మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు.

Published : 24 Apr 2024 06:36 IST

పది పరీక్షల్లో లాంగ్వేజీల్లోనూ వంద మార్కులు
అసర్‌, బేస్‌లైన్‌ సర్వేల్లో మాత్రం భిన్న ఫలితాలు
చిన్నచిన్న ఆంగ్ల పదాలు చదవలేక తడబాటు

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. తాజాగా ఈ ఏడాది రాష్ట్రంలో 86.69% మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు లాంగ్వేజీల్లోనూ గరిష్ఠ స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు. సాధారణంగా ఏ పరీక్షల్లోనైనా ప్రథమ శ్రేణి సాధించిన వారు తక్కువగా ఉంటారు. కానీ, పది ఫలితాల్లో ఇందుకు భిన్నంగా పాసైన వారిలో 69.26% మంది విద్యార్థులకు 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో పాసైన వారు 17.43% మాత్రమే. తెలుగు, హిందీ, ఆంగ్లం వంటి భాషా సబ్జెక్టుల్లోనూ గరిష్ఠ మార్కులు సాధించిన వారూ ఉన్నారు. ఇదేలా సాధ్యమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి గరిష్ఠంగా ఓ బాలికకు 599 మార్కులు రాగా, 597 వచ్చినవారూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది తెలుగు, హిందీ, ఆంగ్లం భాషా పరీక్షల్లోనూ 99 మార్కులు సాధించారు. లాంగ్వేజీ పేపర్లలోనూ గరిష్ఠ మార్కులు వేస్తున్నందున మూల్యాంకనంలో నాణ్యతపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయిస్తున్న దాఖలాలు లేవు. గణితం, సామాన్యశాస్త్రాల్లో విద్యార్థి బాగా రాస్తే వందకు వంద రావడం సహజం. కానీ, భాషా సబ్జెక్టుల్లో అనేక ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో విద్యార్థి అవగాహన, విశ్లేషణ, అభిప్రాయాల వ్యక్తీకరణను పరీక్షించే ప్రశ్నలుంటాయి. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు ఇదే పరిపూర్ణ సమాధానమని ఎలా అంచనాకు వస్తున్నారన్నది ప్రశ్న. లాంగ్వేజీల్లో బిట్‌ పేపర్‌ విధానం కూడా లేదు. 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేసి మార్కులు ఎలా వస్తున్నాయని విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సర్వేల్లో ఎందుకు వెనుకబాటు?

పదో తరగతిలో ఎక్కువ మందికి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వస్తున్నప్పటికీ, అభ్యసన సామర్థ్యాలపై నిర్వహించే సర్వేల్లో ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయి. పబ్లిక్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తున్నప్పుడు సర్వేల్లోనూ అది ప్రతిఫలించాలి కదా? కేరళను మించిన ఫలితాలు రావాలి కదా? ఎందుకీ వ్యత్యాసం? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

  • ప్రథమ్‌ సంస్థ నిర్వహించిన అసర్‌ సర్వే నివేదిక-2022 ప్రకారం ‘క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌’ వంటి ఆంగ్ల పదాలను ఒకటో తరగతి లోపే పిల్లలు నేర్చుకుంటారు. కానీ, ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారిలో 24.3% విద్యార్థులు ఈ పదాలను చదవలేకపోతున్నట్లు 2022 జనవరిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
  • ‘ఐ లైక్‌ టు రీడ్‌, వేర్‌ ఈజ్‌ యువర్‌ కౌ?, దిస్‌ ఈజ్‌ ఏ బిగ్‌ షాప్‌’ వంటి చిన్నచిన్న ఆంగ్ల వాక్యాలను 14-16 ఏళ్ల విద్యార్థుల్లో 28.9%, 17-18 ఏళ్ల వారిలో 23.6% మంది చదవలేకపోయారు. గతేడాది జనవరి 17న విడుదలైన అసర్‌ సర్వే నివేదిక-2023లో ఇది బహిర్గతమైంది.
  • ‘మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాం. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది’ ఇలా తెలుగులో ఇచ్చిన చిన్న పేరాను సైతం ప్రభుత్వ బడుల్లోని 4, 5 తరగతుల విద్యార్థుల్లో 65.04% మంది తప్పుల్లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతుల వారిలో 41.58% మంది చదవలేదు. ఈ బేస్‌లైన్‌ సర్వే చేసింది.. సాక్షాత్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. 2022లో ప్రథమ్‌ సంస్థతో కలిసి రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహిస్తే ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. కానీ, ఈ ఏడాది పదో తరగతి ఆంగ్ల పరీక్షలో 98.52% మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 92.32% ఫలితాలు వచ్చాయి. పబ్లిక్‌ పరీక్షల్లో ఇంతలా రాణిస్తుంటే ప్రథమ్‌ సంస్థ సర్వేల్లో చిన్నచిన్న పదాలను ఎందుకు చదవలేకపోయారన్నది ప్రశ్న? మాతృ భాష తెలుగులో వాక్యాలను చదవలేకపోతున్నా, తెలుగులో 90-100 మార్కులు సాధిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని