కేసుల జాబితాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని