కళింగ నేలపై కపట ప్రేమ

సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’

Published : 24 Apr 2024 06:35 IST

వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
ఉద్దానానికి ఉపరితల జలాలంటూ ప్రచారానికే పరిమితం
పనులు పూర్తికాకుండానే పథకం ప్రారంభం
ఎన్నికల ప్రచారం కోసం నేడు శ్రీకాకుళం జిల్లాలో జగన్‌ పర్యటన

సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’

ప్రతిపక్ష నేత హోదాలో, ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లాకొచ్చిన ప్రతిసారి జగన్‌మోహన్‌రెడ్డి హామీలివి.

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే- సోంపేట, శ్రీకాకుళం అర్బన్‌, టెక్కలి, హిరమండలం: వంశధార నిర్వాసితుల ఆశలపై ముఖ్యమంత్రి జగన్‌ నీళ్లు చల్లారు. కాలువల ఆధునికీకరణనే మరిచారు. ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార ఉపరితల జలాలు అందిస్తున్నామంటూ అసలు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, సమస్యలు తీర్చకుండా సిక్కోలు ప్రజలను అడుగడుగునా వంచించిన జగన్‌.. ఓట్లు అడగడానికి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్దానం ప్రాంతానికి వంశధార నుంచి ఉపరితల జలాలు అందించేందుకు తలపెట్టిన వైఎస్‌ఆర్‌ సుజలధార పథకంలో భాగంగా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పరిధిలో ట్యాంకు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. కంచిలి మండలం జలంత్రకోట వద్ద నిర్మిస్తున్న గ్రౌండ్‌లెవెల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు కొలిక్కి రాలేదు. ఇక్కడ ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు పూర్తి కాలేదు. గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు తీసుకొచ్చేందుకు చేపట్టిన 866.08 కి.మీ.మేర అంతర్గత పైపులైన్‌ నిర్మాణం పూర్తికాలేదు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టిలలో కొన్ని గ్రామాలకు ఈ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందడం లేదు.

అనంతగిరి, కేదారిపురం, మామిడిమెట్టు, రఘునాథపురం, పాలవలస, సోంపేట, బలియాపుట్టి, జలంత్రకోట, సహలాలపుట్టుగ, ఇచ్ఛాపురం క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వకు ఆరు గ్రౌండ్‌లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, మరో ఆరు ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మించారు. క్లస్టర్‌ ప్రాంతం నుంచి గ్రామాల్లో నీటి సరఫరాకు 807 ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్లు అవసరం. 400 వరకు పాత ట్యాంకులు వినియోగిస్తూ నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. అవి 3, 4 దశాబ్దాల కిందట నిర్మించినవి. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల గుత్తేదారు పనులు పూర్తి చేయలేదు. గడువు దాటిన ఏడాదిన్నర తరువాత ఎన్నికల నేపథ్యంలో పనులు పూర్తి కాకుండానే జగన్‌ గతేడాది డిసెంబరు 14న పథకాన్ని హడావుడిగా ప్రారంభించారు. అన్ని గ్రామాలకు సుజలధార అందించాలంటే 388 ట్యాంకులు, 308 గ్రామాలకు ఇంటింటా కుళాయిలు ఏర్పాటుచేయాలి. ట్రయల్‌రన్‌లో భాగంగా లీకేజీలు, ఇతర సమస్యలు కనిపించాయి. అవి పరిష్కరించకుండానే పథకం ప్రారంభమైందని అనిపించేశారు.

వంశధార నిర్వాసితులను నిండా ముంచేశారు..

వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఆ మాటే మరిచారు. అదనపు పరిహారం కింద రూ.216 కోట్లు విడుదల చేసినప్పటికీ మండల, గ్రామస్థాయి వైకాపా నాయకులు సిఫార్సు చేసిన వారికే పరిహారం దక్కింది. అర్హులకు మొండిచేయే మిగిలింది. భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.12.16 కోట్ల బకాయిలున్నాయి. సాంకేతిక కారణాలతో మరో రూ.1.15 కోట్ల చెల్లింపులు నిలిచాయి. యువ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.11.98 కోట్ల బకాయిలున్నాయి. మరో రూ.1.31 కోట్లు సాంకేతిక కారణాలతో అందలేదు.

రూపాయీ విదల్చలేదు...

1.48 లక్షల ఎకరాలకు సాగునీరందించే వంశధార ఎడమ ప్రధాన కాలువ దారుణంగా తయారైంది. ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు పంపినా రూపాయి విదల్చలేదు. టెక్కలి డివిజన్‌లో శివారు ప్రాంతాలకు నీరందక గతేడాది నందిగాం మండల రైతులు వంశధార ఈఈపై దాడి చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో నీటి కోసం రైతులు తరచూ రోడ్డెక్కుతున్నారు.

కరకట్టలపై కనికరం లేదు..

వంశధార నదికి ఎడమ, కుడి వైపున వరద ప్రభావిత ప్రాంతాల్లో కరకట్టల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. 2007లో అప్పటి ప్రభుత్వం రూ.177 కోట్లతో చేసిన అంచనా విలువను వైకాపా ప్రభుత్వం రూ.865 కోట్లకు పెంచింది తప్ప పనులు ముందుకు తీసుకెళ్లలేదు.వరదల సమయంలో నదీపరివాహక ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని