బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్‌ గనులు

విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్‌ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.

Published : 24 Apr 2024 06:37 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ముడి ఖనిజం అందకుండా అడ్డగింత
దోపిడీలో వాటా కోసమే విజయనగరం వెళ్లిన జగన్‌
తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్‌ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. జిల్లాను బొత్స బంధువులు అప్పలనరసయ్య, అప్పలనాయుడు, చిన్న శ్రీను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. స్టీలు ప్లాంట్‌ గనులను కబ్జా చేసి, ఏ ముఖం పెట్టుకొని విశాఖవాసుల్ని ఓట్లు అడుగుతారని వైకాపా విశాఖ లోక్‌సభ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని పట్టాభి నిలదీశారు. ఈ దోపిడీలో తన వాటా నిధుల్ని రాబట్టుకునేందుకే సీఎం జగన్‌ విజయనగరం వెళ్లారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పట్టాభి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ముసుగులో జగన్‌ చేస్తున్న బస్సు యాత్రలు సెటిల్‌మెంట్‌ల కోసమేనని విరుచుకుపడ్డారు.

ప్లాంట్‌ యాజమాన్యం లేఖలకు దిక్కేది?

‘విశాఖ జిల్లా మెరకముడిదాం మండలంలో వెయ్యి ఎకరాల్లో గర్భాం మాంగనీస్‌ గనులున్నాయి. స్టీల్‌ ఉత్పత్తిలో మాంగనీస్‌ కీలకం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 2022 అక్టోబర్‌లో ఈ గనుల లీజు ముగిసింది. లీజు పొడిగించాలని కోరుతూ గడువుకు ముందే యాజమాన్యం 12 లేఖలు రాసింది. ఈ గనులు లేకపోతే బహిరంగ మార్కెట్‌లో టన్ను మాంగనీస్‌ను రూ.14-15 వేల పెట్టి.. అధిక ధరలకు కొనాల్సి వస్తుందని పేర్కొంది. దోచుకోవాలనే ఆలోచనతో ఉన్న జగన్‌ ప్రభుత్వం ఆ లేఖలకు స్పందించలేదు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కావాలనే లేఖలను తొక్కి పెట్టారు. స్టీల్‌ ఉత్పత్తిలో మరో కీలక ఖనిజం సిలికా కోసం చంపావతి నదిపై ఉన్న సరిపల్లి ఇసుక రీచ్‌ను గత ప్రభుత్వాలు స్టీల్‌ ప్లాంటుకు లీజుకిచ్చాయి. దాని లీజు 2023 ఏప్రిల్‌తో ముగిసింది. దాన్ని పొడిగించాలని లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదు’ అని పట్టాభిరామ్‌ దుయ్యబట్టారు. మాంగనీస్‌, సిలికా సరఫరాను అడ్డుకుంటే ప్లాంటు దెబ్బతింటుందని, తర్వాత పరిశ్రమ భూములను కబ్జా చేయొచ్చని జగన్‌ ఎత్తుగడ అని ఆరోపించారు. వనరుల దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర.. తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు సీఎం కావాలని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని