వాలంటీర్లపై రాజీనామా కత్తి

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు.

Published : 24 Apr 2024 06:37 IST

ప్రకాశం జిల్లాలో 198 మంది రాజీనామా
స్వయంగా లేఖలు తీసుకున్న దర్శి వైకాపా అభ్యర్థి శివప్రసాద్‌రెడ్డి

దర్శి, తాళ్లూరు, దొనకొండ, ఒంగోలు న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. దర్శి నగరపంచాయతీలో మొత్తం 152 మంది వాలంటీర్లు ఉండగా అధికారపార్టీ నాయకుల తీవ్ర ఒత్తిడితో 86 మంది రాజీనామా చేశారు. ముందుగా వీరంతా వైకాపా దర్శి అసెంబ్లీ స్థానం అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి స్థానిక పార్టీ కార్యాలయంలో రాజీనామా పత్రాలు అందించారు. అనంతరం నగరపంచాయతీ కమిషనర్‌ మహేష్‌కు రాజీనామా లేఖలు అందజేయడం గమనార్హం. తాళ్లూరులోని రెండు సచివాలయాలకు సంబంధించిన 30 మంది వాలంటీర్లు, దొనకొండ మండలంలోని చందవరం, పోలేపల్లి, కొచ్చెర్లకోట గ్రామాలకు చెందిన 18 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు తమ లేఖలను ఎంపీడీవోలకు అందజేశారు.

చీమకుర్తి పురపాలక సంఘంలోని వివిధ వార్డులో పనిచేస్తున్న 64 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ముందుగా వీరంతా అధికార పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశంలో పాల్గొని... అనంతరం ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఈశ్వరరాజుకు రాజీనామా పత్రాలు అందజేశారు. వాటిని వెంటనే ఆమోదించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని